Tuesday, February 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫిక్స్‌డ్‌ వేతనం కోసం గొంతెత్తిన ఆశాలు

ఫిక్స్‌డ్‌ వేతనం కోసం గొంతెత్తిన ఆశాలు

- Advertisement -

ఉద్రిక్తంగా చలో హైదరాబాద్‌
పోలీసుల ఆంక్షలు ఛేదించి ముందుకు
తీవ్ర నిర్బంధాల మధ్య కోఠి హెల్త్‌ కమిషనర్‌ ఆఫీస్‌ ముట్టడికి యత్నం
అడుగడుగునా అరెస్టులు.. సొమ్మసిల్లి పడిపోయిన ఆశాలు
సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం : తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి

నవతెలంగాణ-సిటీబ్యూరో
ఫిక్స్‌డ్‌ వేతనం సహా పలు డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు గొంతెత్తి నినదించారు. పెండింగ్‌ పారితోషికాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన ‘చలో హైదరాబాద్‌’ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సోమవారం ఆశా వర్కర్లు చేపట్టిన ఈ ఆందోళనపై ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ, వేలాది మంది ఆశా వర్కర్లు హైదరాబాద్‌ కోఠిలోని వైద్య విధాన పరిషత్‌ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కమిషనర్‌ ఆఫీస్‌ వద్ద వేలాది మంది ఆశాలు బైటాయించి ధర్నా నిర్వహించారు. పెండింగ్‌ పారితోషికాలు వెంటనే చెల్లించాలని, రూ. 18వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆశా వర్కర్ల కోసం సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను భారీగా మోహరించింది. కోఠికి చేరుకున్న ఆశా వర్కర్లను వెతికి మరీ అరెస్టు చేశారు.

తోపులాట.. సొమ్మసిల్లిన ఆశాలు
పోలీసుల వలయాలను ఛేదించుకుని, కోఠి ఆంధ్రాబ్యాంక్‌ గల్లీలోని మెట్రో పిల్లర్‌ 1204 వద్దకు చేరుకున్న ఆశా వర్కర్లు అక్కడి నుంచి ర్యాలీగా ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆఫీస్‌ గేటు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మహిళలనీ చూడకుండా పోలీసులు ఈడ్చి పడేశారని, ఈ ఘటనలో పలువురు నాయకులతో పాటు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయని, బట్టలు చినిగిపోయాయని యూనియన్‌ నేతలు తెలిపారు. పలువురు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

డిమాండ్లు పరిష్కరించాలి : నేతలు
సమస్యలు వినడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం, ఇది ‘ప్రజా పాలన’ అని ఎలా చెప్పుకుంటుందని ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి ప్రశ్నించారు. ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. తమ న్యాయమైన సమస్యలు విన్నవించుకోవడానికి వస్తే అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 ఏండ్లుగా పేదలకు వైద్య సేవలందిస్తున్నారని, వీరిలో అత్యధికులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలైన వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వంటివి నేటికీ అమలు కాలేదన్నారు. ఆశాల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు.

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తగిన నిధులు కేటాయించి, రూ. 18వేల ఫిక్స్‌డ్‌ వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నీలాదేవీ మాట్లాడుతూ.. పీఆర్సీ ఏరియర్స్‌, లెప్రసీ, పల్స్‌ పోలియో, ఎలక్షన్‌ డ్యూటీలకు సంబంధించిన డబ్బులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల ఆశా వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ ధర్నాలో తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కోశాధికారి పి. గంగమణి, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా అధ్యక్షురాలు మీనా, సీఐటీయూ మేడ్చల్‌ జిల్లా నాయకులు రాజశేఖర్‌, ఆశా యూనియన్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ యాదమ్మ, పద్మ, శ్రీలత, సునీత, కొండా లక్ష్మి, రేవతి, శోభ, స్వరూప, లత, సుజాత, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -