పథకాలలో అనేక లోపాలు
కేంద్రం ఖాతాలో రాష్ట్రాల విజయాలు
నత్తనడక నడుస్తున్న ప్రాజెక్టులు
ఎత్తిచూపిన కాగ్
దేశంలో వంద శాతం విద్యుదీకరణ సాధించామంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదనలో వాస్తవం లేదని కాగ్ తేల్చింది. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజీజేవై), ప్రధానమంత్రి సహజ్ బిజిలీ ఘర్ యోజన (సౌభాగ్య) పథకాలలో అనేక లోపాలు ఉన్నాయని తెలిపింది.
న్యూఢిల్లీ : దేశంలో మూడు కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలలో తెలిపారని, అయితే అంచనాలను 248.48 లక్షల గృహాలకు కుదించారని కాగ్ నివేదిక ఎత్తిచూపింది. దీని ఆధారంగానే 2019 మార్చి నాటికి వంద శాతం లక్ష్యాన్ని సాధించానని ప్రభుత్వం చెప్పుకుంది. రాష్ట్రాలలో కొత్తగా నిర్మితమవుతున్న గృహాలను సౌభాగ్య పథకం కింద చేర్చలేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆడిటర్‌కు తెలియజేసిన విషయాన్ని కాగ్ గుర్తు చేసింది.
కాగ్ తన పరిశీలనలో డూప్లికేట్ క్లెయిములను కూడా గుర్తించింది. ఫీడర్ విభజన పనిని (వ్యవసాయ ఫీడర్లను వ్యవసాయేతర ఫీడర్ల నుంచి వేరుచేయడం) డీడీయూజీజేవై కింద పూర్తిగా చేపట్టలేదని తెలిపింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 2014 డిసెంబరులో డీడీయూజీజేవైని ప్రారంభించగా, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం లేని అన్ని ప్రాంతాలకూ కనెక్షన్లు ఇవ్వడానికి 2017 అక్టోబరులో సౌభాగ్య పథకాన్ని చేపట్టారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కాగ్ తన నివేదికను ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ లెక్కలు ఇలా…
2019 మార్చి నాటికి ఏడు రాష్ట్రాలలోని 19.10 లక్షల గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. ఈ నేపథ్యంలో వంద శాతం విద్యుదీకరణపై ప్రభుత్వం చేస్తున్న వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదని అర్థమవుతోంది. విద్యుత్ సౌకర్యం కల్పించిన గృహాల సంఖ్యను ప్రభుత్వం 262.84 లక్షలుగా చూపుతుండగా వాటిలో 151.60 లక్షల గృహాలకు మాత్రమే సౌభాగ్య పథకం కింద కరెంటు ఇచ్చారు. సౌభాగ్య పథకం కింద 152.30 లక్షల గృహాలకు, డీడీయూజీజేవై కింద 73.60 లక్షల గృహాలకు (గ్రామీణ విద్యుదీకరణ, ప్రధానమంత్రి అభివృద్ధి ప్రాజెక్టులతో కలిపి), రాష్ట్ర గ్రామీణ విద్యుదీకరణ పథకాల కింద 36.90 లక్షల గృహాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామని మంత్రిత్వ శాఖ అంగీకరించిందని కాగ్ తెలియజేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సాధించిన విజయాలను సౌభాగ్య పథకం కింద చూపించారని స్పష్టమవుతోంది. 2019 మార్చి నాటికి విద్యుత్ సౌకర్యం కల్పించిన గృహాల సంఖ్య 262.84 లక్షలు కాగా 2.96 లక్షల గృహాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కాబట్టి విద్యుత్ సౌకర్యం కల్పించింది 259.88 గృహాలకు మాత్రమే.
గడువు పొడిగించినా నెరవేరని లక్ష్యం
విద్యుత్ సౌకర్యం లేని గృహాల వివరాలను 2019 మార్చిలోనూ, ఆ తర్వాత 2021 మార్చిలోనూ రాష్ట్రాలు నివేదించాయి. సౌభాగ్య పథకం కింద గ్రిడ్ ద్వారా విద్యుదీకరణ కోసం 241.95 గృహాలను పర్యవేక్షణ కమిటీ గుర్తించగా వాటిలో 2019 మార్చి నాటికి 149.58 గృహాలకు మాత్రమే కరెంటు ఇచ్చారు. విద్యుత్ సౌకర్యం లేని గృహాల వివరాలను అస్సాం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్నాటక, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అందజేశాయి. గడువు పొడిగించాలని కోరాయి. దీంతో 2020 మార్చి 31 వరకూ పొడిగింపు ఇచ్చారు. ఆ సమయంలో ఆ ఏడు రాష్ట్రాలలో 12.57 లక్షల గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. తర్వాత మరో సంవత్సర కాలంలో అదనంగా 6.14 లక్షల గృహాలకు కరెంటు ఇచ్చారు. సమయాన్ని పొడిగించినప్పటికీ ప్రభుత్వం లక్ష్యాని చేరుకోలేకపోయింది. ఎందుకంటే అసోం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో విద్యుత్ సౌకర్యం లేని 11.76 లక్షల గృహాలకు డీడీయూజీజేవై కింద మంజూరు లభించింది. 2023 డిసెంబర్ నాటికి ఐదు రాష్ట్రాలలోని 4.31 లక్షల గృహాలకు మాత్రమే కరెంటు సౌకర్యం కల్పించారు.
ప్రాజెక్టుల అమలులో తీవ్ర జాప్యం
దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు డీడీయూజీజేవై కింద, పేద కుటుంబాలకు సౌభాగ్య కింద విద్యుత్ సౌకర్యం కల్పించామని ప్రభుత్వం చెప్పింది. ఈ రెండు పథకాల కింద రెండు రాష్ట్రాలలో 16,728 గృహాలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. అయితే కాంట్రాక్టర్ ఒకే పనికి డూప్లికేట్ క్లెయిమ్ దాఖలు చేశాడు. అంటే డీడీయూజీజేవై కింద అవసరమైన గ్రాంట్ పొందినప్పటికీ గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ నుంచి సౌభాగ్య కింద కూడా 7.53 కోట్లు క్లెయిమ్ చేశాడు. దీంతో పంపిణీ సంస్థలకు రెట్టింపు చెల్లింపులు జరిగాయి. కాగా 24 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో 81.65 శాతం ప్రాజెక్టులకు పనులు అప్పగించడంలో జాప్యం జరిగిందని కాగ్ తెలిపింది. 27 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా 91.74 శాతం ప్రాజెక్టులను…అంటే 605 ప్రాజెక్టులకు 555 ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగింది. 19 రాష్ట్రాలలో 263 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలకు పైగా జాప్యం జరిగిందని కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది.
నూరు శాతం విద్యుదీకరణ ఒట్టిదే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



