బాలికలు మనుగడ సాగించటమే కాదు..
అభివృద్ధి చెందాలి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి నాగరత్న
న్యూఢిల్లీ : దేశంలో లింగ నిష్పత్తులు పడిపోవటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.వి నాగరత్న ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలు మనుగడ సాగించటం మాత్రమే కాదనీ, అభివృద్ధి కూడా చెందాలని ఆమె సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో శిశుహత్యలు, భ్రూణహత్యలతో లింగ నిష్పత్తులు క్షీణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జువైనైల్ జస్టిస్ కమిటీ(జేజేసీ) యూనిసెఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన ‘బాలికను రక్షించడం : భారతదేశంలో ఆమెకు సురక్షితమైన, అనుకూలమైన వాతావారణాన్ని అందించం’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్ గవారు, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అన్నపూర్ణ దేవి, జేజేసీ సభ్యురాలు జస్టిస్ జె.బి పార్దివాలా, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు. భారత్‌లో ఒక యువతి.. ఒక పురుషుడిలాగే స్వేచ్ఛను, నాణ్యమైన మద్ధతును, తగిన వనరులను పొందగలిగినప్పుడే ఆమె నిజమైన సమాన పౌరురాలు అవుతుందని బి.వి నాగరత్న అన్నారు. ఆమె పుట్టే అవకాశాలు, సరైన పోషకాహారం, సంరక్షణ, విద్య మరియు భౌతిక వనరులు, సురక్షితమైన వాతావరణం, ప్రత్యేక స్వీయ భావాన్ని పెంపొందించుకోవడం వంటివి ఈ దేశంలో జన్మించే మగబిడ్డకు సమానంగా ఆమెకు కూడా ఉంటాయని చెప్పారు. ఆమె(బాలిక) కేవలం జీవించడమే కాదు.. చురుకుగా అభివృద్ధి చెందాలని ఆమె తెలిపారు. దేశంలో ఒక ఆడబిడ్డ ఎదుర్కొనే మొదటి అడ్డంకి.. పుట్టడం అనే చర్యేనని జస్టిస్ బి.వి నాగరత్న అభిప్రాయపడ్డారు. పుట్టే బిడ్డ ఆడపిల్ల అని విన్నప్పుడు చాలా కుటుంబాలు నిరాశ చెందడం దురదృష్టకరమైన వాస్తవమని చెప్పారు. ”భారత్‌లో పిల్లల లింగ నిష్పత్తి (0-6 సంవత్సరాలు) స్వల్పంగా మాత్రమే మెరుగుపడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది అబ్బాయిలకు 914 మంది బాలికలు ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం అది 929కి పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఆడ శిశుహత్యలు, భ్రూణహత్యల కారణంగా లింగ నిష్పత్తులు దిగజారుతున్నట్టు ఇటీవల నివేదికలు వచ్చాయి” అని ఆమె అన్నారు. పోషకాహార సంరక్షణ ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. సరైన పోషకాహారం లేకుండా ఆడపిల్లను ఉద్ధరించడానికి చేసే అన్ని ప్రయత్నాలూ వ్యర్థం కావచ్చని వివరించారు.
లింగ నిష్పత్తి క్షీణత ఆందోళనకరం
- Advertisement -
- Advertisement -