– 201పరుగులకే కుప్పకూలిన భారత్
– దక్షిణాఫ్రికాకు 314పరుగుల ఆధిక్యత
గౌహతి: గువాహటి టెస్టు ఆశలూ సన్నగిల్లుతున్నాయి. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే కుప్పకూలడమే ఇందుకు ప్రధాన కారణం. క్రీజులో నిలవాల్సిన టాపార్డర్, మిడిలార్డర్ చెత్త ఆటతో పెవీలియన్‌కు చేరగా.. లోయర్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్ (48), కుల్దీప్ యాదవ్(19) అద్భుతంగా పోరాడారు. ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఓవర్‌నైట్ స్కోర్ 9పరుగులతో సోమవారం మూడో రోజు ఆటను కొనసాగించిన భారతజట్టును దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్(6/48) నడి విరగ్గొట్టాడు. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఒకదశలో వికెట్ నష్టానికి 95 పరుగులతో మెరుగైన స్థితిలో ఉన్న భారత్.. ఆ తర్వాత 122/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15) విఫలమయ్యారు. ధ్రువ్ జురెల్ (0), రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఘోరంగా నిరాశపర్చారు. కేవలం 27 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి పలు విమర్శలను ఎదుర్కొంది. దీంతో దక్షిణాఫ్రికా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడించాల్సిన ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతామని తెలిపాడు. దీంతో దక్షిణాఫ్రికా సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌కి తోడు హర్మర్‌కు మూడు, కేశవ్ మహరాజ్ ఒక వికెట్ తీశారు.
చరిత్ర సృష్టించిన యాన్సెన్..
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్ ఈ ఘనత సాధించాడు. దీంతో భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్ జురెల్(0), కెప్టెన్ రిషభ్ పంత్(7), రవీంద్ర జడేజా(6), నితీశ్ కుమార్ రెడ్డి(10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (19), జస్‌ప్రీత్ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు యాన్సెన్. ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్‌లో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్ చేరాడు.
స్కోర్‌బోర్డు…
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 489పరుగులు
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి)యాన్సెన్ (బి)హార్మర్ 58, రాహుల్ (సి)మార్‌క్రమ్ (బి)మహరాజ్ 22, సాయి సుదర్శన్ (సి)రికెల్టన్ (బి)హార్మర్ 15, ధృవ్ జురెల్ (సి)మహారాజ్ (బి)జాన్సెన్ 0, పంత్ (సి)వెర్రెయనె (బి)యాన్సెన్ 7, జడేజా (సి)మార్‌క్రమ్ (బి)యాన్సెన్ 6, నితీశ్ రెడ్డి (సి)మార్‌క్రమ్ (బి)యాన్సెన్ 10, సుందర్ (సి)మార్‌క్రమ్ (బి)హార్మర్ 48, కుల్దీప్ (సి)మార్‌క్రమ్ (బి)యాన్సెన్ 19, బుమ్రా (సి)వెర్రెయనె (బి)యాన్సెన్ 5, సిరాజ్ (నాటౌట్) 2, అదనం 9. (83.5ఓవర్లలో ఆలౌట్) 201 పరుగులు.
వికెట్ల పతనం: 1/65, 2/95, 3/96, 4/102, 5/105, 6/119, 7/122, 8/194, 9/194, 10/201
బౌలింగ్: యాన్సెన్ 19.5-5-48-6, ముల్డర్ 10-5-14-0, మహరాజ్ 15-1-39-1, హార్మర్ 27-6-64-3, మార్‌క్రమ్ 10-1-26-0, ముత్తుసామి 2-0-2-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (బ్యాటింగ్) 13, మార్‌క్రమ్ (బ్యాటింగ్) 12, అదనం 1. (8ఓవర్లలో) 26 పరుగులు.
బౌలింగ్: బుమ్రా 3-0-13-0, సిరాజ్ 3-1-8-0, జడేజా 1-0-2-0, కుల్దీప్ 1-0-2-0.
పట్టు చేజారుతోంది..
- Advertisement -
- Advertisement -



