మొంథా తుపాన్‌తో నిండా మునిగిన రైతన్న
నేలకొరిగిన వరిపంట, మొలకెత్తిన వడ్లు
కల్లాలుగా మారిన రహదారులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతు గుండె పలిగింది. మొంథా తుపాన్‌తో పంటలు దెబ్బతిని అన్నదాత నిండా మునిగారు. చేతికొచ్చిన ధాన్యం అమ్ముకోకుండానే వరదపాలైంది. వదరలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి అన్నదాత తల్లడిల్లిపోయారు. వడ్ల రాసుల్లోకి నీరు చేరి మొలకెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పండిన వరి ధాన్యం వర్షపు నీటిలో తడిసి నష్టపోయింది. వరిమళ్లు నేలకొరిగి చేతికి రాకుండాపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పొలాల్లో వదర నీరు చేయడంతో రైతు కలలు గల్లంతయ్యాయి. పంటలు నీటిపాలై రైతు కన్నీరుమున్నీరవుతున్నారు. కోతలకు వచ్చిన పంట దెబ్బతినడం, కోతలు పూర్తయి ఆరబోసిన పంట వరదపాలు కావడం పట్ల అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, మహబూబాబాద్, నల్లగొండ, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా ధర్మారం మార్కెట్‌లోకి వరద రావడంతో ధాన్యం తడిసి ముద్దయింది. పంట పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ధాన్యం రంగు మారి, నాణ్యత దెబ్బతింది. కొన్నిచోట్ల బస్తాలు తడిసి పాడయ్యాయి. బోధన్‌లో ఒడ్లు మొలకెత్తాయి. పెరుగుతున్న వరి ధాన్యం అనుగుణంగా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేయడం లేదు. కల్లాలు, మార్కెట్ సదుపాయంలేక రహదారుల్లోనే ధాన్యం రాసులు పోస్తున్నారు. చిన్న, చిన్న రహదారుల నుంచి జాతీయ రహదారులపై వడ్ల రాసులే దర్శనమిస్తాయి. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టే చోటు లేదు. కల్లాలకు స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పెరగని గోదాముల సామర్థ్యం
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోదాముల నిల్వ సామర్థ్యం సుమారు 24 లక్షల టన్నులు మాత్రమే. రాష్ట్రంలో వరి ఉత్పత్తి మాత్రం 148 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉంది. ఇంత ధాన్యాన్ని కొని నిల్వ చేసే సామర్థ్యం కూడా లేదు. రాష్ట్రంలో గోదాములు ఇప్పటికే నిండిపోవడంతో రైతులు తమ పంటను ఎక్కడ ఉంచాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గోదాముల సామర్థాన్ని పెంచుతామంటూ చెప్పినప్పటికీ ఆచరణ కార్యరూపందాల్చలేదు. కల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఎక్కువ గ్రామాల్లో ఆ పని పూర్తి చేయలేదు. కొన్ని చోట్ల ఊరికి దూరంగా ఉండటం, రవాణాకు ఇబ్బందులు కావడంతో అక్కడికి పోవడం లేదు. పొలాల నుంచి మార్కెట్ యార్డులకు తీసుకపోదామనుంటే, అక్కడ స్థలం కూడా ఉండటం లేదు. దీంతోపాటు ధాన్యానికి రక్షణ కూడా లేదు.
రిబ్బన్ కటింగులకే పరిమితమైన కొనుగోలు కేంద్రాలు
వ్యవసాయ శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ అవి రిబ్బన్ కటింగులకే పరిమితమవుతున్నాయి. తగిన ఏర్పాట్లు చేయకుండానే కొనుగోలు కేంద్రాలపై ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో 8342 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు 4,022 కేంద్రాలు మాత్రమే తెరిచారు. అందులో కాంటాలు పెట్టలేదు. తేమను కొలిచే పరికరాలు లేవు. టార్పాలిన్లు సరఫరా చేయలేదు. దీంతో రైతులు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చిన్నప్పటికీ సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి కాపల ఉండాల్సి వస్తుంది. రైతుల నుంచి వరి ధాన్యాన్ని సకాలంలో కొనకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. వడ్ల తేమ ఎక్కువగా ఉందన్న సాకు చూపించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాలు కొన్న తర్వాత అక్కడి నుంచి రైస్ మిల్లులకు, గోదాములకు సరఫరా అవుతాయి. ఇప్పటివరకు రైస్ మిల్లులకు అలాట్‌మెంట్ ఆదేశాలు ఇవ్వలేదని తెలిసింది.
తడిసిన ధాన్యాన్ని సర్కారు కొనాలి
వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. పంటనష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. మార్కెట్లలో అన్ని సౌకర్యాలు కల్పిం చాలి. టార్పాలిన్లు సరఫరా చేయాలి. మార్కెట్లలో అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.
-వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ కౌలు రైతు సంఘం
వారం రోజుల్లో కోతకు, అంతలోనే నేలమట్టం
రెండున్నర ఎకరాల్లో వరి పంట వేశాను. వారం రోజుల్లో కోత దశకు వచ్చేది. ఇంతలోనే తుఫాన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ పంట నేలమట్టమైంది. పంట నష్టమైం దంటూ అధికారుల వద్దకు పోతే రాసుకోరు. గ్రామానికి అధికారులు వచ్చి సర్వే చేయరు. రైతులే నష్టపోవాలి. పది గుంటల్లో బంతి, పది గుంటల్లో టమాట నారు వేశాను. అంతా నీటిపాలైంది.
మాతంగి శంకర్, రైతు తిమ్మాపూర్, కరీంనగర్
వడ్లు రాలిపోయాయి
పది ఎకరాల్లో వరి పంట వేశాను. ఆరు ఎకరాల మీదుగా వరదపోయింది. వడ్లు రాలిపోయాయి. నేల దిగబడు తుండటంతో హర్వెస్టర్లు, ట్రాక్టర్లు పోవడం కష్టంగా మారింది. ఇది కూడా రైతులకు ఖర్చుతో కూడుకున్న పని. – గుండేటి వాసుదేవ్ రైతు ఎక్లాస్‌పూర్, సైదాపూర్ మండలం



