– సర్పంచ్ కంపదండి అశోక్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు సర్పంచ్ కంపదండి అశోక్ అన్నారు. శనివారం మండలంలోని నాగాపూర్ లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో చేపట్టిన పారిశుధ్యం, క్లోరినేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రత గ్రామంగా తీర్చిదిద్ది, మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ఆయా కాలనీలో మురికి కాలువలో పేరుకుపోయిన మట్టి, చెత్తచెదారాన్ని పంచాయతీ పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తున్నామన్నారు.
అదేవిధంగా గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ తో పాటు ఆయా కాలనీలోని మినీ వాటర్ ట్యాంకుల వద్ద, మురికి కాలువల వెంట క్లోరినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. అందులో భాగంగా పరిశుద్ధ కార్మికులు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నట్లు వివరించారు. ప్రజలు కూడా గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా నిలిపేందుకు సహకరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ కోరారు. ప్రజల సహకారం ఉంటే గ్రామాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.



