నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం అధికారులు ఎత్తారు. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి, ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా జులై 1న గేట్లను తెరిచారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఉన్న 14 గేట్లను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారుల పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు పైకి లేపారు. దీంతో గోదావరి నదిలోకి నీటి ప్రవాహం మొదలైంది.
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఏటా జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాల్సి ఉంటుంది. ఈ కాలంలో ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయకుండా, గోదావరి నది సహజ ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. ఈ నిబంధనను అనుసరిస్తూ మంగళవారం ఉదయం అధికారులు గేట్లను ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,064 అడుగుల వద్ద ఉందని అధికారులు వెల్లడించారు.
బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులతో పాటు గోదావరి నదిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద నీరు నేరుగా దిగువకు చేరనుండటంతో తమకు ప్రయోజనం కలుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.