నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం మూడు దశల్లో ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడించడంతోనే వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని SEC పేర్కొంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్‌ఈసీ తెలిపారు. అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్‌ఈసీ తెలిపారు.
రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణికుముదిని వివరించారు.

