భారత ప్రభుత్వం స్పందించాలి : ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దనిరసన ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ఇరాన్‌పై సామ్రాజ్యవాద అమెరికా, యూద దురహంకార ఇజ్రాయిల్ దాడిని అందరూ ఖండించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసి వందలాది మంది సాధారణ పౌరులను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద డా.బిఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను వెంటనే ఆపేయాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఇరాన్ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.
అంతర్జాతీయ సమాజం ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించాలని కోరారు. అమెరికా సామ్రాజ్యవాద ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నదని, గత నెలలోనే వెనిజులా అధ్యక్షులు మధురోని కిడ్నాప్ చేసి న్యూయార్క్‌లో నిర్బంధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని బాంబు దాడులతో హతమార్చిందని తెలిపారు. గతంలో ఇరాక్ అధ్యక్షులు సద్దాం హుస్సేన్‌ను, లెబనాన్ అధ్యక్షులు గడాఫీని ఇదే విధంగా హత్య చేసిన ఘటనలను గుర్తు చేశారు. ఖనిజాలు, సహజ వనరులపై, ఆయిల్ నిల్వలపై కన్నేసిన అమెరికా.. ఇరాన్‌ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకుని అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలను కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే ఇజ్రాయిల్‌తో కలిసి దాడులకు పాల్పడుతోందన్నారు. ఇజ్రాయిల్, అమెరికా కలిసి పాలస్తీనాను శ్మశానంగా మార్చాయని, ఇప్పుడు ఇరాన్‌పై గురి పెట్టాయని చెప్పారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధాలు చేసి సాధారణ ప్రజలను హతమార్చడం అన్యాయమన్నారు.
ఎంతో కాలంగా భారతదేశానికి మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నా భారత ప్రభుత్వం నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. అమెరికాకు భయపడి ప్రధాని మోడీ ఏం మాట్లాడటం లేదని విమర్శించారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో పని చేస్తున్న కోటి మంది భారతీయులకు ఉపాధి పోయే అవకాశం ఉందని, దిగుమతులపై పెద్ద ఎత్తున ధరలు పెరిగి భారత ప్రజలపై భారం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యుద్ధాన్ని నివారించడానికి భారత ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా పలు దేశాల వనరులను దోపిడీ చేస్తోందన్నారు. భారత ప్రభుత్వం వెంటనే అమెరికా, ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని ఖండించాలని, ప్రజాస్వామ్య దేశాలతో కలిసి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, కార్యదర్శులు మహమ్మద్ అలీ, ఇమామ్, కృష్ణ స్వామి, ఇబ్రహీం, షేర్ ఖాన్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.
ఇరాన్‌పై దాడిని ఖండించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



