– గెలుపు గుర్రాల కే స్థానిక సీట్ లు
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసి కోర్ట్ ఆదేశాలతో నేడు హడావుడి చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షులు రేగా కాంతారావు అన్నారు. నియోజవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం అశ్వారావుపేట లోని సత్యసాయి కళ్యాణ మండపంలో నియోజక ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అద్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు పార్టీలు అతీతంగా ఇచ్చామని అన్నారు.ఎప్పుడో పీవీ నరసింహ రావు ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు గురుకులాలు ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం నియోజక వర్గానికి రెండు మూడు గురుకులాలు ఇచ్చింది అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చిందని,ఎవరైతే ఈ ప్రభుత్వంలో అత్యుత్సాహంగా టిఆర్ఎస్ ప్రభుత్వ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వారి పేర్లు రాసి పెట్టుకొని ఉండాలని,ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అన్నారు.
కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం తో పాటు ఆడపడుచులకు రూ. 25 వేలు, ఇవ్వకుండా ఇంకా ఇచ్చిన హామీలే చాలా వరకు గాలికి వదిలేసారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల శిలా పలకల దిమ్మలను చాలా చోట్ల పడ గొట్టారని అలాంటి వారిని ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అన్నారు.
ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలకు ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారు అని అన్నారు.గర్భిణీ స్త్రీలకు పోషకాహార ఆహారాన్ని, కేసీఆర్ కిట్ల ను అందించామని అన్నారు.వరదల సమయంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పడకుండా వరదల్లో చిక్కుకున్న వ్యక్తులను కాపాడిన ఘనత, వరద బాధితులకు ఆహారాన్ని అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. వరదల సమయంలో హెలికాప్టర్ ను వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడ కుండా మంత్రులు వాడుకుంటున్నారు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో మంజూరైన అనేక సంక్షేమ పథకాలు మేమే మంజూరు చేపించామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు.కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను ప్రజలలోకి తీసుకువెళ్లి దానికి స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలు టిఆర్ఎస్ ప్రభుత్వం గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలి అన్నారు.జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఈ ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకన్నా ఎక్కువ సీటు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.స్థానిక సంస్థలలో ఎక్కువ సర్పంచుల ను ఎంపీటీసీలు ను జడ్పీటిసిల ను గెలిపించి ఎంపీడీవో ఆఫీసులో కూర్చొని ఇందిరమ్మ ఇల్లు ఎలా రావో చూసు కుందామన్నారు. ఎన్నికలు ఏదైనా గులాబీ జెండా ఎగరాలి అని అన్నారు.
ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇసుక దందా మట్టి దందా చేస్తున్నారు అని అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటలు కరెంటు, సీజన్ కు ముందే రైతులకు రైతు బంధు ఇచ్చారు అని అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 90 శాతం సీట్లు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తాయని, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జడ్పీటీసీ కి పోటీ చేసే అభ్యర్థులు తమ బయోడేటా ఫామ్ ని జిల్లా కార్యాలయంలో నూ,నియోజకవర్గం ఇన్చార్జి కి తమ అప్లికేషన్ ఇవ్వాలని అన్నారు.పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు ఇస్తాం తప్ప ఇంట్లో పడుకోని పెత్తనం చేసే వారికి పదవులు ఇవ్వము అని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో రావు జోగేశ్వర రావు,యూఎస్ ప్రకాశ్ రావు,శ్రీరామమూర్తి,మందపాటి రాజమోహన్ రెడ్డి,సత్యవరపు సంపూర్ణ లు పాల్గొన్నారు.