– బిల్లుల్ని సమీక్షించేందుకు కోర్టులున్నాయి : తమిళనాడు వాదనలు
– రాష్ట్రాలకు ఆ హక్కులే లేవన్న కేంద్రం
– రాష్ట్రపతి ప్రస్తావనపై సుప్రీంలో కొనసాగుతున్న విచారణ
న్యూఢిల్లీ : గవర్నర్ న్యాయమూర్తి మాదిరిగా వ్యవహరించలేరని, బిల్లును సమీక్షించలేరని, బిల్లులేవైనా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తున్నాయా లేదా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా వున్నాయా అని చూసేందుకు న్యాయస్థానాలు వున్నాయని తమిళనాడు ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి గురువారం సుప్రీంకోర్టులో వాదించారు. బిల్లులకు ఆమోదం తెలిపే విషయమై గవర్నర్, రాష్ట్రపతికి కాల పరిమితి విధించవచ్చా అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రస్తావనపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఆయన తమిళనాడు వాదనలు వినిపించారు. బిల్లుకు ఆమోదం తెలియచేయకుండా తన వద్దనే అట్టిపెట్టుకోవడం, అసెంబ్లీకి తిప్పి పంపించడమనేది పరస్పరం ముడిపడిన అంశాలని ఆయన పేర్కొన్నారు. వెనక్కి తిప్పి అసెంబ్లీకి పంపకుండా గవర్నర్ బిల్లును తన వద్దనే అట్టిపెట్టుకోలేరని ఆయన వాదించారు. మొదటిసారి బిల్లును తిప్పి పంపిన తర్వాత అసెంబ్లీ అదే బిల్లును ఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ ఆమోదించి పంపితే, ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ తన వద్ద రిజర్వ్ చేసుకోగలరా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారు అధ్యక్షతన గల ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది.
దానిపై సింఘ్వి మాట్లాడుతూ, బిల్లులో అభ్యంతరకరమైన అంశమేదైనా వుంటే దానికి సంబంధించి గవర్నర్‌కు చేయగలిగిందేమీ లేదు. అయినప్పటికీ ఒకవేళ బిల్లు అభ్యంతరకరమని ఆయన భావించిన పక్షంలో తన వద్దకు మొదటిసారి వచ్చిన సమయంలోనే 200వ అధికరణలోని ప్రధాన భాగంలో గల మూడు అవకాశాలను ఉపయోగించుకుంటూ ఆయన ఆ బిల్లును రాష్ట్రపతికి పంపేందుకు రిజర్వ్ చేసుకోవాలని సింఘ్వి చెప్పారు. కానీ రెండోసారి వచ్చినపుడు గవర్నర్ అలా రిజర్వ్ చేసుకోలేరు, ఒకవేళ అటువంటి పరస్పర విరుద్ధమైన బిల్లు చట్టంగా మారితే, దానిపై నిర్ణయించాల్సింది కోర్టు అని చెప్పారు. ఒకవేళ ఆ బిల్లును రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేసినప్పటికీ, మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకే ఆయన వ్యవహరించాల్సి వుంటుందన్నారు. బిల్లు ఫాల్స్ త్రూ (మురిగిపోవడం) అంటే వాస్తవంగా అర్ధం ఏమిటని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారు ప్రశ్నించారు. దానిపై సింఘ్వి స్పందిస్తూ, గవర్నర్ తనకు గల రెండో అవకాశాన్ని ఉపయోగించుకుని బిల్లుకు ఆమోదం తెలియచేయకుండా, తన వద్దనే అట్టిపెట్టుకుని, ఆ తర్వాత తిరిగి అసెంబ్లీకి పంపినపుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారు.
అసెంబ్లీ బిల్లును తిప్పి పంపకపోతే, ఇక ఆ బిల్లు మురిగిపోయినట్లేనని అన్నారు. ఆ సమయంలో జస్టిస్ నరసింహా జోక్యం చేసుకుంటూ, ఇక్కడ ‘ఫాల్స్ త్రూ’ అనే పదాలు సరైనవి కావని, ఆ పదాలను ఉపయోగించడం వల్ల గందరగోళం సృష్టించబడుతుందన్నారు. బిల్లు ల్యాప్స్ అవుతుంది (మురిగిపోతుంది) అనడం కరక్టని వ్యాఖ్యానించారు. మనీ బిల్లును విడిగా లేదా ప్రత్యేక కేటగిరీగా 200వ అధికరణ భావించడం లేదని, గవర్నర్ మనీ బిల్లుకు కూడా ఆమోదం తెలియచేయకుండా తన వద్దనే అట్టిపెట్టుకోవచ్చని సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనపై కూడా డాక్టర్ సింఘ్వి స్పందించారు. మనీ బిల్లును విత్‌హెల్డ్‌లో పెట్టవచ్చని తానెపుడూ అనలేదని తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే నిజానికి రాష్ట్ర స్థాయిలో గవర్నర్ సిఫార్సుతోనే ఫైనాన్షియల్ బిల్లును సభలో ప్రవేశపెట్టగలమని 207 అధికరణ పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సాల్వే చేసిన వాదనను మెహతా సమర్ధించారని సింఘ్వి చెప్పారు.
రాష్ట్రాలకు ఆ హక్కులు లేవు : కేంద్రం
అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ చర్యలను ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయలేవని కేంద్రం గురువారం సుప్రీంకోర్టులో పేర్కొంది. కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, అలా రిట్ పిటిషన్లు దాఖలు చేయడం ప్రాధమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. ఇలా ప్రాధమిక హక్కులు ఉల్లంఘించినందుకు రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద రాష్ట్రాలు రిట్ పిటిషన్లు దాఖలు చేయవచ్చా లేదా అని సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తెలుసుకోవాలనుకున్నారని అన్నారు. అలాగే రాజ్యాంగంలోని 361వ అధికరణ పరిధిపై కూడా సుప్రీం అభిప్రాయాన్ని రాష్ట్రపతి తెలుసుకోవా లనుకుంటున్నారని చెప్పారు. గవర్నర్ లేదా రాష్ట్రపతి కార్యాలయాల విధులు, అధికారాల నిర్వహణ లేదా వారు చేపట్టిన చర్యలపై వారు ఏ కోర్టుకు జవాబుదారీ కాదని రాజ్యాంగంలోని 361వ అధికరణ పేర్కొంటోంది.
గవర్నరు న్యాయమూర్తి కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES