Wednesday, January 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలులేబర్‌ కోడ్‌లపై ఇక సమరమే

లేబర్‌ కోడ్‌లపై ఇక సమరమే

- Advertisement -

మహిళా హక్కుల రక్షణే లక్ష్యం
సూక్ష్మ రుణ సంస్థల దోపిడీపై పోరు
కేరళ నమూనాకు జేజేలు
పలు తీర్మానాలకు ఐద్వా మహాసభ ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ సవాళ్లపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు సమరశంఖం పూరించాయి. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలు మహిళా కార్మికుల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హక్కుల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు చేపట్టాలంటూ మహాసభలు పిలుపునిచ్చాయి. ఇందుకు సంబంధించి మహాసభలో మూడో రోజైన మంగళవారం పలు తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఐద్వా ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయించింది.

తీర్మానాలివే…
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లు రాజ్యాంగ విరుద్ధం. 44 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా కేంద్రం మార్చింది. తద్వారా కార్మికులు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న హక్కులను ప్రభుత్వం హరిస్తోంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని 90 శాతం మంది మహిళా కార్మికులు, ఆశా, అంగన్‌వాడీ, గిగ్‌ వర్కర్లకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కరువయ్యాయి. సమాన పనికి సమాన వేతనం అమలు కాకపోగా, మహిళలకు పురుషుల కంటే 30 శాతం తక్కువ వేతనం ఇస్తున్నారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 12న జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మహిళా లోకానికి ఐద్వా మహాసభ తీర్మానం ద్వారా పిలుపునిచ్చింది.

మైక్రోఫైనాన్స్‌ దోపిడీపై పోరు…
మహిళలను అప్పుల ఊబిలోకి నెడుతున్న మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలపై మహాసభ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వడ్డీ రేట్లను నియంత్రించడానికి కఠినమైన చట్టం తేవాలని, కుటుంబ ఆదాయానికి మించి ఉన్న రుణాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాం కులు ఒంటరి మహిళలకు నాలుగు శాతం వడ్డీకే రుణాలను అందించాలని, సిబిల్‌ స్కోర్‌ నిబంధనలను సడలించాలని కోరింది. వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన మహిళా రుణ గ్రహీతల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి అప్పులను రద్దు చేయాలనే తీర్మానాన్ని ప్రతినిధి తపసి ప్రవేశపెట్టగా ఐద్వా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి బలపరిచారు.

కేరళ నమూనాకు జేజేలు…
దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. కేరళలోని వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ సంక్షేమ విధానాలను ఐద్వా మహాసభ కొనియాడింది. మహిళా సాధికారత, గృహిణుల శ్రమను గుర్తిస్తూ నెలకు రూ.వెయ్యి పెన్షన్‌ అందించే ‘స్త్రీ సురక్షా పథకం’, జెండర్‌ బడ్జెట్‌లో 20 శాతం కేటాయింపులు వంటివి దేశానికే ఆదర్శమని ప్రశంసించింది. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం చూపుతున్న చొరవ గొప్పదని ఐద్వా తన తీర్మానంలో పేర్కొంది.

పర్యావరణ విధ్వంసంపై ఆగ్రహం…
పర్యావరణ క్షీణత కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని, అది మహిళలపై జరుగుతున్న నిర్మాణాత్మక హింస అని మహాసభ తెలిపింది. కార్పొరేట్ల లాభాల కోసం హిమాలయాలను, అటవీ భూములను అప్పగించడం వల్ల నీటి ఎద్దడి, ఆహార అభద్రత ఏర్పడి మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.. పర్యావరణ నిబంధనలను బలహీనపరచడాన్ని తప్పుపడుతూ, బాధితులకు తక్షణమే ‘వాతావరణ విపత్తు సహాయ నిధి’ ద్వారా పరిహారం అందించాలని మహాసభ తీర్మానించింది.

ఆదివాసీ హక్కులపై కార్పొరేట్‌ గొడ్డలి…
దేశవ్యాప్తంగా ఆదివాసీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ.. సహజ వనరులను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేతపై ఐద్వా జాతీయ మహాసభ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జల్‌, జంగల్‌, జమీన్‌ (నీరు, అడవి, భూమి)పై ఆదివాసీలకు ఉన్న హక్కులను కాలరాస్తూ, అంతర్జాతీయ మైనింగ్‌ సంస్థలకు మోడీ ప్రభుత్వం ఏజెంట్‌గా వ్యవహరి స్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 2006లో వచ్చిన చారిత్రాత్మక అటవీ హక్కుల చట్టం ఆదివాసీ మహిళలకు కొండంత అండగా నిలిచిందని, అయితే గత పదేండ్లలో ఈ చట్టాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీన పరిచిందని మహాసభ పేర్కొంది. అదానీ, వేదాం త లాంటి బడా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన ‘గనులు, ఖనిజాల అభివద్ధి నియంత్రణ చట్టం-2025’ ఆదివాసీల జీవితాలను అతలాకుతలం చేస్తోందని ఐద్వా విమర్శించింది. గత నాలుగేండ్లలోనే సుమారు 5 నుంచి 7 లక్షల మంది ఆదివాసీలు తమ నివాసాల నుండి బలవంతంగా గెంటివేయబడ్డారని గుర్తు చేసింది.
ఆదివాసీ మహిళలకు ప్రధాన జీవనోపాధిగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కొత్తగా తెచ్చిన ‘వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఆఫ్‌ రోజ్‌గార్‌’ చట్టం ద్వారా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మహాసభ విమర్శించింది. దీనివల్ల ఆదివాసీ మహిళల్లో పోషకాహార లోపం, రక్తహీనత పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రజారోగ్యం వ్యాపారం కాదు..
ప్రజారోగ్య సేవలను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఐద్వా మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఆరోగ్య రంగాన్ని కేవలం లాభార్జన చేసే వ్యాపారంగా మార్చేసిందని విమర్శించింది. దేశంలోని ఆరోగ్య సేవల్లో 70 శాతం కార్పొరేట్‌ ఆస్పత్రుల ఆధీనంలోనే ఉన్నాయని మహాసభ పేర్కొంది. దేశంలోని మొత్తం బెడ్లలో 63 శాతం, డాక్టర్లలో 80 శాతం, నర్సులలో 70 శాతం ప్రయివేటు రంగంలోనే ఉన్నారని తెలిపింది. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టింది. ఆరోగ్యం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కని, దాన్ని ప్రయివేటు సంస్థల లాభాలకు బలి చేయకూడదని పేర్కొంటూ మహాసభ తీర్మానించింది. అందరికీ సరసమైన, నాణ్యమైన వైద్యం అందే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించింది.

ప్రభుత్వ పాఠశాలల మూత అన్యాయం…
విద్యా హక్కు చట్టం ఫలాలను బాలికలకు అందకుండా చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ఐద్వా మహాసభ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. పాఠశాలలను విలీనం చేయటమంటే పేద పిల్లలను చదువులకు దూరం చేయడమేనని తెలిపింది. 2014 నుంచి 2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 90 వేల కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి లేదా విలీనం అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు ప్రభుత్వ బడులు మూతబడుతుంటే మరోవైపు ప్రయివేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. ఇది పేదలకు విద్యను భారం చేస్తోందని ఐద్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ, డ్రగ్స్‌ మహమ్మారికి వ్యతిరేకంగా ఐద్వా మహాసభ తీర్మానించింది. ఉపాధి హామీ చట్టం నిర్వీర్యాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రతినిధి రమాదేవి మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దమయంతి నేగీ సమర్థించారు.

దళిత మహిళలపై ‘త్రివిధ’ అణచివేత
భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, గౌరవం, న్యాయం వంటి ప్రాథమిక హక్కులు దళిత మహిళల విషయంలో కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని ఐద్వా మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. కులం, లింగం, ఆర్థిక అసమానతలు ఏకమై దళిత మహిళలను సమాజంలో అట్టడుగు స్థాయికి నెట్టివేస్తున్నాయని తెలిపింది. కుటుంబం, మతం, సామాజిక ఆచారాలు, రాజకీయ వ్యవస్థల్లో పాతుకుపోయిన కుల వివక్ష వల్ల దళిత మహిళలు విద్య, భూమి, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఐద్వా గుర్తు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -