మాంకాలి సుగుణ… పుట్టిన నాలుగు నెలలకు వికలాంగురాలయ్యారు. వయసు పెరిగే కొద్దీ నడవడానికి కాలు సహకరించపోతే కర్రను ఊతంగా పట్టారు. తనలాంటి వారు అనుభవిస్తున్న బాధలను ప్రపంచానికి తెలిపేందుకు అక్షరాన్ని నమ్ముకున్నారు. తన కష్టాలకు పరిష్కారం చదువొక్కటే అని నమ్మి ఉన్నత విద్యను అభ్యసించారు. ఉపాధ్యాయురాలిగా, సాహిత్య కారిణిగా, చిత్రకారిణిగా, సామాజిక సేవకురాలిగా, వికలాంగుల హక్కుల కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
సుగుణ తల్లిదండ్రులు మల్లవ్వ, లింగయ్య. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరి సొంత ఊరు సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం, గూడెం గ్రామం. సుగుణకు అన్న, అక్క, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. సుగుణకు నాలుగు నెలల వయసులో జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళతారు. అక్కడ ఇచ్చిన ఇంజక్షన్ ప్రభావంతో కాలు పని చేయడం మానేసింది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలీ పని చేసుకుంటూ, జీతం ఉంటూ ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. తమను పెంచడం కోసం తల్లి పడుతున్న కష్టాన్ని చూసి సుగుణ చలించి పోయేవారు. పెద్దైన తర్వాత తల్లికి అండగా నిలవాలని క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకున్నారు.
చిత్రకళలో…
బేగంపేట గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి పదో తరగతి వరకు మల్లాపూర్ గురుకుల పాఠశాలలో చదివారు. కరీంనగర్‌లోని సుభాష్ నగర్ గురుకుల కళాశాలలో ఇంటర్, మహిళా డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేట్, శాతవాహన యూనివర్సిటీ నుంచి ఏం.ఏ. తెలుగు, ఎం.ఏ. అర్థశాస్త్రం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తి చేశారు. చిన్నతనం నుండి ఏ చిత్రం చూసినా వెంటనే దాన్ని గీయడం సుగుణకు ఎంతో ఆసక్తి. తన ఆసక్తికి పదును పెట్టుకునేందుకు జెటీసీసీ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చేరి కోర్సు పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. అక్కడ చిత్రకళలో అనేక మెళకువలు నేర్చుకున్నారు.
ప్రజల కోసమే కవిత్వం
చదువుతో పాటు కవితలు, కథలు, పాటలు రాసేవారు. తల్లి పాడే పాటలు వింటూ తను కూడా పాడాలని నేర్చుకునేవారు. అలా పాడటమే కాకుండా తాను చూస్తున్న, అనుభవిస్తున్న కష్టాలను పాటల రూపంలో అక్షరీకరించేవారు. సమాజంలో జరిగే సంఘటనలు చూసి ప్రజల కోసం కవితలు రాసి వినిపించేవారు. తన కవిత్వం ఎప్పుడూ ప్రజల పక్షమే అంటారు ఆమె. అలా ఆమె రాసిన కవితలకు ప్రముఖ రచయితల నుండి ప్రశంసలు అందుకుంటూ చిన్ననాటి నుండి సాహిత్య సేద్యం చేస్తున్నారు.
హృదయాన్ని కదిలించేలా…
పేద వాడి గుండె చప్పుడు అనే కవితలో ‘మరువలేని పేదరికం/ మాటు వేసిన వేటగాడిలా/ జన జీవన సంగ్రామంలో గర్జించిన పేదరికం../ అంటే దైవదూత రైతన్న కవితలో ‘పొలం గట్టుపై మోటలు కొట్టే రైతన్న/ నీ తలరాతను మార్చే శక్తి లేనే లేదన్న/ నారుమడి దున్నుతూ/నడ్డి విరిగేలా చేసినా/నీ నోట్లోకి బుక్కెడు బువ్వ దొరకదు/గుక్కెడు నీల్లుండవు/నీ చెమట చుక్కలు ఏరులై పారినా/నిన్ను మందలించే దిక్కే లేదు.. అంటూ రాసుకున్నారు.
వికలాంగురాలిగా…
సుగుణ ఆరవ తరగతిలో ఉండగా స్కూల్లో పద్మజ మేడం పద్యాలు పాడుతూ ఉంటే ఆమెను స్ఫూర్తిగా తీసుకొని తనూ పాటలు పాడేవారు. ఇంట్లో తల్లీ, బడిలో పద్మజ టీచర్ ప్రోత్సాహంతో అందంగా పాడటం నేర్చుకున్నారు. ఇప్పటి వరకు 500 పైగా కవితలు, 60కి పైగా పాటలు, రెండు కథలు రాశారు. పేదలు, రైతుల బతుకులు, స్త్రీలపై కొనసాగుతున్న వివక్ష, గురువులు, స్నేహం ప్రాధాన్యత, దేశభక్తి, తెలంగాణ, ప్రకృతి.. ఇలా అనేక అంశాలపై ఆమె కవితలు రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఓ వికలాంగురాలిగా ఉన్న ఆమె పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఎన్నో కవితలు, పాటలు రాశారు. తనలోని ప్రతిభతో ఒకప్పుడు తనను అవమానించిన వారి నోర్లు మూయించారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి తానేమీ తక్కువ కానని నిరూపిస్తున్నారు.
ప్రతిభకు దక్కిన గౌరవం
సాహిత్యానికి, వికలాంగుల కోసం ఆమె చేస్తున్న కృషికి గాను అనేక అవార్డులు, పురస్కారాలు లెక్కకు మించిన ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 2009లో జగిత్యాలకు చెందిన ఓ సాహితీసంస్థ నిర్వహించినా జిల్లా స్థాయి పోటీల్లో అమ్మపై రాసిన కవితకు ప్రోత్సాహ బహుమతి అందుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అంటున్నారు. సావిత్రిబాయి పూలే క్రాంతిజ్యోతి మహిళా సాధికారత స్వచ్చంధ సేవా సంస్థ సభలో ఉగాది నంది పురస్కారం, ప్రశంస పత్రం అందుకున్నారు. 2021లో ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో పరిమళాలు ప్రక్రియలో 25 పాటలు రాసి ‘రత్న పురస్కారం’ అందుకున్నారు. 2022 తెలంగాణ దివ్యాంగుల కళా పురస్కారం, ఉమెన్స్ డే ఐకాన్ అవార్డు, అంబేద్కర్ సేవా పురస్కారం, మల్టీ టాలెంటెడ్ అవార్డు అందుకున్నారు. అలాగే 2023లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచే వికలాంగులకు అందించే వాసవి నంది సేవ పురస్కారం అందుకున్నారు. 2024లో ‘హృదయ విరుల’ పేరుతో తన మొదటి పుస్తకాన్ని ముద్రించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వృత్తి జీవితం
2009లో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆర్ట్స్ కరీంనగర్‌లో ఏడాది పని చేసారు. 2010లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ బార్సు హుస్నాబాద్‌లో చేశారు. సరస్వతి జూనియర్ కాలేజీ బెజ్జంకిలో సివిక్స్ లెక్చరర్‌గా చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ బార్సు జగిత్యాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా చేశారు. 2019 నుండి మాతృభాషపై ఉన్న మమకారంతో బెజ్జంకి మోడల్ స్కూల్లో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లా పట్టభద్రుల దివ్యాంగుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే DASF (Differently able social forum) యూట్యూబ్ ఛానల్‌లో వికలాంగుల వార్తలు చదువుతున్నారు.
బోనసి రేణుక, జర్నలిజం విద్యార్థి కాకతీయ విద్యాలయం