కేంద్రం చొరవ తీసుకోవాలని కోరాలి
మోడీ సర్కార్ యుద్ధాన్ని వ్యతిరేకించాలి
అమెరికా, ఇజ్రాయిల్ వైఖరితో ప్రజలకు ఇక్కట్లు :
మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవంలో బీవీ రాఘవులు
సీఎం దృష్టికి తీసుకెళ్తా : మంత్రి దనసరి సీతక్క
ఓంకార్ పోరాటస్ఫూర్తి ఆచరణీయం : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం లోని మోడీ ప్రభుత్వం చొరవ తీసుకొని, యుద్ధాన్ని వ్యతిరేకించి, దాన్ని నిలుపుదల చేయించేందుకు ముందుకు రావాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి. దీనిలో వామపక్షాలు, కాంగ్రెస్‌కు కూడా ఏ వ్యత్యాసం లేదు. బీఆర్‌ఎస్ కూడా వ్యతిరేకించకపోవచ్చు. ఇష్టం లేనిది ఒక్క బీజేపీకి మాత్రమే. కానీ బీజేపీ సోషల్ మీడియాలో కూడా యుద్ధం గురించి ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలి. ఇదే కామ్రేడ్ ఓంకార్‌కు ఇచ్చే నిజమైన నివాళి” అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. కామ్రేడ్ ఓంకార్ ఇప్పుడు అసెంబ్లీలో ఉండిఉంటే ఇదే తీర్మానాన్ని ప్రతిపాదించేవారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఎమ్‌సీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం సందర్భంగా ‘చట్టసభల్లో ఓంకార్ పాత్ర’ అంశంపై జరిగినసభలో రాఘవులు మాట్లాడారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడిచేస్తూ అక్కడి ప్రజల్ని చంపుతున్నదనీ, ఆ యుద్ధం వల్ల భారతదేశ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్యాస్ ధర పెరిగిందనీ, హోటళ్లు మూతపడుతున్నాయనీ, కిలో కట్టెలు రూ.7 నుంచి రూ,25కి పెరిగాయని వివరించారు. ఇదంతా ప్రధాని నరేంద్రమోడీ నిర్వాకంవల్లే జరిగిందని విమర్శించారు. అమెరికాకు లొంగిపోయి, దాసోహం అంటూ భారతీయుల ప్రయోజ నాలను వారికి పణంగా పెట్టారన్నారు. భారతీయుల ప్రయోజనం ప్రపంచశాంతితో ముడిపడి ఉందనీ, అయినా ఈ యుద్ధాన్ని మన దేశ ప్రభుత్వం వ్యతిరేకించలేదని చెప్పారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ ని చంపితే ఖండించలేని దుస్థితిలో మన దేశ పాలకులు ఉన్నారనీ, ఇరాన్‌లోని పాఠశాలపై అమెరికా, ఇజ్రా యిల్ దేశాలు దాడిచేసి పసిపిల్లల్ని చంపేస్తే మాట్లాడ ట్లేదని ఆక్షేపించారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా, ఇజ్రాయిల్ దాష్టీకాన్ని కాకుండా ఇరాన్ యుద్ధాన్ని ఆపా లని తీర్మానం చేస్తే దానికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం ఓటు వేసిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలేవీ ఇలా చేయలేదన్నారు. ఈ సందర్భంగా ఓంకార్‌తో తన కున్న వ్యక్తిగత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యల్ని శాసనసభలో ప్రతి బింబించడం, పాలకులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి సృష్టించడం ఓంకార్‌కే సాధ్యమైందన్నారు. కమ్యూ నిస్టులు ప్రజల్లో పనిచేస్తారనీ, వారికి సమస్యలు, పరిష్కారాలు తెలియడంతోపాటు పాలకవర్గాల నాడి కూడా తెలుస్తుందన్నారు. శాసనసభ వేదికను ప్రజల కోసం వినియోగించుకోవడాన్ని ఓంకార్ సులభతరం చేసి చూపించారనీ, పాలకులను వెనక్కి ఎలా నెట్టొచ్చో నిరూపించారని కొనియాడారు. దేశంలో ప్రయివేటీకరణ, సరళీ కరణ విధానాలు వచ్చాక అసెంబ్లీలు, పార్లమెంటు, పరిపాలనా వ్యవస్థలన్నీ ప్రజలకు వినియోగం కాకుండా పాలకవర్గాలకు మాత్రమే ఉపయోగపడేట్టు మార్పు చేయ డంలో పాలకులు జయప్రదం అయ్యారని చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థ నాశనం అవు తుంటే దాన్ని బాగుచేసుకోవడం కోసం ప్రజాస్వామ్య పోరాటం చేయడం కూడా ముఖ్యమై పోయిందన్నారు. నేటి పాలకులు ఆదివాసీలు మినహా ప్రజలందరినీ మార్కెట్ వ్యవస్థలోకి తేగలిగారని చెప్పారు. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టి, మొత్తం భూభాగాన్ని దోపిడీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నా రనీ, గిరిజనులు అదానీలు, అంబానీలతో పోరాడాల్సి వస్తుందని వివరించారు. అడవుల్లోని కొండలు, నీళ్లు, గనులు, ఇనుము, అల్యూమినియం, యురేనియం, బొగ్గు వంటివన్నీ స్వాధీనం చేసుకుంటున్నారనీ, దీనికి గిరిజనులు అడ్డంగా ఉన్నారనీ, మావోయిస్టులు వారికి అండగా ఉన్నారనే కారణంతో ఆపరేషన్ కగార్ పేరుతో వారిని చంపేస్తు న్నారని తెలిపారు. ఆదివాసీలకు పెద్ద కష్టం వచ్చిందనీ, వారికి అండగా దేశం, ప్రజలు ఉండాలని ఆకాంక్షించారు. కమ్యూనిస్టులంతా ప్రజలకోసం పనిచేస్తారనీ, పాలకులకోసం కాదని స్పష్టం చేశారు. సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలున్నా ప్రజా పోరాటాల్లో మాత్రం కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని నొక్కిచెప్పారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ఓంకార్ మహాయోధుడనీ, ప్రజాప్రతినిధిగా సుదీర్ఘకాలం ఉద్యమబాటలో ఉన్నారనీ, ఆయన మార్గం అచరణీయమన్నారు. కమ్యూనిస్టుల మధ్య ఎన్ని విభేదాలున్నా ఐక్యత కోసం ఆయన తాపత్రయపడేవారని చెప్పారు. ఎంసీపీఐ(యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ ప్రస్తుతం చట్టసభల్లో ప్రజా సమస్యల మీద ప్రశ్నించేవారు కాకుండా రాజకీయాలను వ్యాపార దష్టితో చూసే వారి సంఖ్య పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకిస్తున్న వాగ్దానాలు నెరవేర్చలేని పార్టీలు చట్టసభల్లో పోగవుతు న్నాయనీ, ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా దిగజారుతున్నాయన్నారు. ఓంకార్ వంటి నాయకులు చట్టసభల్ని వేదికగా చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటాలు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమానికి ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్య దర్శిగా దగోని రవి అధ్యక్షత వహించారు. సభలో సీపీఐ రాష్ట్ర నాయకులు, ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెవి చలపతిరావు, సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజరు కుమార్, జస్టిస్ చంద్రకుమార్, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్రకార్యదర్శి సిహెచ్.మురారి, ఎంసీపీఐ(యూ) కేంద్రకమిటీ సభ్యులు మర్రెడ్డి వెంకటరెడ్డి ఎన్ చంద్రశేఖర్, ఉపేందర్‌రెడ్డి, మోర్తల చందర్రావు, చెరుకు సుధాకర్ ప్రసంగించారు. అంతకు ముందు నాయకులు ఓంకార్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు.
మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ దళాల్లో ఉన్నప్పుడు కామ్రేడ్ ఓంకార్‌తో కలిసి నడిచిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. దళ కమాండర్‌గా తాను ఓంకార్ ప్రాతినిధ్యం వహించిన నర్సంపేట ఏరియాలో పనిచేశానని చెప్పారు. తెలంగాణలో విప్లవపోరాటం, త్యాగాలు లేకుండా చరిత్ర లేదన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఖండిచలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. బీవీ రాఘవులు సూచించిన తీర్మాన ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పోరాటయోధుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలు అందిపుచ్చుకోవాలనే అనేక ప్రభుత్వ సంస్థలకు విప్లవకారుల పేర్లు పెట్టామన్నారు. ఓంకార్ స్మృతివనం, విగ్రహ ఏర్పాటు, సూర్యాపేట జిల్లాకు బీఎన్ రెడ్డి పేరు పెట్టడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.



