పచ్చబొట్టును ఏమనాలి. జ్ఞాపకానుభూతి అనాలా. గతానురక్తి అందామా. జ్ఞాపకానుభూతి సజనలో కవి తన జ్ఞాపకాలను తడుముకుంటాడు, ప్రశ్నిస్తాడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. గతానురక్తి రచనలో ఆత్మపరిశీలన తక్కువ, భావరసమే ఎక్కువ.
ఈ రెండూ ఒకే స్వరంలోని వేరువేరు రాగాలు. జ్ఞాపకానుభూతి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గతానురక్తి రచన జ్ఞాపకాల చీకటిలో వెలిగిపోతుంది. ఒకటి ఆత్మాన్వేషణ, మరొకటి స్వీయ సంభాషణ. రెండూ గతాన్ని తడుముతాయి, కానీ ఒకటి మాత్రమే భవిష్యత్తు లోకి తీసుకువెళ్లే దారులు చూపుతుంది. మనం మెమాయిర్, నాస్టాల్జియాల నడుమ గీత గీయడంలో ఎప్పుడూ విఫలమవుతుంటాం. రెండూ ఒకటేననుకుంటాం. నాస్టాల్జియా అలా అలా సుతారంగా వెనక్కు తిరిగి చూసుకుంటుంది. కోల్పోయినదాన్ని పొందితే బాగుండు అనుకుంటుంది. ఓ కాగజ్ కి కష్తీ ఓ బారిష్ క పానీ అనమాట. మెమాయిర్ అలాకాదు. కోల్పోయింది ఎందుకు అలా ఉండేదో అది ఇంకా ఎందుకు ప్రతిధ్వనిస్తుందో విశ్లేషించుకుంటుంది. నాస్టాల్జియా నవనీతమైతే మెమాయిర్ శస్త్ర చికిత్స. మరీ మొరటుగా చెప్పాలంటే జ్ఞాపకానుభూతి ఒక దర్యాప్తుగా మారడం. మనం గతంలో ఏమిటి ఇప్పుడు ఏమయాం అనే తాత్విక ప్రశ్నకు ఈ సంఘర్షణ సమాధానం వెతుకుతుంది. యాదోంకి సఫర్ మే జానే క్యా మిల్ జాయే కభీ హసాదే కభీ రులా దే అనమాట. జ్ఞాపకానుభూతి కేవలం గుర్తుచేసుకోవడం కాదు ఆ జ్ఞాపకంలో దాగిన అర్థాన్ని వెతకడం. గతం ఎంత మధురమో చూపించడం కాదు గతం నాకు ఏం నేర్పింది అది ఎలా నన్ను మలిచింది అని సమీక్షించుకోవడం.
జ్ఞాపకంలోని గతం మ్యూజియంకాదు. పునప్రవేశానికి ద్వారాలు తెరిచి ఆహ్వానించే రూట్ మాప్. ఈ పారదర్శక తాత్వికతను క్షుణ్నంగా అర్దం చేసుకున్న కవిత్వం తుల శ్రీనివాస్ పచ్చబొట్టు. మెమాయిర్స్ నూ నాస్టాల్జియానూ కలిపి సామాజిక కవిత్వం చేసిన కవి తుల శ్రీనివాస్.
ఆకలే వేటకు ఉత్ప్రేరకమనీ, తేనెపొదుగు నిర్మాణం తెనెటీగకు ఎవరూ పాఠంగా చెప్పలేదనీ ఆ స్పష్టతకో లోతు కూడా ఉంది. ఆ స్పష్టత ఆ లోతు తుల శ్రీనివాస్ అక్షరాలది. అందుకే వాటికి పచ్చబొట్టు అని పేరుపెట్టాడీ కవి.
నొప్పి ఒక అనుభూతికి అర్దం అనే చర్మతాత్వికతను గ్రహించడమే పచ్చబొట్టును చెక్కుకోవడం. పచ్చబొట్టును అంగీకరించడమంటే శాశ్వతత్వానికి బెదరకపోవడం. ముల్లు పదును మీద వేలి కొసను సుతారంగా ఆనించే ధిక్కారంలో గాయపు గురుతులకు సిద్దపడే లక్ష్యాన్ని పేర్చుకోవడం. ఇదీ ఆ స్పష్టత ఆ లోతుల భావోద్వేగం.
భావోద్వేగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ లు కావడం పట్ల దిగులుపడ్డాడు. తుల శ్రీనివాస్ కవిత్వం శబ్దము శబ్దరాహిత్యం రెండూనూ. శబ్దంలో లోకాన్ని నిర్వచించే ప్రయత్నం చేసాడు. శబ్దరాహిత్యంలో పరిష్కారాలను నిర్మించే ప్రయత్నం చేసాడు. రెండింట్లోనూ విజయుడే. పాఠకుడికి శబ్దంలో వాస్తవాన్ని, నిశ్శబ్దంలో గమ్యాన్ని తెలియచెప్పే ప్రయత్నం చేస్తాడు కనుక ఇతన్ని చదవాలి.
ఇది అరనూరుకు పైగా కవితలతో తుల శ్రీనివాస్ రెండో రాకడ. అనాదినుంచీ తనకు చాలా చాలా గురుతులున్నాయి. అవి చెరిగిపోనివి. అవి చెక్కుకోని పచ్చబొట్లు. కమ్మటి తేనెబొట్లు. ఆ బొట్లు దాదాపు ప్రతి కవితలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రతీకగానో పదబందంగానో జలజలా రాలుతూనే ఉంటాయి.
ఇన్ని ఉన్నాయి కనుకనే సంపుటినిండా బోలెడన్ని వస్తువులున్నాయి. గొర్రెగిట్టల గంధం, ఆయిటి మోపు, కొత్తల పండుగ, నల్ల మొలతాడు, విత్తనం, మూడో జెండర్, మోనాలిసా అన్నీ వస్తువులయాయి. వస్తువు ఎంపికలోనే కాక ఆ వస్తువును కవితగా నిర్మించే క్రమంలో కూడా శ్రీనివాస్‌కు వస్తు స్పష్టత ఉంది. కేవలం మనసును రంజింపచేయడమే కాక సామాజిక బాధ్యత కూడా కవన సజనలో ప్రధానం అనే స్పహ ఉంది. ఆ స్పహ లేకుండా ఏదీ రాయలేదు శ్రీనివాస్. పూర్తి స్దాయి వైయక్తికాలను కూడా చివరకు సామాజిక ప్రకటనలుగా మార్చాడు. ఊరుగురించిన పద్యాలు రాసేపుడు అవి వ్యక్తిగతమో సామాజికమో చెప్పలేం. జాతరలు పండుగలు గురించి రాసినపుడు కూడా కేవలం తన అనుభవాలను మనకు చెపుతున్నాడా లేక సాంస్క్రుతిక జీవనవిధానాలను చిత్రిస్తున్నాడా అనేది తేల్చుకోలేం.
శ్రీనివాస్ కవిత్వంలో అతని కవితలతోనే అతన్ని పోల్చుకోవచ్చు. రహస్యం అని తన తాత్వికత ఏమిటో గొంతెత్తి చెపుతాడు. అకాల తత్వం అని మట్టి భాష మాట్లాడతాడు. ఊరు మాయం కావడం, ఊరును వదిలి వెళ్లడం, జాతరలమధ్య అనుబంధం, పండుగల సారూప్యత వంటి సజనను పోల్చుకుని తులనాత్మకం చేసినపుడు కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఈ ప్రత్యేక లక్షణాలే తుల శ్రీనివాస్ కవితలకు ప్రాణం. ఇది సినక్డొకే. ఇది అలిగరీ, ఇది ఇంపర్సానిఫికేషన్, ఇది ఆక్జిమోరాన్ కదా అంటే అవునా సర్ ఏమో తెలియదు అంటాడు. ఆ ముద్రలేసుకోవడం, ఆ విభజనలు చేసుకోవడం, పేర్లు పెట్టుకోవడం అనే టాగ్ ల గోల మనపని మాత్రమే కావచ్చు.
ఏ కవిత్వమైనా జీవన తాత్వికతకు అద్దం పట్టాలి, అర్దం చెప్పాలి అని నమ్ముతాను నేను. కవిత్వం కేవలం మనసుకు చక్కిలిగింతలు పెట్టే వినోదాత్మక కేరింత కాదు. కవిత్వం కేవలం ఆత్మనో దేహాన్నో రంజింపచేసి మురిపించే వేడుకల వేదిక కాదు. తత్వాన్ని విప్పి చెప్పాలి. తాత్విక మూలాలను బయటపెట్టాలి. తాత్విక చింతన నేర్పాలి.
ఆధునిక వచన కవిత్వం వయసు 85 ఏళ్లు. చాలా ఎత్తులు, చాలా లోయలు చాలా ముళ్లు చాలా అసహ్యాలను, చాలా అందాలను అనుభూతులను దాటుకుంటూ వచ్చింది. అనేక భావజాలాల పాయలను అనేకానేక ఉద్యమ రీతులనూ చూసింది, ఔపోసన పట్టింది. ఈ ఎనిమిదిన్నర దశాబ్దాల ప్రవాహం ముందుకుపోవడానికి అవసరమైన పల్లాన్ని కూడా తుల శ్రీనివాస్ లాంటి కవులే చెక్కారు.
బుల్స్ ఐ పై కన్నేసినవాడు కనుక సమస్యేమీ లేదు. పాటలు గునుగునాయించుకుంటూ చిక్కటి అడవిలో కాలిబాటల వెంట వెళ్లిపోతున్నాడు.
నేనేదో ప్రయత్నం చేసాను కానీ నిజానికి శ్రీనివాస్ ను ఫలానా వాది అని ముద్రవేసి ఎక్కడో ఒక దగ్గర కూచోబెట్టి చేతులు దులుపుకోవడం విమర్శకులకూ సాధ్యం కాదు. వ్యక్తి గొప్పతనానికీ, వైయక్తిక భావోద్వేగానికీ అత్యున్నత గౌరవాన్నిచ్చేవాదం ఇతనిది. ట్రాన్స్ పరెంట్ చీకటిని దాటి దశ్యాన్ని ఆవిష్కరించే చిక్కటి వెలుగు తెర ఇతను. ఇతనిలో కొంచెం శివారెడ్డి ఉన్నాడు, కుంచెం మోహన ప్రసాద్ ఉన్నాడు, కుంచెం వంశీకష్ణ ఉన్నాడు, నాకైతే కొంచెం ఎమ్మెస్ నాయుడు కూడా ఉన్నాడనిపించింది అక్కడక్కడా. అలా అని ఎవరి శైలికీ మోహపడడు.
తనదైన దారి తనదే. చీకటి కాదు వెలుతురే కావాలనే ఇతను లోకంలో పేరుకుపోయిన చీకటిని చెదరగొట్టేందుకు సర్వశక్తులనూ ఒడ్డుతున్నాడు.
ఇతనికి నిర్మాణ స్పహ చాలా చాలా ఎక్కువ. భావాన్నీ భాషనూ అలంకారాన్నీ అప్రమత్తంగా పేర్చుకుంటాడు. చెప్పే విషయానికీ చెప్పే పద్దతికీ మధ్య సమన్వయం కోసం చెమటోడుస్తాడు. నేను అస్సలిష్టపడని రూపకాలంకారం ఇతని చేతిలో కులుకులు పోతుంది. ఒక అలంకారం మాత్రమే కాక బహుళ రూపకాల పెనవేత, ఒకదాని మీద మరొకటి పేరుస్తూ పోవడం తుల శ్రీనివాస్ నిర్మాణంలో ప్రత్యేకత. కేవలం ఒక ఇమేజ్ తో చాలా సందర్బాలలో సరిపెట్టడు. భావ ప్రకటనను పేనుకుంటూ బలంగా అల్లి బరువుగా ముగిస్తాడు. ప్రసంగవాక్య సింటాక్స్ కూ లిఖిత వాక్య సింటాక్స్ కూ మధ్య తేడాని తెలుసుకుని కొన్ని చోట్ల ప్రసంగ యాసను మాత్రం యధాతథంగా ఉంచేసి చివరకు పాఠకుడితో సాహిత్య ఎంవోయు మీద సంతకం చేయిస్తాడు.
ఇతని రాతలు కొట్టివేతలు చెరిపివేతలు అవసరంలేని పచ్చబొట్లు. ఇతను పచ్చబొట్లు అంటున్నవి నిజానికి జ్జాపకాలు కావు. గాయాల మరకలు. ఆ గాట్లను దాచడానికి వాటి మీద పచ్చబొట్లను అలంకరించి మనకు కేవలం అనుభూతి అందాన్ని మాత్రమే కాక నెత్తుటినీ మాంసాన్నీ చీమునూ వెరశి కన్నీళ్లనూ చూపిస్తున్నాడు.
వాస్తవానికీ, ఆకాంక్షకీ మధ్య తులనాత్మక బేరీజులో నివాసుడితడు. ఆకాంక్ష ఎంత తీవ్రమైనదో, వాస్తవం ఎంత కురచదో కొలిచినవాడు. ఆ తేడా తెలుసుకోలేని కవి కవిగా విఫలమైనట్టే. శ్రీనివాస్ విఫలం కాలేదు.
– ప్రసేన్



