Friday, October 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅట్టుడుకుతున్న 'అడవి'

అట్టుడుకుతున్న ‘అడవి’

- Advertisement -

వరుస వివాదాలతో అటవీశాఖ విమర్శలపాలు
ఆరుగురు సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధం
ఎఫ్‌ఆర్వో ల్యాప్‌టాప్‌ నుంచే మార్ఫింగ్‌ ?!
రేంజర్‌ను సేవ్‌ చేసేందుకు సీసీఎఫ్‌ యత్నాలు?
‘సండ్ర’ విచారణ సాగుతుండగానే ‘ఫారెస్టు’లో మరో వివాదం
ఈ అంశంలోనూ కొందరిపై చర్యలకు చాన్స్‌..!


నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అటవీశాఖ అట్టుడుకుతోంది. రోజుకో వివాదంతో విమర్శల పాలవుతోంది. కారణాలు ఏవైనా శాఖలోని ఆరుగురు సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఓవైపు సండ్ర కర్ర విచారణ నడుస్తుండగానే మరోవైపు గాంధీ జయంతి రోజున అటవీ శాఖ సిబ్బంది మేకపోతును కోసుకు తిన్న ఉదంతం చర్చనీ యాంశంగా మారింది. జంతువులను సంరక్షిం చాల్సిన అటవీశాఖ సిబ్బంది గాంధీ జయంతి రోజున మేకను కోసుకొని ఎంజారు చేయడ మేంటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ వ్యవహారంలో నలుగురైదుగురు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సండ్ర కర్ర వివాదం సైతం కొత్త మలుపు తీసుకుంటోంది. ఎఫ్‌ఆర్వో ల్యాప్‌టాప్‌ నుంచే మార్ఫింగ్‌ జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. భద్రాద్రి జోన్‌ చీప్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌) బీమానాయక్‌ ఆ రేంజర్‌ను రక్షిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తీసు కుంటుందోనని అటవీ శాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ఎఫ్‌ఆర్వో ల్యాప్‌టాప్‌ నుంచే మార్ఫింగ్‌..!
ఎన్టీపీసీ పోర్టల్‌ ద్వారా పొందిన ఎన్‌వోసీని ఎఫ్‌ఆర్వో ల్యాప్‌ నుంచే మార్నింగ్‌ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విచారణలో ఈ విషయం వెలుగు చూసినా సీసీఎఫ్‌తో ఎఫ్‌ఆర్వో తో ఉన్న సాన్నిహిత్యం మూలంగా చర్యలు తీసుకునే విషయమై సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తున్నది. సండ్ర (ఖ్కెర్‌) కలపను రవాణా చేయాలంటే ఎఫ్‌ఆర్వో క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. సిబ్బందితో కొలతలు తీయించాలి. సంబంధిత ఫొటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే డీఎఫ్‌వో అనుమతి ఇస్తారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి అయితే కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. అయితే సర్కారు తుమ్మ పేరిట సులువుగా ఎన్టీపీసీ పోర్టల్‌ ద్వారా కలప అక్రమవ్యాపారులు నో అబ్జక్షన్‌ (ఎన్‌వోసీ) తీసుకున్నారు. ఈ వ్యవ హారం అంతా ఎఫ్‌ఆర్వో ల్యాప్‌ టాప్‌ నుంచి జరిగినా ఆయన ప్రమేయం లేనట్టు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

తుమ్మ తరలింపు పేరిట పర్మిట్లు
చింతకాని మండలానికి చెందిన ఓ రైతు పేరిట సర్కారు తుమ్మ తరలిస్తున్నట్టు 20 పర్మిట్లు తీసుకున్నారు. 20 నకిలీ ఎన్‌వోసీలతో 171 క్యూబిక్‌ మీటర్ల సండ్రను అక్రమంగా రాష్ట్రం దాటించారు. ఆరునెలల క్రితం మామిడి చెట్లు నరికి తరలించేందుకు ఆ రైతు అనుమతి తీసుకుంటే దాన్ని స్మగ్లర్లు ఈ రకంగా మార్ఫింగ్‌ చేయటం సంచలనంగా మారింది. అప్పటి బిల్లులోని పేరు, సర్వే నంబర్‌, తుమ్మ బిల్లుల్లో కలప జాతి, గమ్యస్థానం ఇవన్నీ మార్చి సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన ఓ లారీ ఏజెంట్‌ ఈ దందాకు తెరదీసినట్టు అధికారులు గుర్తించారు. ఒకే రైతు, ఒకే సర్వే నంబర్‌ పేరిట నాలుగు నెలలుగా 20 బిల్లులకు అనుమతులు పొందుతుంటే.. ఎఫ్‌ఆర్వో, ఎఫ్‌ఎస్వో, ఎఫ్‌బీవో.. ఎలా ధ్రువీకరించారనే ప్రశ్న తలెత్తుతోంది.

క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారుల నిర్లక్ష్య ఫలితమే ఈ అక్రమానికి తావిచ్చినట్టు అధికారులు గుర్తించారు. సండ్ర కలప నరకటం, సేకరణ వంటి తతంగాలు మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో జరిగి నట్టు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతకాని బీట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ను సస్పెండ్‌ చేశారు. ఈయనతో పాటే ఎఫ్‌ఆర్వోపైనా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. తాత్సారం చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఇంకా ఎవరిపై వేటు పడుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

అటవీ సిబ్బంది మెడకు ఏకు ‘మేక’..
అర్బన్‌ మండలంలోని పుట్టకోట గ్రామ సమీపంలో మైసమ్మ గుడివద్ద మేకపోతును కోశారు. సండ్ర కర్ర స్మగ్లింగ్‌ విచారణతో ఈ అంశం తెరపైకి వచ్చింది. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున మేకపోతు ను కోసుకుతిన్న ఘటనలో సండ్ర స్మగ్లింగ్‌ ఘటనలో సస్పెన్షన్‌కు గురైన బీట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌తో పాటు ఎఫ్‌ఎస్వో, డీఆర్వో, ఎఫ్‌బీవోతో పాటు వెలుగుమట్ల అర్బన్‌ పార్క్‌లో పనిచేసే ముగ్గురు వాచర్లకు సైతం భాగస్వామ్యమున్నట్టు స్థానికులు చర్చించుకుం టున్నారు. ఈ విషయంలో వారిపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

అటవీశాఖ అబాసుపాలు..
ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దందా అటవీశాఖ పర్మిట్ల లొసుగులను బట్ట బయలు చేసింది. ఈ ఘటనతో అటవీశాఖ అబాసు పాలైందనే చర్చ నడుస్తోంది. కలప రవాణాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘నేషనల్‌ ట్రాన్సిట్‌ పర్మిట్‌ సిస్టం (ఎన్‌టీపీసీ) నిబంధన ల్లో లోపాల ఆధారంగా స్మగ్లర్లు దందాకు పాల్ప డుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీపీసీ అనుమతి ఆధారంగా 44 జాతుల కలపను తగిన ధ్రువీక రణలతో రవాణా చేసే అవకాశం ఉంది. దీని కోసం కలప ఏ ప్రాంతానికి చెందినది, ఏరకం కలప, ఏ సర్వే నంబర్ల భూమి నుంచి సేకరిం చింది వంటి వివరాలను నమోదు చేస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది.

ఈ ఆన్‌లైన్‌ పర్మిట్టే కలప స్మగ్లర్లకు ఆయుధంగా మారింది. అనుమతి ఉన్న కలప మాటున విలువైన కలపను అక్రమంగా ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల అటవీ ప్రాంతం నుంచి సేకరించినట్టు ఆధారాలు సృష్టించిన స్మగ్లర్లు.. మధ్యప్రదేశ్‌లో సండ్ర కర్రతో పట్టుబడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీపీసీ ధ్రువీకరణను ఆన్‌లైన్‌ మార్ఫింగ్‌ ఆధారంగా సర్కారు తుమ్మ మాటున సండ్ర కర్రను సరఫరా చేస్తున్న తీరు బయట పడటం అటవీశాఖలో ప్రకపనలు సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణ అటవీశాఖ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -