Sunday, November 9, 2025
E-PAPER
Homeమానవినిష్క్రమించిన రాగాల కోయిల

నిష్క్రమించిన రాగాల కోయిల

- Advertisement -

రావు బాల సరస్వతి దేవి.. ఈ పేరు వినగానే మనకు ఓ మంత్ర స్వర గాత్ర మాధుర్యం గుర్తుకొస్తుంది. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల ఆమె. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో అనిపించే సున్నిత స్వర రాగవీణ. తెలుగు సినిమా సంగీతం తనకంటూ ఓ విభిన్నమైన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈ స్వరవీణ విష్కరణ జరిగింది. ఆకాశవాణి ద్వారా తెలుగు శ్రోతలకు పరిచయమైన ఈమె ‘సతీ అనసూయ’ చిత్రంలో మొదటిసారి గానం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర అనేక భాషల్లో మొత్తం కొన్ని వేల పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి మధుర గాయని తన 97 ఏండ్ల వయసులో ఈనెల 14న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

రావు బాల సరస్వతి దేవి 1929 ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పార్థసారథి, విశాలాక్షి దంపతులకు జన్మించింది. ఆమె తాత మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా చేసేవాడు. గుంటూరులో వీరికి రత్నమహల్‌ అనే సినిమా థియేటర్‌ ఉండేది. వీరి తాత తప్ప 1934లో కుటుంబం అంతా మద్రాసు నుండి గుంటూరు తరలి వచ్చింది. బాల సరస్వతి తండ్రి పార్థసారథి ఆ సినిమా హాలు నడిపేవాడు. తల్లిదండ్రులిద్దరు సంగీత అభిమానులు. వీణ, సితారలను వాయించేవారు. వీరికి సంగీత పరికరాల దుకాణం కూడా ఉండేది. వీటి కోసం ఎంతో మంది సంగీత కళాకారులు వారింటికి వచ్చేవారు. అలా చిన్ననాటి నుంచి బాల సరస్వతికి సంగీతం పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అయితే ఈమె పెద్దగా చదువుకోలేదు.

బాల్యం
బాల సరస్వతీ ఇంటి వాతావరణ ప్రభావం వల్ల, పసితనం నుండే సంగీతంలో మెళకువలు తెలుసుకున్నారు. సంగీతమే ఆమె చదువు. ఒక ఆంగ్లో ఇండియన్‌ లేడీ దగ్గర ఆమె సంగీత చదువంతా సాగింది. కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్న తర్వాత తండ్రి బొంబయి తీసుకెళ్ళి వసంత దేశారు దగ్గర హిందూస్థానీ సంగీతం నేర్పించారు. ఆ విధంగా 1940 నాటికి ఆమె సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. కూతురు మంచి గాయనిగా పేరు సంపాదించుకోవాలన్నది తండ్రి కల. పైగా ఆయన కర్నాటక సంగీతంలో దిట్ట. అందుకే ఆరేండ్ల వయసు నుండే కూతురికి సంగీతం నేర్పించాడు. సరస్వతీ దేవి తమ టాకీస్‌లో ప్రదర్శించే సినిమా పాటలను అచ్చు అలాగే పాడేది.

సంగీతంలో అభ్యాసం
చిన్నతనం నుంచే సంగీతం అంటే ఎంతో ఇష్టంతో బాలసరస్వతీ అలత్తూర్‌ సుబ్బయ్య (గుంటూరు) వద్ద మూడేండ్లు శాస్త్రీయ కర్ణాటక సంగీతాన్ని అభ్యసించింది. ఖేల్కర్‌, వసంత దేశారుల వద్ద హిందుస్తానీ సంగీతం, కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్‌ వద్ద పియానో లాంటి సంగీత వాయిద్యాలలో తర్ఫీదు పొందారు. గుంటూరులో వీరి సినిమా థియేటర్‌ను 1936లో నాటకరంగ స్థలంగా మార్చేశారు. అక్కడే ఎన్నో నాటకాలు ప్రదర్శించే వారు. ఆ నాటకాల్లో పాటల సన్నివేశాలు వచ్చినప్పుడు బాల సరస్వతీ నేపథ్యగానం అందించేవారు. అలా ఆమె పాటలు పాడుతున్నప్పుడు విన్న హెచ్‌.ఎం.వి. గ్రాంఫోన్‌ రికార్డ్స్‌ కంపెనీవారు ఆమెకు తెలియకుండానే ఆమె వాయిస్‌ రికార్డ్‌ చేసుకెళ్ళారు. ఆమె గాత్రం నచ్చి హెచ్‌.ఎం.వి. ప్రతినిధి కొప్పరపు సుబ్బారావు వచ్చి ఆమె పాటలు రికార్డింగ్‌ కోసం పార్థసారధితో ఒప్పందం చేసుకున్నారు. అలా ఆమె తొలిసారిగా హెచ్‌ఎంవి సంస్థకు ‘పరమపురుష’ అనే పద్యం, ‘దొరికే దొరికే నాకు’ పాటలు పాడారు. ఇంతలో సి పుల్లయ్య 1936లో సతీ అనసూయ కోసం పాడగలిగే అమ్మాయి కోసం అన్వేషిస్తూ బాల సరస్వతిని ‘గంగ’ పాత్రకు ఎంపిక చేశారు. అదేసమయంలో తమిళంలో ‘భక్త కుచేల’లో కృష్ణుడిగా నటింపజేశారు. ఆయన చిన్నతనంలోనే సరస్వతి దేవికి ముందు బాల కలిపారు. దాంతో బాల సరస్వతీ దేవీ అనే పేరు వచ్చింది.

సినీ ప్రస్థానం
భక్త కుచేల తర్వాత తుకారం, బాలయోగిని (తెలుగు, తమిళం), మహానంద చిత్రాల్లో బాల తారగా నటించింది. ఇంతలో ‘ఇల్లాలు’ సినిమా తీస్తూ ఎస్‌.రాజేశ్వరరావు సరసన కథనాయికగా నటింపజేశారు. ఈ సినిమాతోనే సాలూరి రాజేశ్వరరావు పూర్తిస్థాయి సంగీత దర్శకులు అయ్యారు. ఈ సినిమాలో ఆమె పాడిన పాటలు మంచి ప్రాచుర్యం పొందాయి. 1935లో సతీ అనసూయలో బాల నటిగా కనిపించిన బాలసరస్వతి, 1948లో చివరి సారిగా ‘బిలణ’ చిత్రంలో నటించారు. తాను నటిని కావడం తల్లిదండ్రులకు, భర్తకు ఇష్టం లేకపోవడం తో సినిమాల్లో అవకాశాలు వచ్చినా తిరస్కరించారు. ఆమె బాలనటిగా 12 సినిమాల్లో కనిపించారు. తర్వాత కాలంలో ఆమె మంచి గాయ నిగా పేరు తెచ్చుకున్నారు. ‘స్వప్నసుందరి, పిచ్చి పుల్లయ్య, పెళ్లిసందడి, శాంతి, షావుకారు, దేవ దాసు, లైలా మజ్ను, భాగ్యలక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు’ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ప్రజాదరణ పొందాయి. సుదీర్ఘ కెరీర్‌లో ఆమె ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్‌, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, ఏ.పి.కోమల వంటి వారితో కలిసి ఎక్కువగా పాడారు.

ఆకాశవాణిలో…
‘ఇల్లాలు’ సినిమా సెట్స్‌ మీద చూసిన నాటి మద్రాసు రేడియో అధికార బృంద ఆమెని రేడియో కేంద్రానికి తీసుకెళ్లి ఆమె పాటలను లైవ్‌ బ్రాడ్‌ కాస్ట్‌ చేయించారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు. అలా మొదలైన రేడియో ప్రస్థానంలో ఆమెని నెల నెలా పాడమని కాంట్రాక్టు ఇచ్చారు. అలా రేడియోతో ఏర్పడిన ఆమె అనుబంధం 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రారంభోత్సవం నుండి 1998లో స్వర్ణోత్సవానికి పాడే దాకా కొనసాగింది. ఈ ఘనత కేవలం రావు బాల సరస్వతికి మాత్రమే దక్కింది. తెలుగు ప్రాచుర్యం పొందిన ప్రైవేటు గీతాల ఆల్బమ్స్‌ హిందీ, తమిళ, కన్నడ మొదలైన దక్షిణ భారత భాషల్లో సైతం ఎన్నో పాటలు పాడారు.

కోలంక రాజాతో వివాహం
1944 నాటికి తిరిగి మద్రాసు చేరుకున్న బాల సరస్వతి కుటుంబం ఒకసారి అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి వెళ్ళింది. అప్పటికి ఆమె వయసు 15 ఏండ్లు. వెంకటగిరి మహారాజా నాలుగవ కుమారుడు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా ఈ రేసుల్లో ఉండేవి. అక్కడ బాల సరస్వతిని చూసి, ఆమె పాటలు బాగా పాడుతుందనీ, సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్నారు. కొన్నాళ్ళకు వాళ్ళందరూ మద్రాసు వచ్చారు. ‘మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా?’ అన్నారు. వాళ్ళు వచ్చింది పెండ్లి చూపులకే అని సరస్వతి తండ్రికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు. ఆయన సరస్వతినే అడగమన్నారు. రాజావారు అడిగినప్పుడు బాల సరస్వతి కాదనలేకపోయింది. ఆయనకు సరస్వతికి దాదాపు 19 ఏండ్లు తేడా! కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. అలా 1944లో కోలంక రాజాతో ఆమె వివాహం జరిగింది. వివాహనంతరం బాలకు ముందు రావు వచ్చింది. రావు అనేది కూలంక ఎస్టేట్‌ పేరు. ఆ ఎస్టేట్‌ రాజాని పెండ్లి చేసుకోవడంతో ఆమె పేరు ‘రావు బాల సరస్వతీ దేవి’గా మారిపోయింది.

పురస్కారాలు
బాల సరస్వతికి సినీ పరిశ్రమ, ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశాయి. అయినా 1956లో సేలం ఖాది చేనేత ప్రదర్శనలో, బాంబినో వారి ఉత్తమ గాయని పురస్కారాలు, మద్రాసు ఐక్య అకాడమీ సన్మానం, 1985లో ఢిల్లీలో అంబేద్కర్‌ భవన్‌లో ఉత్తమ గాయని అవార్డు, 1988లో మద్రాసు తెలుగు సంగీత అకాడమీ పురస్కారం, 1993లో హైదరాబాదులో ఘంటసాల విగ్రహావిష్కరణ సందర్భంగా లతాచే సన్మానం, 1995లో నాటి ప్రధాని పి.వి.నరసింహా రావుచే జాతీయ సమైక్యతా అవార్డు, 1998లో చంద్రముఖి ఆర్ట్స్‌ వారి స్వర్ణ పథకం, 2000లో పైడి లక్ష్మయ్య స్మారక అవార్డు, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ఆత్మగౌరవ పురస్కారం ఆమెను వరించాయి.

ఎన్టీఆర్‌ పిలుపు-ఆదుకున్న జయలలిత
1974లో భర్త సూర్యారావు బహదూర్‌ మృతి చెందాక బాలసరస్వతి ఆస్తులన్నీ క్రమంగా హరించుకు పోయాయి. ఆ సమయంలో అద్దె ఇంటికి మారిన ఆమె పరిస్థితి తెలుసుకున్న నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఆహ్వానించడంతో హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఎన్టీఆర్‌ మరణించ డంతో బాలసరస్వతిని పట్టించుకున్న వారే లేరు. ఈ దశలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నుండి పిలుపు రావడంతో మద్రాసు వెళ్ళి ఆమెని కలుసుకుంది. జయలలిత ఇల్లు ఇవ్వడంతోపాటు ఆమె పేరు మీద 10 లక్షల రూపాయలు బ్యాంక్‌ లో జమ చేసి అండగా నిలిచారు.

ఒక తరానికి ఆరాధ్యురాలు
వివాహానంతరం పాడటం ఆపేయమని భర్త సూచించడంతో మనసుకు కష్టం వేసినా, ఆయన మాటకు విలువ ఇచ్చి పాడటం ఆపేశారు. భర్త మృతి చెందాక మాత్రమే మళ్లీ ఆమె అడపాదడపా పాడుతూ వచ్చారు. భర్త కనుక ఆమెను ప్రోత్సహిం చినట్లయితే, గాయనిగా ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరుకొనేవారే. తన జీవిత కాలంలో రెండు వేలకు మించి పాటలు పాడిన బాలసరస్వతి 1980 లో చివరగా పాడిన సినిమా విజయ నిర్మల దర్శకత్వం వహించిన ‘సంఘం చెక్కిన శిల్పాలు’లో ‘పోయి రావమ్మ అత్తవారింటికి అపరంజి బొమ్మ’ అనేది. ఏది ఏమైనా రావు బాల సరస్వతీదేవి గాయనిగా ఒక తరానికి ఆరాధ్యురాలు. తెలుగువారి ఇళ్లతో ఆమె పాటలకు విడదీయరాని అనుబంధం.

విరబూసిన స్వరసుమం
లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినారు. ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు శ్రోతలకు ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవి సొంతం. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కూడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే వచ్చారు. తాను పాటల తోటలో విరబూసిన స్వరసుమం, తాను నడిచే పాటకు నిలువెత్తు నిజస్వరూపం. తన పాట ఒక్కటే ప్రాణంగా జీవించిన ఓ రాగాల కోయిల. తెలుగు సినీ సంగీతానికి బాటలు వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వారి గాత్రం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి. ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్‌.జానకి లాంటి దిగ్గజ గాయకులు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు.

పొన్నం రవిచంద్ర,
సినీ విశ్లేషకులు,
ఫోన్‌ : 9440077499.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -