Monday, December 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబుక్‌ఫెయిర్‌ లెక్కలు చూపలేదు

బుక్‌ఫెయిర్‌ లెక్కలు చూపలేదు

- Advertisement -

ఓ కన్వెన్షన్‌ సెంటర్‌కు రూ.32 లక్షల మళ్లింపుపై అనుమానాలు
అందుకే చంద్రమోహన్‌కు స్టాల్‌ నిరాకరించాం
ఇదే విషయాన్ని మే నెలలోనే స్పష్టం చేశాం
తెలంగాణ సమాజానికి అంటగట్టడం సరిగాదు
లెక్కలు చూపుతామని లిఖితపూర్వక లేఖ ఇస్తే స్టాల్‌ ఇచ్చేందుకు సిద్ధం
కవులు, మేధావులు, రచయితలు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం : హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు యాకూబ్‌, ఆర్‌.వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌(హెచ్‌బీఎఫ్‌)కు 2014 నుంచి 2022 వరకు కొనసాగిన కార్యవర్గం హయాంలో బ్యాంకు ఖాతాల నిర్వహణ, నిధుల మళ్లింపుపై అనేక అనుమానాలున్నాయి. హెచ్‌బీఎఫ్‌కు అధికారిక బ్యాంకు ఖాతా ఉండగానే ది హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ పేరుతో పాత కమిటీ బ్యాంకు ఖాతా నిర్వహించడం, ఆ ఖాతా నుంచి రూ.32 లక్షలను ఓ కన్వెన్షన్‌ సెంటర్‌కు దారిమళ్లించడం, పదవీకాలం అయిపోగానే ఆ ఖాతా క్లోజ్‌ చేయించడం వంటి అంశాలపై వివరాలు అడిగితే అప్పటి అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న జూలూరి గౌరీశంకర్‌, చంద్రమోహన్‌, కోశాధికారిగా ఉన్న రాజేశ్వరరావు దాటవేస్తున్నారు. లెక్కలు చూపకపోవడం, బుక్‌ఫెయిర్‌ కమిటీకి విరుద్ధంగా వ్యవహరించడం వల్లనే చంద్రమోహన్‌కు స్టాల్‌ ఇవ్వడానికి నిరాకరించాం. వివరాలు చెప్పాలని పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదు.

వివరాలివ్వకపోతే ఈ సారి స్టాల్‌ ఇవ్వబోమని మే నెలలోనే స్పష్టం చేశాం. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా స్టాల్‌ కేటాయించలేదని సోషల్‌మీడియా వేదికగా చంద్రమోహన్‌ ప్రచారం చేయడం తగదు. తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతున్నట్టు ప్రచారం చేయడం దుర్మార్గం. కవులు, మేధావులు, రచయితలు, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బుక్‌ఫెయిర్‌కు సంబంధించిన లెక్కలను వారం రోజుల్లో చూపుతానని చంద్రమోహన్‌ లిఖితపూర్వకంగా హామీనిస్తే స్టాల్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు యాకూబ్‌, కార్యదర్శి ఆర్‌.వాసు, ఉపాధ్యక్షులు కె.బాల్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో గల హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

1986 నుంచి కాచిగూడలోని బీఓఐలో అధికారిక ఖాతా ఉండగా.. రిజిస్ట్రేషన్‌ లేకుండానే 2021లో ఐసీఐసీఐ బ్యాంకులో, 2016లో ఎస్‌బీఐలో కొత్త ఖాతాలు ఎందుకు తెరవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎస్‌బీఐ ఖాతా నుంచి 2018లో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌కు సుమారు రూ. 11.50 లక్షలు చెల్లించడం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు. 2017 మార్చి నెలలో 15 రోజుల్లోనే నగదును పెద్ద ఎత్తున ఎందుకు ఉపసంహరించారు? అంత అవసరం ఏమొచ్చింది? గతంలో నిర్వహించిన 8 ప్రదర్శనలకు సంబంధించి ఫుడ్‌ స్టాల్స్‌, టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం బ్యాంకు ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హెచ్‌బీఎఫ్‌కు అధికారిక బ్యాంక్‌ ఖాతా ఉండగా, ‘ది హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’ పేరిట రిజిస్ట్రేషన్‌ లేని మరో అకౌంట్‌ను తెరిచి నిధులు దారిమళ్లించారని ఆరోపించారు.

ఎస్‌బీఐ ఖాతా నుంచి ఒక కన్వెన్షన్‌ సెంటర్‌కు రూ. 32 లక్షలు బదలాయించారనీ, రూ.10 లక్షల నగదు విత్‌ డ్రా చేశారని ఆధారాలతో సహా వెల్లడించారు. జిల్లాల్లో జరిగిన ప్రదర్శనలకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం, టికెట్లు, ఫుడ్‌ కోర్టుల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడా బ్యాంకులో జమ చేయలేదని ఎత్తిచూ పారు. నిధుల దుర్వినియోగంపై మూడు సార్లు నోటీసులు ఇచ్చినా గత బాధ్యులు స్పందించలేదన్నారు. కమిటీ సమావేశంలో వారి సభ్యత్వాలను తాత్కాలికంగా రద్దు చేసి ‘బ్లాక్‌ లిస్ట్‌’లో పెట్టాలని నిర్ణయించామన్నారు. పదేండ్లుగా ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయలేదనీ, అసలు క్యాష్‌ బుక్‌, ఓచర్లు కూడా అప్పగించలేదని ఎత్తి చూపారు. కొత్త కార్యదర్శి ఎన్నికైనా పాతవారే సిగేటరీలుగా కొనసాగడం తీవ్ర ఆర్థిక నేరం కిందకే వస్తుందన్నారు. బుక్‌ ఫెయిర్‌ కార్యాలయాన్ని సొంత అవసరాలకు వాడుకోవడాన్ని ఎత్తిచూపారు. ఈ అక్రమాలపై వివరణ ఇవ్వాలని గత కమిటీ బాధ్యులైన జూలూరి గౌరీశంకర్‌, కోయ చంద్రమోహన్‌, పి. రాజేశ్వర రావులకు మూడుసార్లు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. వివరణ ఇవ్వాల్సింది పోయి.. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత కమిటీపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -