Sunday, December 21, 2025
E-PAPER
Homeసమీక్షపాతిక రత్నాల పచ్చల హారం విభిన్న!

పాతిక రత్నాల పచ్చల హారం విభిన్న!

- Advertisement -

సమాజంలో భాగమైన మనిషికి, సమాజానికి ఉన్న రకరకాల భావోద్వేగాలకు, వెతల, స్పర్థలకు చిత్రిక పట్టిన విభిన్న భావాల సమాహారమే ఈ ‘విభిన్న’ విలక్షణ కథా సంకలనం. తెలుగుసాహితీవనం వ్యవస్థాపక అధ్యక్షులు శాంతి కష్ణ కషితో వెలసిన పాతిక రత్నాల పచ్చల హారం!
ప్రముఖ సాహిత్య విమర్శకులు, అనువాదకులు అయిన డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, చెప్పీ చెప్పనట్లు, లోగుట్టు విప్పీ విప్పనట్లు వ్రాసిన ముందు మాట ‘నిశ్శబ్ద విప్లవం’ చదివితే ఈ గ్రంథం ఎంతటి విలక్షణమైనదో, అపురూపమైనదో తెలుస్తుంది. అంతేకాదు, శీర్షికకు సరిగ్గా సరిపోయే కథల నెన్నింటినో ఇముడ్చుకున్న ఈ గ్రంథం విలువ తెలియడమే కాదు. తక్షణం చదివించేలా చేస్తుంది.
ఇందులో పులి గురించి ఉన్న రెండు కథల్లో ఒకటి ‘డి లాస్ట్‌ రోర్‌’ వివేక్‌ లంకమల కథ అయితే, ‘పులి అవతారం’ చరణ్‌ పరిమి రాసినది. ఇద్దరూ యువ రచయితలు. క్రూర మగం అనబడే పులి కన్నా, పులి లాంటి పోలీసు మనిషి ఎంత భయంకరమైన మగమో చరణ్‌ చిత్రీకరిస్తే, అడవిలోని సాధుజంతువుల, క్రూర జంతువుల ఆకలి, ఆధిపత్య పోరును వివేక్‌ కథలో చూస్తాం. చాలా అరుదైన కథలు ఇవి. ఊహించి వ్రాసేవి కావు. ఒక రకంగా పరిశోధించి వ్రాసినవి. మంచి వస్తు వైవిధ్యాన్ని కనబరుస్తాయి.
ప్రసిద్ధరచయిత, కథలకు సహజసిద్ధమైన తెలంగాణా గుభాళింపుల సొగసులద్దె పెద్దింటి అశోక్‌ కుమార్‌ గారి కథ ‘నాయకుడు’, నిత్యం అబద్ధాలతో కాపురం చేసే రాజకీయ నాయకుల నైజాన్ని తెలియజేస్తూ, నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది.
కుటుంబ బాంధవ్యాల విలువలను, ఎవరు ‘ఒంటరి’ అంటూ ప్రశ్నిస్తూ సాగిన కథ రమాదేవి కులకర్ణిది. ఈతకోట సుబ్బారావు రాసిన ‘మొలక’ కార్పోరేట్‌ ఆస్పత్రుల దోపిడీని చూపిస్తూనే, రేపటి యువతకు పర్యావరణంపై ఉన్న అవగాహనను, పరిశీలను చూపించి మంచి సందేశాన్ని అందించిన కథ.
మంచి వ్యాఖ్యాత, మనసు దోచుకునే రచనలకు పెట్టింది పేరైన ప్రసిద్ధ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి ‘సంధ్యాసమయం’, దాదాపు అరవై దాటిన ఒంటరి మహిళల జీవితాల్లోని వెతలను చూపిస్తూనే, పరిష్కారంగా ఒక కొత్త ఆలోచనను చెప్పిన కథ.
ప్రసిద్ధ రచయిత డా.ఏనుగు నరసింహారెడ్డి కథ ‘సేవింగ్‌ ది స్కిన్‌’ చదివితే అందరికీ ఇది ఆయన స్వీయానుభవం అనే అనుమానం కలగక మానదు.
‘హుమాయున్‌ సంఘీర్‌’ రాసిన ‘పచ్చటి సంబురం’ రైతుల వెతలను, గ్లోబలీకరణ నేపథ్యంలో కులవత్తులు దూరమైన జనం బాధలను కళ్ళముందు ఉంచింది.
‘భువన చంద్ర’ ‘వానా గో దే’ శీర్షిక చూడగానే విలక్షణంగా ఉండి ఆకర్షిస్తుంది. ఆసక్తి కలిగిస్తుంది. సినీ కళాకారులకు ఎదురైన అవమానాలను, వెతలను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ‘నేను చూసిన నక్షత్రం’. నేడు వావి వరసలు, వయో భేదం మరిచి జరుగుతున్న అత్యాచారాలకు, వేధింపులకు అద్దం పట్టిన కథ ‘శాంతి కృష్ణ’ రాసిన మరక’.
ఆకాశంలో సగం అంటూ సాగుతున్న ఈ కాలంలో కూడా ఆడపిల్ల పుట్టినందుకు ఇంకా మహిళలు ఎదుర్కునే సమస్యలు, కుటుంబంలో పర్యవసానాల గురించి చర్చించిన వాసరచెట్ల జయంతి ‘ప్రశ్నాపత్రం’. అమ్మ మనసు గొప్పతనాన్ని చూపించిన నామని సుజనాదేవి’ అమ్మ అబద్ధాల కోరు’, స్వాతంత్యం వచ్చిందని వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఇంకా తీరని నిరుద్యోగ సమస్య గురించిన కథ సంపత్‌ కుమార్‌ రాసిన ‘ దేశమంటే’ అయితే, కుటుంబ వ్యవస్థలోని సంబంధాల నేపథ్యంలోని కథ శ్రీ ఊహ ‘పచ్చల సెట్టు’.
తన స్నేహితురాలికి జరిగిన సంఘటనను కథగా మలిచి ఆత్మ సౌందర్యాన్ని గుర్తించాలని తెలియజెప్పిన కథ అరుణ సందడి ‘వీక్షణ’ అయితే, రాయలసీమ మాండలికంలో కుటుంబం లోని భావోద్వేగాలను చూపించిన కథ అరుణకుమారి ‘తాళిబొట్టు’.
చిన్నతనంలో ఏమీ తెలియని వయసులో చేసిన తప్పుకు కన్నవారికి దూరమైన బాలుడు తనవారి కోసం పడే తపనతో పాటు సందేశాన్ని అందించిన కథ సుధా కళ్యాణి గారి ”తెలిసీ తెలియక”
సమాచారసాధనాలపై వ్యంగ్యం, హాస్యం కలిపి వడ్డించిన అస్త్రమే సత్యాజీ గారి ‘వార్తాలహరి’. ప్రస్తుత పరిస్థితులలో తప్పులు చేస్తున్న సమాచార సాధనాల అత్యుత్సాహంపై వాడి వేడి చురకలు వేసిన కథ.
హాస్యభరితంగా సీనియర్‌ సిటిజన్‌ మానసిక పరిస్థితిని, కుటుంబ నేపథ్యంలో చూపించిన కథ అవ్వారు శ్రీధర్‌ బాబుగారి ‘వెళ్ళిపోవాలా’ , నేడు ఇంటింటా తోడబుట్టిన వారి మధ్య వచ్చిన కలతలను చూపించిన కథ శ్రీధర్‌ రెడ్డి బిల్లా వ్రాసిన ‘సగం’ కథ. ఆ విభేదాలు అలాగే తరతరాలుగా కొనసాగకుండా ఇందులోని ముగింపు మంచి సందేశాన్ని ఇస్తుంది.
మంచి భావుకతతో, రొమాంటిక్‌గా సాగిన కథ ఫీల్‌ గుడ్‌ కథ సుదర్శన్‌ బూదూరి ‘చందమామతో ఒక మాట చెప్పాలి’. విజరు అప్పళ్ళ ‘నేను నా హెడ్‌ ఫోన్స్‌’ ఈనాటి తరానికి సరిగ్గా సరిపోయే విలక్షణ మైన కథ. మాయమవుతున్న కులవత్తుల జీవితాలను చిత్రిక పట్టిన కథ సురేంధ్ర నాథ్‌ ‘నందిరాజా’. ఆకారాన్ని బట్టి అవహేళన చేసిన వారికి కనువిప్పు కలిగేలా, ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం అంటూ చెప్పిన చక్కటి కథ’ సోమశంకర్‌ ‘లావైతెనేమిరా జీవుడు’.
పాతిక కథలు ఉన్నా, దేని ప్రత్యేకత దానిదే! కొన్ని కథల శీర్షికలు చూడగానే అందులోని సారాన్ని చెప్పెట్లు ఉన్నాయి. కొంచెం నర్మగర్బంగా ఉంటే ఇంకా బావుంటుంది. అన్నింటిలోని వస్తువైవిధ్యం, శిల్పం, నడక ఆసక్తిగా ఉండి ఆద్యంతం ఆపకుండా చదివిస్తాయి.
ఇలా విలక్షణమైన కథలతో మూడవ కథల సంకలనంగా తెలుగుసాహితీవనం నుండి ఎంతో శ్రమ కోర్చి పుస్తక రూపేణ తీసుకు వచ్చిన ఈ ‘విభిన్న’ కు తెరవెనక ఉండి సహాయం అందించిన ‘శాంతికష్ణ’కి, ఇందులోని పాతిక మంది రచయితలకు అందరికీ హార్థిక శుభాకాంక్షలు.

-నామని సుజనాదేవి, 7799305575

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -