Thursday, March 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపాత పద్ధతిలోనే ఉపాధి హామీని కొనసాగించాలి

పాత పద్ధతిలోనే ఉపాధి హామీని కొనసాగించాలి

- Advertisement -

‘ఉపాధి’పై బీజేపీ దాడి.. కేంద్రం చర్యలను ప్రతిఘటిద్దాం
అర్హులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పనులను కొనసాగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్‌ చేశారు. ఉపాధి పనులు ప్రారంభించే సమయంలో, పనులు ముగిసిన తర్వాత ప్రతిరోజూ ఫొటో క్యాప్చర్‌ విధానం తప్పనిసరి చేయడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. బుధవారం సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీల కు పాత పద్ధతిలోనే పనులు కొనసాగించాలని, ఫొటో క్యాప్చర్‌ విధానం రద్దు చేయాలని, పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని, నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ఉపాధి హామీ పనులపై సర్వే నిర్వహించడం వల్ల అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి ‘వీబీజీఆర్‌ఏఎంజీ’ ని తీసుకువచ్చి పాత చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని విమర్శిం చారు. ఉపాధి పనులు ప్రారంభమై ఎనిమిది వారాలవుతున్నా కూలీలకు ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదని అన్నారు. మూడు గంటలు పని చేస్తే అటెండెన్స్‌ కోసం ఇంకో మూడూ నాలుగు గంటలు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, పని ప్రదేశాల్లో టెంట్లు, మంచినీరు, ప్రమాదం జరిగితే వసతులు లేవని, కూలీల భద్రతకు ఎలాంటి రక్షణా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నక్కవాగు కాలుష్యంతో అనేక గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయని, ప్రభు త్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలు గ్యాస్‌ సిలిండర్లతోపాటు పెట్రోల్‌, డీజిల్‌ కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.జయరాజు మాట్లాడుతూ.. జిల్లాలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలు చాలా మంది ఉన్నారని వారం దరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి అందులో గుడిసెలు వేసి ఆక్రమిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం మల్లేశం, కె.రాజయ్య, అతిమేల మానిక్‌, జి.సాయిలు, ఎం.నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -