సింగరేణి కార్మికులకు రూ.819 కోట్లు బోనస్
కాంట్రాక్ట్ కార్మికులకు కూడా..
రాష్ట్రం రూ.7వేల కోట్లు నష్టపోతుంది
మొత్తం లాభాలు రూ.6,394 కోట్లు
కొత్త ప్రాజెక్టుల కోసం రూ.4,034 కోట్లు
కార్మికులకు లాభాల వాటా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జీఎస్టీ శ్లాబు రేట్ల కుదింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.7వేల కోట్ల ఆదాయా న్ని కోల్పోతుందనీ, దాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదనీ, వచ్చే ఐదేండ్ల వరకు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్ర మంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటాలో 34 శాతాన్ని బోనస్‌గా ప్రకటిం చారు. దీనికోసం రూ.819 కోట్లు కేటాయిం చామని వివరిం చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం నికర లాభాలు రూ. 6,394 కోట్లు కాగా, దానిలో కొత్త ప్రాజెక్టుల కోసం 4,034 కోట్లు కేటాయించామని చెప్పారు. మిగిలిన రూ.2,360 కోట్లు నికర లాభాల్లో 34 శాతం సొమ్మును (రూ.819 కోట్లు) లాభాల వాటా బోనస్‌గా చెల్లిస్తున్నామని చెప్పారు. సంస్థలోని 41 వేల మంది పర్మినెంట్ కార్మికులకు సగటున ఒక్కొక్కరికి రూ. 1,95,610 లక్షలు బోనస్‌గా వస్తుం దనీ, గతేడాదితో పోలిస్తే రూ.8,289 అధికంగా బోనస్ చెల్లిస్తున్నామన్నారు.
అలాగే సంస్థలోని 30 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. గత ఏడాది వీరికి రూ.5వేలు చొప్పున బోనస్ చెల్లించామని తెలిపారు. తెలంగాణలో గనులన్నీ సింగరేణికే దక్కేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాకులను వేలంపాటలో ప్రయివేటు వ్యక్తులు పొందారనీ, ఇది సింగరేణికి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిందని చెప్పారు. వీటిని కూడా సింగరేణికి కేటాయించాలని కార్మికులు కోరారనీ, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ ప్రయత్నం చేస్తామన్నారు. ప్రయివేటు సంస్థలతో ధీటుగా సింగరేణి సంస్థ అభివృద్ధి చెందాలనీ, దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఓపెన్ మార్కెట్లో ఇతరుల కంటే తక్కువ ధరకు బొగ్గు అమ్మే స్థాయికి సంస్థ ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొని కొత్త బ్లాకులు సాధించాలని సింగరేణికి దిశానిర్దేశం చేశారు. కీలక ఖనిజాన్వేషణ రంగంలో సంస్థ ముందడుగు వేసిందని అభినందించారు. సంస్థ భవిష్యత్ విస్తరణ, అభివృద్ధి కోసం నికర లాభాల్లో రూ. 4,034 కోట్లు కొత్త ప్రాజెక్టుల కోసం కేటాయించామన్నారు. సంస్థ అభివృద్ధికి కార్మికులు, కార్మిక సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్వాగతోపన్యాసం చేసిన సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ఒడిశా రాష్ట్రంలో నైని బ్లాకును సాధించామనీ, కీలక ఖనిజాన్వేషణ రంగంలోకి ప్రవేశించామని తెలిపారు. కేంద్రం నిర్వహించే కొత్త బ్లాకుల వేలంలో కొత్త కొత్త బొగ్గు బ్లాకుల్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ 2వేల సంవత్సరం నుంచి లాభాల వాటా బోనస్‌ను కార్మికులకు చెల్లిస్తున్నదని తెలిపారు. ఏటా ఆ శాతం పెరుగుతూ వస్తున్నదని చెప్పారు. కోల్ ఇండియా ప్రకటించే బోనస్‌ను దీపావళికి పంపిణీ చేస్తామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు, షబ్బీర్ అలీ, పార్లమెంటు సభ్యులు పి. బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, శ్రీమతి మట్టా రాగమయి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ, గడ్డం వినోద్, దానం నాగేందర్, గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మెన్ జనక్‌ప్రసాద్, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహులు, సింగరేణి డైరెక్టర్లు కే వెంకటేశ్వర్లు, ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్ మెంట్ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ టి. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పర్సనల్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.