కర్త ఎవరో తెలియని ‘పారిజాత కథ’ పేరుతో ఒక అసంపూర్తి యక్షగానపు వ్రాతప్రతి తిరుపతిలోని Oriental Research Institute వారి గ్రంథాలయంలో భద్రం చేయబడి ఉంది. తెలుగునాట బహుళ ప్రసిద్ది చెందినది ‘పారిజాతాపహరణం’ కథ. కూచిపూడి నృత్యశైలిలో ‘భామాకలాపం’ పేరుతో ప్రజాదరణం పొందిన కథ ఇది. ఎవరిచేతనో యక్షగానంగా వ్రాయడానికి సంకల్పింపబడి, ఏ కారణం చేతనో పూర్తి చేయకుండా వదిలివేయబడింది. ఇందులో పద్యకవిత్వం ఛందోబద్ధమైనదై, ధారాశుద్ధి కలిగి ఉంది.
ఈ యక్షగానంలో రుక్మిణి గృహంలో ఉన్న శ్రీకృష్ణుడిని తలుచుకుని, శ్రీకృష్ణుడికి తనపై ప్రేమ తరిగిపోయిందని, శ్రీకృష్ణుడు రుక్మిణి మాయలో పడిపోయి తనను మరిచిపోయాడని భావించి సత్యభామ చేసే వియోగాలాపన ఉత్పలమాల వృత్తంలోని పది పద్యాలలో చెప్పబడింది. ఆ పద్యాలలోంచి ఉత్తమమైనవిగా అనిపించిన ఎనిమిది పద్యాలను విడిగా తీసి ‘వియోగాష్టకం’ పేరుతో ఇక్కడ పొందుపరుస్తున్నాను. కందుకూరులో వెలసి ఉన్న జనార్దనస్వామికి అంకితంగా కందుకూరు రుద్రకవి రచించిన ‘జనార్దనాష్టకం’ అష్టకాలలో మొదటి రచనగా ప్రసిద్ధి చెందింది. ‘జనార్దనాష్టకం’ లోని ఒక్కొక పద్యం అష్టవిధ నాయికలలోని ఒక్కొక నాయికను వర్ణించినదిగా చెబుతారు. ఈ ‘వియోగాష్టకం’ లో సత్యభామ ఒక్కతే నాయిక. ఆమె వియోగ దుఃఖం ఆమె మాటలలోనే ఇందులో (యక్షగానం కాబట్టి) వినేవాడికి బాధ కలిగించి, కరుణను జనింపజేసే విధంగా రచించాడు ఈ అజ్ఞాతకవి. రచన అసంపూర్తిగా వదిలేయబడడం వలన అప్రకటితంగా ఉండిపోయిన ఈ యక్షగానంలోని ఈ చక్కటి పద్యాలు కూడా అప్రకటితంగానే ఉండిపోయాయి.
ఉ. రార వలపదేల మదిరవ్వలకోర్చినదాన గానురా
బేరములాడి తెమ్మనుచు బింకములాడినదాన గానురా
కోరినకోర్కె దీర్చుమని కోమలి పంపిన రావదేమిరా
ధీరుడ, దేశకాలమొక తీరున నుండదు కృష్ణమాధవా!
ఉ. గ్రక్కున రమ్మటంటి బిగికౌఁగిట చేర్చుమటంటి కాళ్ళకున్
మ్రొక్కెదనంటి తేటిజిగిమోవి సుధారసమిమ్మటంటి నే
దక్కితినంటి నీవు తమిరాచకుమంటని వేడుకొంటిరా
అక్కర దీర్చుమంటి వినయంబున ముద్దులకృష్ణ మాధవా!
ఉ. అలుగగనేలరా తమక మాచగలేనుర నమ్మినానురా
పలుకవదేమిరా మిగుల బానిసరా యెడబాయజాలరా
వలచినదానరా చిగురువాతెఱ నొక్కర ముద్దొసంగరా
నిలువక నేలుకోరనను నియ్యెడ ముద్దుల కృష్ణ మాధవా!
ఉ. భూమిని యాడుజన్మమును పుట్టినయందుకు చింతజేతునో
రామలలోన ప్రేమనను రమ్మననందుకు చింతచేతునో
నీమది యంతయుందెలియనీయవు యందుకు చింతచేతునో
ఏమని చింతచేతు యిటుయేమని వేఁడుదు ప్రాణవల్లభా!
ఉ. నీసొగసైన నెమ్మొగము నీచతురత్వము నీవిలాసమున్
నీసుజనత్వముందెలిసి నీకునొసంగితి నాదు ప్రాయమున్
ఆసతిగూడి నన్నిపుడు యక్కర సేయకయుంటి వయ్యయో
బాసలు యెన్ని చేసితివి భావమునందు దలంపు వల్లభా!
- భట్టు వెంకటరావు, 9959120528



