పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
ఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య రథయాత్ర
నవతెలంగాణ- హైదరాబాద్
బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యమని పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ నుంచి ఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ చేపట్టిన సామాజిక చైతన్య రథయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇప్పటికీ రాజ్యాధికారం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్గాలను చైతన్యవంతులను చేయటానికి సంకల్పించిన దిలీప్‌కుమార్ యాత్రకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ గాలి వినోద్ మాట్లాడుతూ దిలీప్‌కుమార్ మొదటి నుంచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యమకారుడు అని కొనియాడారు. ఆయన సంకల్పించిన సామాజిక చైతన్య రథయాత్ర ద్వారా బహుజనులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వాల్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బహుజనులు ఏకమై రాజ్యధికారాన్ని చేపడితే తప్ప న్యాయం జరగదన్నారు.
అరుణోదయ కళాకారిణి విమలక్క మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ దోపిడీకి గురయిందని, అంతకంటే ఎక్కువగా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ ఉందన్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దిలీప్ తెలంగాణ సాధనకు అన్ని పార్టీలతో కలిసి నడిచారని, కులాలకు అతీతంగా సామాజిక స్పృహ ఉన్నవాడని అన్నారు. ఇప్పుడు కూడా పదవులు ఆశించకుండా సామాజిక చైతన్యానికి నడుం కట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రీయ లోక్‌దళ్ జాతీయ మహిళా అధ్యక్షురాలు ఇందిరా మాట్లాడుతూ ఈ చైతన్య యాత్ర ఉద్దేశం బడుగు బలహీన వర్గాల ఏకమై రాజ్యాధికారం చేపట్టటమేనని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ‘యువతా మేలుకో తెలంగాణ ఏలుకో’ అనే నినాదంతో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు టీఆర్‌ఎల్డీ రాష్ట్ర నాయకులు గిరి కుండే, మల్లేష్ ముద్దం, సిద్ధం కుమార్, రిషబ్ జైన్, ప్రసాద్, జానీ, బుల్లెట్ వెంకన్న కళా బృందం పాల్గొన్నారు.
బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



