అన్ని విజ్ఞానశాస్త్రాలకు జన్మస్థలం విద్య
సోషలిజంలోనే అందరికీ సమాన అవకాశాలు
లౌకికత్వం లేకపోతే సర్వమత సమానత్వం ఉండదు : జియావుద్దీన్ సంస్మరణ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని, ఏఐఏడబ్ల్యూయూ బి.వెంకట్, ఎస్టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి
ఖమ్మంలో ‘సర్’ సంస్మరణ సభకు భారీగా హాజరైన పూర్వ విద్యార్థులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జియావుద్దీన్ సర్ ఉత్తమ కమ్యూనిస్టు అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే మనముందున్న కర్తవ్యమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. అన్ని విజ్ఞానశాస్త్రాలకు విద్యమాత్రమే జన్మస్థలమని, అటువంటి విద్యలో విద్యార్థులు రాణించేలా కృషి చేశారని తెలిపారు. యూటీఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు, జెడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ జియావుద్దీన్ సర్ సంస్మరణ సభ ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్‌లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సభలో తమ్మినేని మాట్లాడుతూ.. మార్క్సిజం, లెనినిజం స్పృశించే అన్ని పార్శ్వాలను జియావుద్దీన్ అనుసరించారని తెలిపారు. పార్టీ మండల కార్యదర్శి నుంచి జిల్లా కమిటీ సభ్యునిగా సైద్ధాంతికంగా ఎదిగారన్నారు. నదికి జన్మస్థానంతో పాటు ముగింపు సముద్రమనట్టే ఆయన ఉపాధ్యాయ వృత్తి, ఉద్యమాలను మేళవించి పనిచేశారని తెలిపారు. ఉత్తమ కమ్యూనిస్టు అంటే జియావుద్దీన్ సర్‌ను చూపించొచ్చ న్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. లౌకికతత్వం లేకపోతే సర్వమత సమానత్వం మనజాలదని పేర్కొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. విదేశాలపై ఆధారపడటాన్ని ప్రధాన శత్రువుగా ప్రధాని నరేంద్రమోడీ ఇన్నాళ్లకు గుర్తించారన్నారు. కమ్యూనిస్టు దేశం చైనా 80శాతానికి పైగా ఉత్పత్తులను స్థానిక మార్కెట్‌లో విక్రయించు కుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపించేది ఒక్క కమ్యూనిజం మాత్రమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు బాగా చదవా లని, వారిలో స్వావలంబన తీసుకురావాలని కృషి చేసిన వారిలో జియావుద్దీన్ సర్ ఒకరని తెలిపారు. ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. జియావుద్దీన్ సర్ కృషి, త్యాగాలు చరిత్రాత్మకమని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించే వారని, స్కూల్‌లోనే కూరగాయలు పండించి చక్కని మెనూ అమలయ్యేలా చూశారని గుర్తుచేశారు. కాగా, జియావుద్దీన్ సంస్మరణ సభకు ఆయన శిష్యులు భారీగా తరలివచ్చారు. జియావుద్దీన్ సర్ పనిచేసిన చింతూరు, వీఆర్‌పురం, దమ్మపేట మండలాల్లోని కొత్తూరు నారాయణపురం, సోములగూడెం, గూడూరు, మూల పోచారం, ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం హాజరయ్యారు.
సర్ తమకు నేర్పిన విద్యాబుద్ధులు, క్రమశిక్షణ కారణంగానే తాము ఈ రోజు టీచర్లు, వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డామని గర్వంగా చెప్పుకొచ్చారు. అనంతరం ‘జియావుద్దీన్’పై ‘నవతెలంగాణ’ ప్రచురించిన ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. జియా సర్ చనిపోయేంత వరకూ ధరించిన యూటీఎఫ్ గోల్ ఉంగరాన్ని కుటుంబ సభ్యులు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా కమిటీలకు అందజేశారు. దాన్ని ఆయన జ్ఞాపకార్థం అలాగే ఉంచుతామని యూటీఎఫ్ నాయకత్వం ప్రకటించింది. ఈ సంస్మరణ సభలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, జిల్లా అధ్యక్షులు రంజాన్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, కళ్యాణం వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ కమ్యూనిస్టు జియావుద్దీన్ సర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES