Friday, January 23, 2026
E-PAPER
Homeజాతీయంనిర్మాణ సెస్‌కు మంగళం!

నిర్మాణ సెస్‌కు మంగళం!

- Advertisement -

సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న కేంద్రం
యాజమాన్యాలకు అనుకూలంగా ముసాయిదాలో నిబంధనలు

న్యూఢిల్లీ : భవన-ఇతర నిర్మాణ కార్మికుల సెస్‌ (బీఓసీడబ్ల్యూ) అనేది లక్షలాది మంది కార్మికులకు భద్రత కల్పించడానికి ఉద్దేశించి నిర్మాణ వ్యయంపై విధించే లెవీ. అయితే గత సంవత్సరంలో తీసుకొచ్చిన సామాజిక భద్రతా నిబంధనల ముసాయిదా కోడ్‌లోని 42వ నిబంధన… సెస్‌ ద్వారా లభించే ఈ ఆదాయాన్ని ఎలా పరిశీలిస్తారనే విషయంలో కీలక మార్పును సూచిస్తోంది. ఆదాయాన్ని ప్రభుత్వ ఆడిట్‌ ద్వారా కాకుండా స్వీయ సర్టిఫికేషన్‌ ద్వారా ధృవీకరించాలని నిబంధనలో ప్రతిపాదించారు. సంక్షేమ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఛార్టర్డ్‌ ఇంజినీర్‌ సర్టిఫై చేసిన స్వీయ అంచనా ఆధారంగా నిర్మాణ సెస్‌ను ముందుగానే చెల్లించాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఛార్టర్డ్‌ ఇంజినీర్‌ అంటే మరెవరో కాదు. కాంట్రాక్టర్‌ నియమించే ప్రయివేటు నిపుణుడు. ఇలాంటి నిపుణులు చేసే ప్రయివేటు సర్టిఫికేషన్‌పై ఆధారపడడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటుంది.

రూ.10 కోట్ల లోపు ప్రాజెక్టులకు తనిఖీలు ఉండవు
సంక్షేమ సెస్‌ను ఒక శాతానికి పరిమితం చేయడానికి ఛార్టర్డ్‌ ఇంజినీర్‌ నిర్మాణ ఖర్చులను తగ్గించి చూపే అవకాశం ఉంది. స్వీయ అంచనా ఆధారంగా సెస్‌ మొత్తం పది లక్షల రూపాయలు దాటినప్పుడు మాత్రమే అసెస్సింగ్‌ అధికారి తనిఖీ చేస్తారు. ప్రాజెక్ట్‌ వ్యయం పది కోట్ల రూపాయలు ఉన్నప్పుడే పది లక్షల రూపాయల సెస్‌ చెల్లించాల్సి ఉంటుంది. అంటే పది కోట్ల రూపాయల కంటే తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణ ప్రాజెక్టులను తప్పనిసరి తనిఖీల నుంచి ప్రభుత్వం మినహాయించిందన్న మాట. ఒకవేళ ప్రాజెక్ట్‌ విలువ పది కోట్ల రూపాయలు దాటినా, దానిని చిన్న చిన్న భాగాలుగా విభజించి సబ్‌- కాంట్రాక్టులు ఇచ్చి ప్రభుత్వం విధించిన వ్యయ పరిమితి కంటే తక్కువ ఉండేలా చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నిబంధనలు అమలులోకి వస్తే అనేక నిర్మాణ ప్రాజెక్టులు ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండానే పూర్తవుతాయి.

గడువు దాటితే అంతే
ఇక్కడ మరో వింతైన నిబంధనను కూడా చేర్చారు. ఒకవేళ అసెస్‌మెంట్‌ అధికారి 180 రోజుల లోగా తన బాధ్యతను పూర్తి చేయలేకపోతే స్వీయ అంచనాయే ఫైనల్‌ అవుతుంది. కార్మిక విభాగాలకు చెందిన సిబ్బందివేలాది ప్రాజెక్టులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాబట్టి పని ఒత్తిడి కారణంగా 180 రోజుల నిబంధనను పాటిం చడం వారికి చాలా కష్టమవుతుంది. ఈ జాప్యంతో అంతిమంగా స్వీయ సర్టిఫికేషనే చెల్లుబాటు అవుతుంది. కాంట్రాక్టర్‌, ఆయన నియమించుకున్న వ్యక్తి చూపిన గణాంకాలే చట్టబద్ధం అవుతాయి. ఏదైనా కారణంతో ప్రాజెక్టును ఆపేసినా లేదా ప్రాజెక్ట్‌ వ్యయాన్ని తగ్గించినా ఎక్కువగా చెల్లించిన సెస్‌ను కాంట్రాక్టర్‌ రిఫండ్‌ కోరవచ్చు. ఈ రిఫండ్‌ క్లెయిమును కూడా 30 రోజులలో పరిష్కరించాల్సి ఉంటుంది.

వ్యయ అంచనా తప్పనిసరి కాదట
సామాజిక భద్రతా ముసాయిదా కోడ్‌లో చేర్చిన మరో నిబంధన కూడా కాంట్రాక్టర్‌కే అనుకూలంగా ఉంది. నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడానికి అసెస్సింగ్‌ అధికారి విచారణకు ‘ఆదేశించవచ్చు’నన్నది ఆ నిబంధన. దీనిని జాగ్రత్తగా గమనిస్తే తప్పనిసరిగా విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో అధికారి తన విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు. నిర్మాణ సంస్థ ఐదు సంవత్సరాలకు పైగా పనిచేయకపోయినా లేదా యజమాని ఆచూకీ తెలియకపోయినా బకాయిపడిన సెస్‌, వడ్డీ, ఇతర నష్టాలను మాఫీ చేయవచ్చునంటూ మరో నిబంధనను చేర్చారు. తన వద్ద పనిచేసే కార్మికుడిని రిజిస్టర్‌ చేయడం యజమాని బాధ్యత. ఆ పని జరగకపోయినా లేదా రాష్ట్రాలు మారినప్పుడు వివరాలు తాజా పరచకపోయినా వసూలు చేసిన సెస్‌కు, కార్మికుడికి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది. అంతిమంగా తేలిందేమిటంటే నిర్మాణ సంక్షేమ తనిఖీల విషయంలో యాజమాన్యాలకే ప్రాధాన్యత ఇచ్చి, ఆ వ్యవహారాన్ని ప్రయివేటు పరం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కన్పిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -