కమ్యూనిస్టుల రాజకీయ చరిత్రపై పుస్తకావిష్కరణ
కొల్‌కతా : రాజకీయ కార్యకర్త, రచయిత సైరా షా హలీం పుస్తక ప్రియులకు… ముఖ్యంగా వామపక్ష పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరులు, మద్దతుదారులకు ఓ శుభవార్త అందించారు. ఆయన రచించిన ‘కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్ : ది బ్యాటిల్ ఆఫ్ ది లెఫ్ట్ టు విన్ ది ఇండియన్ మైండ్’ పుస్తకాన్ని ఇటీవల న్యూఢిల్లీ, కొల్‌కతాలో ఆవిష్కరించారు. దీన్ని పెంగ్విన్ రాన్‌డమ్ హౌస్ ప్రచురించింది. రెండు నగరాల్లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు పలువురు విద్యావేత్తలు, మేధావులు హాజరయ్యారు. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో పుస్తకావిష్కరణ సభ జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ, ఆయన సతీమణి సల్మా అన్సారీ, సీపీఐ (ఎం) నాయకురాలు బృందా కరత్, రచయిత తండ్రి లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా (రిటైర్డ్) గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారతదేశంలో వామపక్ష రాజకీయాల చారిత్రక పాత్ర, వాటి సమకాలీన ఔచిత్యాన్ని గురించి చర్చ జరిగింది. ఎన్నికల కమిషన్ మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ, మాజీ ఎంపీ సుభాషిణి అలీ, రచయిత, అనువాదకులు రక్షంద జలీల్, సుప్రీంకోర్టు న్యాయవాది సంజరు హెగ్డే చర్చలో పాల్గొనగా సీనియర్ పాత్రికేయుడు పరంజరు గుహ ఠాకుర్తా మోడరేటర్‌గా వ్యవహరించారు. భారత స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి 21వ శతాబ్దం వరకూ వామపక్ష రాజకీయాల చరిత్రను ఈ పుస్తకం వివరించింది. దీన్ని రాజకీయ వాదులు, విద్యావేత్తలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తల సమక్షంలో మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ విడుదల చేశారు. కాగా కొల్‌కతాలోని ది లలిత్ గ్రేట్ ఈస్టర్న్ హోటల్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.