సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ మహాసభ ప్రారంభం
కార్మిక ప్రదర్శన
నవతెలంగాణ-బంజారాహిల్స్
కార్మికుల హక్కుల పరిరక్షణ పోరాటంలో సీఐటీయూ ఎల్లప్పుడూ ముందడుగు వేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 16వ మహాసభ శనివారం ప్రారంభమైంది. బంజారాహిల్స్ జీవీకే మాల్ నుంచి రాయల్ ఫంక్షన్ హాల్ వరకు సాగిన కార్మిక ప్రదర్శనను సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ ప్రారంభించారు. అనంతరం సీఐటీయూ జెండాను గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి ఎగరవేశారు.
ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్‌లను తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం.. యజమానుల చేతుల్లో కార్మికులను బానిసలుగా మార్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 8 గంటల పని స్థానంలో 12 గంటల పని విధానాన్ని మోడీ సర్కార్ ప్రవేశపెట్టిందని తీవ్రంగా విమర్శించారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 ప్రకటించాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా యజమానుల పక్షం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చిన మోడీ సర్కార్.. అన్నదాతల ఉద్యమాలతో వెనక్కి తగ్గిందని, అదే విధంగా లేబర్ కోడ్‌లను రద్దు చేసేవరకు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం అడుగుజాడల్లో నడుస్తూ జీవో 282 ద్వారా కార్మికులతో 10 గంటలు పని చేయించాలని ఆదేశించడం అన్యాయం అన్నారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాజమాన్యాల ఒత్తిడితో కనీస వేతనాలను పెంచకుండా నోటిఫికేషన్‌లు విడుదల చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర-రాష్ట్ర కార్మిక సంఘాలకు కనీస వేతన మండలిలో ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, కోశాధికారి కే అజయ్ బాబు, ఉపాధ్యక్షులు సి.మల్లేష్, జి.రాములు, టి.మహేందర్, సహాయ కార్యదర్శులు ఎం సత్యనారాయణ, పి.శ్రీనివాస్, నగర కమిటీ సభ్యులు ఎస్ శోభ తదితరులు పాల్గొన్నారు.