రెండు స్థానాలకు కాంగ్రెస్ నామినేషన్లు
సీఎం, పీసీసీ చీఫ్, మంత్రుల హాజరు
అభిషేక్ మను సింఘ్వీ, నరేందర్‌రెడ్డి ఏకగ్రీవమే
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు గా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి వీరిద్దరూ గురు వారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసినట్ట యింది. సింఘ్వీ మూడు సెట్‌ల నామినేషన్లు దాఖలు చేయగా, వేం నరేందర్ రెడ్డి నాలుగు సెట్‌ల నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి నామినేషన్ వేశారు. ఇది ఎన్నికల అధికారి పరిశీలనలో తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. దాంతో అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవం కానున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపలేదు.
గతంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన అభిషేక్ మను సింఘ్వీ పదవి కాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఇక తెలంగాణ నుంచి మరో రాజ్యసభ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు దాదాపు 16 మంది పోటీ పడ్డారు. ఆ జాబితాలోని ఎవరికి ఈ రాజ్యసభ స్థానం దక్కుతుందోననే తీవ్ర ఉత్కంఠ సైతం నెలకొంది. అందుకోసం బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అయ్యారు. చివరకు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి వేర్వేరుగా జరిగిన నామినేషన్ల కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బి.మహేష్‌కుమార్‌గౌడ్, విప్ ఆది శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు .



