అందమంటే …?
నియమిత కొలతల దేహం కాదు ,
ఎర్ర తోలు, ఎండిన చెంపలు,
ఊసకాళ్లు, వాలే చేతులు ,
లిప్ స్టిక్ పెదాలు, దిగవిడిచిన కురులు,
సగం అవయవాలు ప్రదర్శించే బట్టలు,
ఇవే అందానికి కొలమానాలైతే ,
మా మైసక్క బాగోతంలో ఏషం కట్టినప్పుడు ,
మీ కంటే అందంగానే ఉంటుంది.
రంగస్థలం మీద మీరెన్నడూ చూడని
అధ్భుతాల్ని చూపిస్తుంది .
మీరు పిల్లి నడకలు నేర్చుకోవాలంటే,
మా గూడెంలో ఏ బుడ్డోడైనా చూపిస్తాడు.
మా గూడెం తల్లుల మాగిన దేహాలు ,
కష్ఠంతో కాంతులీనే శరీరాలు ,
మీ కంటే అత్యధ్బుతంగా ఉంటాయి.
కూలి తల్లుల చెమట చుక్కల నుండి పుట్టిన
అన్నం కదా ఈ సమస్త విశ్వాన్ని బతికించేది.
చిరుత పులితో పోట్లాడి విప్పపూలు తెచ్చుకునే,
గిరిజన చెల్లి శౌర్యంలో గదా అందం చూడాల్సింది .
విసునూరు దొరల మీద దండు కట్టిన ,
చాకలి ఆయిలమ్మ తెగువలో గదా ..
అందం కనిపెట్టాల్సింది.
సరోజినీ దేవి, లక్ష్మి సెహగల్,
సునీతా విలియమ్స్ , స్వరాజ్యం
వీరు కదా మహిళా జాతిలో నిజమైన
అందగత్తెలు, ఆదర్శమూర్తులు .
కాలి గోళ్ళ నుండి, తల వెంట్రుకల దాకా
కత్రిమ అందాలు పులుముకొని ,
రాంప్ మీద హొయలు పోతూ …
ఏం సందేశాన్నిస్తున్నారు ..?
కష్ఠం కన్ను తెలీకుండా
ఒళ్ళు చూపించి బతకండనే గదా ..?
స్త్రీ జాతికెంత అవమానం ..!
ఆడదాన్ని అంగడి సరుకుగా మార్చడానికి
కార్పొరేట్లు పన్నిన కుట్ర గాదా..?
సంస్కతి తెలియని పాలకులు,
వ్యాపారం తెలిసిన టైకూన్ల నడుమ
వీరో వింత జీవులు .
ఒక్కనాడు బురద మడిలో నాటేసి చూడు
కష్టమంటే ఏమిటో తెలుస్తుంది.
తట్టలో ఇటుకలను
బట్టీ మీదకు మోసిచూడు ,
నిజ జీవితం దర్శనమిస్తుంది.,
శ్రమ జీవులను గౌరవించడం నేర్చుకోండి.
శ్రమతోనే ఈ విశ్వం నిర్మితమైందని తెలుసుకోండి.
– పుప్పాల కష్ణ మూర్తి
అందం
- Advertisement -
- Advertisement -