సీపీఐ(ఎం) డిమాండ్..
నవతెలంగాణ – కంఠేశ్వర్ : తడిసిన రైతుల ధాన్యాన్ని తరుగు లేకుండా మద్దతు ధర పూర్తిగా చెల్లించే విధంగా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి అని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా అకాల వర్షాలకు సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం జిల్లాలో తడిసి మొలకలెత్తిన, వాసన వచ్చిన, రంగు మారిన ధాన్యాలను యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి తరుగు కానీ, ధర తగ్గింపు కానీ లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ఇస్తూ వడ్లను కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న వివిధ ప్రాంతాల్లో ధ్యానం పరిశీలించిన అంతరం రైతుల పరిస్థితిని వివరిస్తూ శుక్రవారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి ఏవో ద్వారా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ..ఓవైపు రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటిస్తోంది.. మరోవైపు రైతులు నెల రోజుల నుండి కొనుగోలు కొరకు ఎదురు చూసి వడ్ల కుప్పల వద్ద కాపలా ఉంటున్నారు. అయినా సకాలంలో కొనుగోలు చేసి ధాన్యం తరలించకపోవడం మూలానా ..అకాల వర్షాల వలన రైతుల ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతోంది. వర్షపు నీటి ప్రవాహంలో కొంత ధాన్యం కొట్టుకుపోయిందని, వరి ధాన్యానికి మొలకలు వచ్చి వాసన వస్తున్నదని, దాన్ని రైస్ మిల్లర్లు తరలించడానికి అనేక రకాలుగా ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. ధర తగ్గుతుందని, లేదా తరుగు పెరుగుతుందని, ఎండపెట్టి రంగు మారకుండా చేయాలని రైస్ మిల్లర్లు అనటంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అధికారులు యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యం మొత్తాన్ని తూకం వేసి మద్దతు ధరతో ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతులు తమ కష్టం అప్పులు లేకుండా బయటపడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. లేకపోతే రైతులు అప్పుల బారిన పడి ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యకర్తలు కటారి రాములు, శంషుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
తడిసిన రైతుల ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES