మతోన్మాద విధానాలతో అత్యంత ప్రమాదం
నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం
వర్సిటీలకు నిధులు, ఫెలోషిప్స్ ఇవ్వని కేంద్రం
మూతపడుతున్న పాఠశాలలు.. టీచర్ పోస్టులు ఖాళీ..: ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కన్వెన్షన్ ప్రారంభం
నారాయణగూడ చౌరస్తా నుంచి ఎస్వీకే వరకు భారీ ర్యాలీ, బహిరంగ సభ
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశ విద్యారంగంలో జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలు చేయడం ద్వారా విద్యారంగం అగాధంలోకి వెళ్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో విద్యలో మతోన్మాదాన్ని అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను భాగం చేసి అసమానతలు పెంచుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కన్వెన్షన్ సందర్భంగా హైదరాబాద్‌లోని నారాయణ గూడ చౌరస్తా నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు భారీ ర్యాలీ, అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీ కాంత్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం దేశాన్ని అభివృద్ధి చేస్తుందని బీజేపీ, ప్రదాని నరేంద్రమోడీ నమ్మించి మోసం చేశారన్నారు. ఆచరణ లో దేశంలో లక్షకు పైగా పాఠశాలలు మూసేసి, లక్షకు పైగా టీచర్ పోస్టులను ఖాళీగా ఉంచిందన్నారు. మధ్యప్రదేశ్, హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ, చెన్నయ్ నగరాల్లో జాతీయ విద్యా విధానం- 2020కు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు.
కేంద్రం విధానాలతో తీవ్ర నష్టం : ఎం.సాజి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలతో దేశానికి తీవ్ర నష్టం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజి అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రధాని మోడీ దేశాన్ని అంబానీ, అదానీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. వీటన్నింటికి వ్యతిరేకంగా విద్యార్థులను ఐక్యం చేయాల్సిన బాధ్యత ఎస్‌ఎఫ్‌ఐదే అని చెప్పారు.
ఫెలోషిప్స్ ఇవ్వని కేంద్రం : శిల్ప సురేంద్రన్
కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు నిధులు, విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షు రాలు శిల్ప సురేంద్రన్ చెప్పారు. యూనివర్సిటీల్లో సౌకర్యాల్లేవని, వారు చెప్పిన అంశాలపై పరిశోధనలు చేయని వారికి ఫండ్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాల వల్ల అమ్మాయిలు విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రీకరణ పేరుతో వర్సిటీలపై దాడి :అతిక్ అహ్మద్
కేంద్రీకరణ పేరుతో సెంట్రల్ యూనివర్సిటీలపై కేంద్రం దాడి చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి అతిక్ అహ్మద్ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో డెమోక్రసీ లేకుండా హక్కులను కాల రాస్తున్నారన్నారు. క్యాంపులలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను నడుపుతు న్నారని, వారికి నచ్చిన వారినే యూనివర్సిటీల్లో వీసీలుగా నియమిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ నుంచే ఎన్‌ఈపీ పోరాటం : అశోక్
ఎన్‌ఈపీ పోరాటానికి హైదరాబాద్ వేదిక కానుందని ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి అన్నారు. ఈ సెమినార్ ద్వారా విద్యా రంగంలో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమిస్తుందన్నారు. ఈ బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా సహాయ కార్యదర్శి రోహిదాస్, కేంద్ర కమిటీ సభ్యులు ఎం.మమత, బస్వరాజు, శివప్ప, సుజాత, మనీషా, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, బి. శంకర్, కె.ప్రశాంత్, సహాయ కార్యదర్శి దీపిక, రంజిత్, శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా నాయకత్వం శ్రీమాన్, నాగేందర్, రజినీకాంత్, స్టాలిన్, రమ్య, సహాన, జె. రమేష్, ప్రవీణ్, చరణశ్రీ, ప్రశాంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను అభద్రతా భావంలోకి నెడుతున్న బీజేపీ: టి.సాగర్
దేశంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను చేస్తూ ప్రజలను అభద్రతా భావంలోకి నెడుతున్నదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టి.సాగర్ అన్నారు. ప్రజలు తిరగబడిన ప్రాంతాల్లో నిర్బంధం ప్రయోగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్‌ల పేరుతో కార్మిక వర్గంపై, ఉపాధి హామీ చట్టాన్ని మార్చి కూలీలపై, యూజీసీని రద్దు చేసి వీబీఎస్ బిల్లుతో విద్యారంగంపై దాడి చేస్తోందన్నారు.
కేంద్రం విధానాలే రాష్ట్రంలోనూ అమలు : నాగరాజు
జాతీయ నూతన విద్యా విధానం-2020ను రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్ చేశారు. పీఎంశ్రీ, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో నూతన విద్యావిధానాన్ని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో విద్యను కేంద్రీకరణ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ విద్యాపాలసీని కూడా జాతీయ విధానానికి అనుగుణంగా తయారు చేస్తున్నారని, అందుకే తెలంగాణ విద్యా పాలసీ కంటే ముందు అసెంబ్లీలో ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.



