– లక్షల ఎకరాలకు నీరు
– కేసీఆర్ ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు
– అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. మేమొచ్చాక మిత్తితో చెల్లిస్తాం..: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్
– బనకచర్ల నీటి దురభిప్రాయాన్ని తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-చర్లపల్లి
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన కాలం సంక్షేమానికి స్వర్ణయుగంలా నిలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ వీఎన్‌ఆర్ గార్డెన్‌లో శనివారం జరిగిన బీఆర్‌ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్రం సహకారం లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని తెలిపారు. రైతుబంధు ద్వారా రూ.73 వేల కోట్లు రైతులకు అందించామని, తలసరి ఆదాయంలో దేశంలో తొలి స్థానానికి చేరామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నాలుగేండ్లలో పూర్తిచేయడం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. లక్షల ఎకరాలకు సాగు నీరు, వేల గ్రామాలకు తాగునీరు అందించామన్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్‌తో చిన్నారులు చనిపోతే ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందిచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, 25 లక్షల మంది కౌలు రైతులకు రైతుబంధు.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. నోటిఫికేషన్లు నిలిపేశారని, ప్రజల్ని మోసం చేశారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కుట్రలకు బలి కాకుండా నిజాలు తెలుసుకోవాలన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా జవాబు చెబుతామని హెచ్చరించారు. లగచర్లలో రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం గిరిజనుల భూములు లాక్కోవడానికి కుట్రలు పన్నారని విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూములపై పోరాటం చేసింది విద్యార్థులేనని అన్నారు. పోరాడిన వారికే రాజకీయంగా అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.
బనకచర్ల నీటి దురభిప్రాయాన్ని తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే హరీశ్‌రావు
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు గోదావరి నీటిని తరలించే కుట్ర జరుగుతోందని, దాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సదస్సులో పాల్గొన్న ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బనకచర్ల ప్రాజెక్టు గురించి వివరించారు. ”బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా 200 టీఎంసీల నీటిని తరలించాలన్నది తెలంగాణ హక్కును హరించే కుట్ర. 2018లో చంద్రబాబు కాళేశ్వరం నిలిపేయాలని లేఖ రాశారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులను కూడా ఆపాలని అప్పుడు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఇప్పుడేమో రెండు కండ్ల ఆటలా నటిస్తున్నారు” అని విమర్శించారు. తెలంగాణకు గోదావరిలో 967 టీఎంసీలు హక్కుగా లభించాయని తెలిపారు. ”బీఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే బనకచర్లను తెరపైకి తెస్తున్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, దేశపతి శ్రీనివాస్, రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే స్వర్ణయుగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES