కొండమడుగు నర్సింహ్మ
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఉపాధిని హరించే జీ రాం జీ చట్టాన్ని రద్దు చేసి, 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఆలేరు పట్టణంలోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యాలయంలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీ రాం జీ చట్టాన్ని రద్దుచేసి,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి జీ రాం జీ చట్టాన్ని తేవడం గ్రామీణ పేదలకు, వ్యవసాయ కార్మికులకు,కూలీలకు చేసిన ఘోర నమ్మక నమ్మకద్రోహం అన్నారు.ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని ఆవేదన వ్యక్తం చేశారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎవరో దయ దక్షిణాల మీద రాలేదని అది ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టబద్ధమైన ఉపాధి హక్కు అని వివరించారు.ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారంగా ఇవ్వబడే భిక్షగా మార్చారని ఆవేదన వెలిబుచ్చారు.
రెండు రోజులలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పని పొందే హక్కుగా ఉన్న చట్టాన్ని కార్పోరేట్ శక్తుల కోసం కూల్చివేశారని,పేదల ఉపాధిపై వారి జీవనంపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ మోడల్‌ను అమలు చేసిందని విమర్శించారు.మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులే ఈ రోజు గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కూడా చంపి మతతత్వ రంగును పులమటానికి రాంజీ వచ్చే విధంగా బిల్లును తీసుకొచ్చారని తెలిపారు.
నాడు రైతాంగానికి వ్యతిరేకంగా మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో 2005 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించడానికి జీ రాంజీ చట్టాన్ని రద్దు కోసం రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాద శక్తులు, అందరూ ఐక్యంగా ఈ పోరాటంలో కలిసి రావాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఇంకా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జూకంటి పౌలు అధ్యక్షత వహించారు.
తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య , ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడవయ్య, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ. ఇక్బాల్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చెక్క రమేష్ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు లక్ష్మి , సిఐటియు పట్టణ మండల కన్వీనర్లు మొరిగాడి రమేష్ , సంగి రాజు, రైతు సంఘం మండల కార్యదర్శి సుధాగాని సత్య రాజయ్య పాల్గొని మాట్లాడగా ఇంకా మధ్యబోయిన ఉప్పలయ్య, కూరాకుల మల్లికార్జున, చౌడబోయిన యాదగిరి, ఘనగాని మల్లేష్, పోతరాజు నరసయ్య, నెలిగొండ సుధాకర్, బర్ల సిద్ధులు, దండు ఐలయ్య, మాలోతు చింటూ, సాయిని కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.



