Sunday, February 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికారణజన్ముడు!

కారణజన్ముడు!

- Advertisement -

పెద్దాయన దినచర్యలు ముగించుకుని నిద్రపోవటానికి సిద్దమయ్యాడు. నిజానికి దినచర్యలు అనటమే కాని, ఆ రోజేమీ దినచర్యలు లేవు. అలాంటి దినములు చాలానే ఉంటాయి. ఈ రోజు మాత్రం నిద్రించే ముందు పెద్దాయనకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. తనకు ఇష్టమైనవి, ఇష్టంలేని పనులను రాసుకోవాలని ఆన్పించింది. పెన్నూ పేపర్‌ తీసుకుని రాయటం మొదలు పెట్టాడు. ముందుగా ఇష్టమైన పనుల లిస్టు రాశాడు. ఖరీదైన కళ్లద్దాలు, మరింత ఖరీదైన దుస్తులు, చిత్ర, విచిత్రమైన తలపాగాలు, బిఎండబ్ల్యూ, బెంజ్‌ కార్లు, విదేశీ ప్రయాణాలు, ఫొటో షూటింగ్‌, ఉపన్యాసాలు మొదలైన పనుల అప్పు రాశాడు. అయితే ఇందులో ఒక్కటీ స్వదేశీ వస్తువు లేదు. ఇక ఇష్టంలేని పనుల లిస్టు రాయటం మొదలెట్టాడు.
ఇష్టంలేని పనుల్లో మొట్టమొదట వచ్చింది, విలేకర్ల సమావేశాలు, సభల్లో ప్రశ్నలకు సమాధానలు చెప్పటం, చేసిన వాగ్దానాలు మరిచిపోవటం లాంటివి రాశాడు. ఇంకా ఏదో తక్కువైందని అన్పించింది. బాగా ఆలోచించాడు! అప్పుడు గుర్తుకు వచ్చింది. మహిళలు! ఇప్పుడు లిస్టు పూర్తిచేశానన్న తృప్తి కలిగింది. ప్రశాంతంగా నిద్రపోయాడు!
గాఢనిద్రలో ఉన్న పెద్దాయనకు ఒక కల వచ్చింది! ఆ కలలో ఒక తేజస్సు కనబడింది! ఆ తేజస్సు పెద్దాయనతో మాట్లాడుతోంది!
”ఏమిటి నాయనా! నీకు ఇష్టమైన పనుల్లో ఒక్కటీ ప్రజలకు ఉపయోగపడేది లేదు! ఎందుకు?” అని అడిగింది.
పెద్దాయన ఆ దివ్య తేజస్సుకు నమస్కరించాడు.
”నేను బుక్కా ఫకీరుని! ప్రజలకు సేవ చేయటానికే నేను ఇక్కడికి వచ్చాడు. ప్రజలకు సేవ చేయటమే నా విధి! అందువల్ల ప్రజలకు సేవ చేస్తున్నానని ప్రత్యేకంగా చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు!” అన్నాడు పెద్దాయన వినమ్రంగా.
అప్పటిదాకా బాగా వెలిగిన తేజస్సు కొంచెం మసకబారింది.
”నేను అడిగింది ఒకటి, నీవు చెప్పింది మరొకటి!” అన్నది నిష్టూరంగా.
పెద్దాయన లోలోపల నవ్వుకున్నాడు.
”నీకు ఇష్టంలేని వాటి సంఖ్య చాలా తక్కువగా ఎందుకుంది” అడిగింది ఆ తేజస్సు.
”నేను అజాత శత్రువును! అందుకే నాకు ఇష్టం లేని పనులు/వ్యక్తుల సంఖ్య తక్కువ!” అన్నాడు పెద్దాయన.
”నాకేమీ అర్థం కాలేదు!” అన్నది తేజస్సు. వెలుతురు మరీ తగ్గిపోయింది. పెద్దాయన మరిసారి నవ్వుకున్నాడు.
”నాకు ఇష్టంలేని వారి లిస్టులో మహిళలు ఎందుకు ఉన్నారు?” అడిగింది వెలుగు.
”దేశం కోసం! ధర్మం కోసం!!” అన్నాడు పెద్దాయన గద్గద స్వరంతో.
”నాకు ఏమీ అర్థం కాలేదు!” అన్నది వెలుగు.
”నా జీవితం దేశసేవకు, ధర్మ సంస్థాపనకు అంకితం! ఇందులో తల్లిదండ్రులకు, కుటుంబానికి చోటులేదు!”
అన్నాడు పెద్దాయన.
”దేశసేవ, ధర్మ సంస్థాపన చేసిన వారందరూ తమ కుటుంబాలను వదులుకోలేదు కదా!” అన్నది వెలుగు.
”నేను అలాంటి అమాం బాపతు కాదు! నేను నాన్‌ బయలాజికల్‌!” అన్నాడు పెద్దాయన,
”అంటే ఏమిటి నాయనా!” అడిగింది వెలుగు.
”అంటే నేను మానవమాత్రుడిని కాదు! అలౌకికం!” ఆనాడు పెద్దాయన
”నీవు మానవ మాత్రుడివి కాకపోతే, దేన్నయినా ఎదురించి సాధించగల శక్తి నీకు ఉన్నట్లేగా!” అన్నది వెలుగు.
”అందుకు సందేహమే లేదు! నేను కారణజన్ముడినని అందరూ నమ్ముతున్నారు!” అన్నాడు పెద్దాయన చిద్విలాసంగా.
”అయితే మన దేశం, పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తుంటే తానే ఆపానని ట్రంప్‌ ఇప్పటికి తొంభైతొమ్మిది సార్లు చెప్పాడు! దీన్ని ఎందుకు ఖండించలేదు!” అడిగింది వెలుగు.
పెద్దాయన పెద్దగా నవ్వాడు.
”వందవ తప్పుచేసిన తర్వాతే శిశుపాలుడిని కృష్ణపరమాత్మ శిక్షించాడు! నేనూ అంతే! అయినా ఇది చాలా పాత ప్రశ్న!” అన్నాడు పెద్దాయన.
”సరే! కొత్తప్రశ్న అడుగుతాను! సభలో మహిళలు దాడిచేస్తారని నీవు సభకు రాలేదని అంటున్నారు!” అన్నది వెలుగు.
”నిజమే! నిండుసభలో నాపై దాడి చేసి, నన్ను అవమానపర్చాలని కొందరు మహిళలు కుట్ర పన్నారు! దాన్ని తప్పించుకునేందుకే నేను సభకు రాలేదు!” అన్నాడు పెద్దాయన.
ఫక్కున నవ్వింది వెలుగు!
”ఎందుకా నవ్వు?” ఉక్రోశంగా అడిగాడు పెద్దాయన.
”నీ మాటలకు నవ్వొస్తున్నది నాయనా! దేశం కోసం, ధర్మం కోసం మహిళలకు దూరంగా ఉన్నట్లు నీవు చెప్పిన మాటలు పచ్చి అబద్ధం! నీవు వట్టి పిరికివాడివి! నీకన్నా ద్రౌపది ఎంత ధైర్యం గలది!” అన్నది వెలుగు.
”ఎలా!” అన్నాడు కోపంగా పెద్దాయన.
”తన శత్రువు రాజ్యంలో జరుగుతున్న నిండుసభలో దుర్యోధనుడి పెత్తనం సాగుతున్నది! మహామహులు కూడా దుర్యోధనుడిని ఎదురించలేని దీనస్థితి! పరాక్రమవంతులైన తన భర్తలు ఓడిపోయి బానిసలైన సందర్భంలో కౌరవసభలోకి ప్రవేశించింది ద్రౌపది! బానిసలైన తన భర్తలు దుర్యోధనుడుని ఎదురించలేరని ద్రౌపదికి తెలుసు! ద్రోణ, కృష, భీష్మాది కురువృద్ధులు దుర్యోధనుడిని ఏ విధంగాను నిలువరించలేరని తెలుసు! అంటే తనకు సభలో ఎవరినుండి రక్షణ సహాయమూ లభించదని ద్రౌపదికి తెలుసు! పైగా తనని అవమానించాలనే ఉద్దేశ్యంతో కావాలనే కురుసభకు రమ్మన్నారనీ తెలుసు! అయినా ధైర్యంగా సభలోకి వచ్చింది!
మరి నీవు? దుర్యోధనుడిని మించి సేనాబలమూ, అధికారమూ, నీ సొంతం! నీవున్న సభలో నీకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడనీయని, సభాధ్యక్షుడు! సభ బయటఉండే చతురంగ బలాలపైన పెత్తనం నీదే కదా! ఇంత అధికారం, సైన్యం బలమైన మద్దతు గలిగిన నీపై దాడి చేయగల దమ్ము మహిళలకు ఉండగలదా? దానిని నీవు నమ్మితివా? నీ మీద చేయివేసిన వారి చెమడాలు ఒక్క నిమిషంలో తీయకుందురా? నిన్ను అవమానపర్చిన వారికి బయట పుట్టగతులుండునా? నీవు మానవ మాత్రడివి కావని అంటే ఏమో అనుకున్నాను! నిజమే నీవు మానవమాత్రుడివి కావు! ఉత్త పిరికివాడివి! శివాజీని కన్న ఈ నేలమీద, నిన్ను కన్నానని ఎంతో మురిసిపోతిని గదయ్యా!” అన్నది అవేదనగా వెలుగు!
”ఆ..ఎవరు నీవు? అడిగాడు పెద్దాయన.
”నేనొక పిరికివాడికి తల్లినని తెలిసింది” అంటూ వెలుగు మాయమైంది!
పెద్దాయన నిద్రలో నుండి దిగ్గున లేచాడు!
ఆ వెలుగు ఎవరో ఆయనకు తెలియటం లేదు!

– ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -