Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికులను కాల్చుకుతింటున్న కేంద్రం

కార్మికులను కాల్చుకుతింటున్న కేంద్రం

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– వృద్ధులను చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదే.. : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
– సీఐటీయూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మహాసభ.. బహిరంగ సభ
నవతెలంగాణ-సిటీబ్యూరో

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులపై దాడి చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగిస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తూ కాల్చుకుతింటోందన్నారు. సీఐ టీయూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మహాసభ ప్రారంభం సందర్భంగా శనివారం ఏఎస్‌రావు నగర్‌ నుంచి ఈసీఐఎల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చుక్క రాములు మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, చట్టాలను బలహీనం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. వేతనాల వ్యవస్థను తీసేసి పర్మినెంట్‌ ఉద్యోగుల్లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కొత్త లేబర్‌ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని, ఇందులో ఫ్యాక్టరీల్లో అవకతవకలపై అధికారులు దాడులు చేయ కుండా ఉండేలా చేస్తున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తున్నది కార్పొరేట్లు అని చెబుతున్న మోడీకి కార్మికులు లేకుండా కార్పొరేట్లు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. విలువైన ఖని జాలు, దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు.

గత సీఎం కేసీఆర్‌ కార్మికులను పట్టించుకోక పోవడం, వారికిచ్చిన హామీలను అమలు చేయక పోవడం వల్లే ఆయనను గద్దె దించాల్సి వచ్చింద న్నారు. ఇదే తరహాలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నడుస్తున్నారనని విమర్శించారు. కనీస వేతనాల చట్టాన్ని సవరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26వేల వేతనం ఇవ్వాలని విన్న వించుకున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. 4 లేబర్‌ కోడ్‌లను అమలు చేయబోమని చెప్పిన దమ్మున ప్రభుత్వం కేరళలోని ఎల్‌డీఎఫ్‌ అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతాలను సాకుగా చూపి ఓట్లు అడిగే దుస్థితికి దిగజారాయన్నారు. కార్మిక వర్గంలోకి దేవుడు, మతాలను తీసుకొస్తున్నార న్నారు. రాజకీయ నాయకుల అవసరాలు పెరగడంతో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాను అర్బన్‌గా ఏర్పాటు చేశారన్నారు.

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోక పోతే వేతనంలో కోత విధిస్తామని చెప్పడం చూస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డికి మెడ మీద తలకాయ లేదనిపిస్తోందన్నారు. అరకొర వేతనా లతో కుటుంబాలను నెట్టుకొస్తుంటే చేయూతని వ్వాల్సింది పోయి ఇలా మాట్లాడటం సరికాద న్నారు. వృద్ధులను చూసుకునే బాధ్యత పాలకుల దని, సోషలిస్టు దేశాల్లో వారి బాగోగులను ప్రభుత్వాలే చూస్తున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, అలాంటివి రాష్ట్రంలోనూ చేయాలని సూచించారు. మోడీ తీసుకొచ్చిన వేతనాల చట్టం ప్రకారం భార్యా భర్తలు బతకడమే కష్టంగా ఉందన్నారు. రోజుకు రూ.178 చొప్పున నెలకు రూ.4,628తో ఎలా బతకాలని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్‌, కార్యదర్శి జె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. మహాసభలో కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందిస్తామన్నారు. ఈ సభలో కోశాధికారి కె.ఉన్నికృష్ణన్‌, ఉపాధ్యక్షులు జె.రాఘవ రావు, ఎన్‌.శ్రీనివాస్‌, జె.వెంకన్న, కె.కిష్టప్ప, కె.శోభారాణి, బి.వి.సత్యనారాయణ, సహాయ కార్యదర్శులు పి.గణేష్‌, బి.లింగస్వామి, జి.శ్రీనివాసులు, ఐ.రాజశేఖర్‌, ఎం.రేవతి కల్యాణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -