Monday, November 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనీటి సంరక్షణతోనే భవిష్యత్‌

నీటి సంరక్షణతోనే భవిష్యత్‌

- Advertisement -

– పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన సంగారెడ్డి జిల్లా
– తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారాలు
– ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించేలా ప్రణాళిక
– పది గ్రామాలకు రూ.48 కోట్లు కేటాయింపు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

మానవజాతి మనుగడకు ప్రకృతి వనరైన నీరే ప్రధానం. నీటి సంరక్షణపైనే భవిష్యత్‌ ఆధారపడి ఉంది. నీరు పుష్కలంగా లభిస్తున్న ప్రాంతాలు అభివృద్ధి పరంగా ముందు వరుసలో ఉంటాయి. తాగునీరు, సాగునీరు ప్రస్తుతం పుష్కలంగా లభిస్తున్నప్పటికీ నీటి వృథా కారణంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నీటి నిల్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించడం కోసం.. గ్రామాల్లో వాటర్‌షెడ్‌లు ఏర్పాటు చేసి నీటి నిల్వల పెంపుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఈ సందర్భంగా నీటి కొరత ఉన్న 10 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. ఆ గ్రామాల్లో వాటర్‌ షెడ్‌లను ఏర్పాటు చేయడం, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణం చేపడతారు. ఎంపికైన 10 గ్రామాల్లో నీటి నిల్వ పెంచేందుకు ప్రభుత్వం రూ.48 కోట్ల నిధులను కేటాయించింది. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడంతో నీటిని అందులోకి మళ్లించడం, గ్రామంలోని మురుగు కాలువల నీటిని పెద్దపెద్ద ఇంకుడు గుంతల్లోకి పంపి భూమిలోకి ఇంకెలా చేయడం వల్ల భూగర్భ జలాలు పెంపొందించొచ్చు.

ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం..
తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారాలు కనుగొనడం, ఆధునిక నీటి సంరక్షణ టెక్నాలజీని ప్రజలకు చేరవేయడం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వ్యవసాయ భూభాగాల్లో మైక్రో-ఇర్రిగేషన్‌ (డ్రిప్‌/స్ప్రింక్లర్‌) వినియోగాన్ని పెంచడం, గ్రామంలోని 340 ఇండ్లల్లో వర్షపు నీటి సంరక్షణ పిట్‌లు ఏర్పాటు చేయడం, పాఠశాలలో నీటి ఆదా క్లబ్‌, చెరువుల పునరుద్ధరణ వంటివి చేపడతారు. నీటి సంరక్షణకు దేశవ్యాప్త పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్‌, గుంతపల్లి, హరిదాస్‌ పూర్‌, బాచుపల్లి, మన్సాన్‌పల్లి, గొల్లపల్లి, మారేపల్లి, కొండాపూర్‌, మహమ్మదాపూర్‌, ఆందోల్‌ గ్రామాలను ఎంపిక చేశారు.

నీటి సంరక్షణపై అధికారులకు శిక్షణ..
సంగారెడ్డి జిల్లాలో నీటి సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఎంపికైన 10 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవోలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన సమావేశంలో నీటి సంరక్షణ, వర్షపు నీరు నిలువ, వీటిని పొదుపుగా వినియోగించడం, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించారు.

నీటి సంరక్షణపై భవిష్యత్‌ ఆధారపడి ఉంది
నీటి సంరక్షణ మీదనే భవిష్యత్‌ ఆధారపడి ఉంది. అందులో భాగంగా వాటర్‌ హెడ్‌ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, సుస్థిరమైన నీటి భవిష్యత్‌ కోసం సంఘాలను సాధికారపరచడంపై జిల్లాలో ఎంపిక చేసిన పది గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవోలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించాం. ఈ ప్రాజెక్టు కింద మన ఊరిలో, మన ఇంట్లో కురిసిన ప్రతి వర్షపు చినుకు మనదే. మన ఇంటి ఆవరణలో, మన ఊరి ఆవరణలో వాటిని భూమిలోకి ఇంకెలా చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. నీటి వృథాను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఎంపిక చేసిన 10 గ్రామాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి వసతి కల్పించడం, నీటి వృథాను అరికట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆయా గ్రామాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకునేలా చూడటం, భూగర్భ జలాల పెంపు కోసం నీటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవడంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి భవిష్యత్‌లో తాగునీరు సాగునీరు కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవగాహన కల్పిస్తాం.
– చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -