Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజనవరిలో రైతు యాంత్రీకరణ పథకం పున:ప్రారంభం

జనవరిలో రైతు యాంత్రీకరణ పథకం పున:ప్రారంభం

- Advertisement -

రైౖతుభరోసా కోసం శాటిలైట్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయాలి
సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి : వ్యవసాయశాఖ సమీక్షలో మంత్రి తుమ్మల


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పున్ణప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆ పథకంలో భాగంగా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు, యంత్రాలు అందచేయనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఆపేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ ప్రభుత్వం క్రమంగా పునరుద్ధరిస్తున్నదని తెలిపారు. జాతీయ ఆహర భద్రత మిషన్‌లో భాగంగా పప్పుదినుసుల విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నామని గుర్తుచేశారు. రైతు యాంత్రీకరణ పథకం కింద ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. రైతులకు అందుతున్న సబ్సిడీలు, యాంత్రీకరణ పథకం దరఖాస్తులు, యూరియా యాప్‌ అమలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌ను అధికారులు సేకరించాలని సూచించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క పైసా కూడా వథా చేయొద్దనే ఆలోచనలో సీఎం ఉన్నారనీ, అందుకోసం స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు ఇప్పటికే కేంద్ర పథకాల కోసం స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేసి రూ. 400 కోట్లను వినియోగించామని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని అధి కారులను ఆదేశించారు. యూరియా యాప్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తు న్నాయని విమర్శించారు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ సమర్థవంతంగా అమలవు తోందని, రైతులు కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులు తమకు కావాల్సినంత యూరియాను కొనుగోలు చేయొచ్చనీ, అనవసర భయాందోళనకు గురి కావద్దని సూచించారు. రబీ సీజన్‌ రైతుభరోసా కోసం శాటిలైట్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌ను త్వరితగతిన పూర్తి చేసి, రైతుభరోసా నిధులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు వివరించాలనీ, మట్టిసారాన్ని పెంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -