బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి :
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జాగృతి కార్యాలయంలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాజిక తెలంగాణే తెలంగాణ జాగృతి లక్ష్యమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం, బీసీల కోసం ఉద్యమం చేస్తానని జయశంకర్ అనేవారని గుర్తు చేశారు. ప్రపంచీకరణ, కార్పొరేట్ల నేపథ్యంలో వృత్తి పనులు నాశనమవుతున్న క్రమంలో సామాజిక విప్లవం రావాలని ఆకాంక్షించేవారనీ, ఆయన స్పూర్తితో జాగృతి పనిచేస్తుందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై తాను చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను ప్రభుత్వం భగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ధర్నా కోసమే తన దీక్షను భగం చేశారని ఆరోపించారు. బీసీ బిల్లుల ఆమోదానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కలవాలని సూచించారు. గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు.
అటువంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్ట కుండా ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా బీసీ బిడ్డలను మోసం చేస్తున్న ట్టేనని అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లీంల శాతం ఎంత అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదనీ, అలాంటప్పుడు అందులో ముస్లీం రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజరుకి ఎలా తెలుసని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు నవీన్ ఆచారి, వరలక్ష్మీ, రూప్ సింగ్, సంపత్ గౌడ్, మరిపెల్లి మాధవి, కొట్టాల యాదగిరి, రాము యాదవ్, అర్చనా సేనాపతి, శ్రీకాంత్ గౌడ్, లలితా యాదవ్, మహేందర్, లింగం తదితరులు పాల్గొన్నారు.
సామాజిక తెలంగాణే జాగృతి లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES