గాజులరామారంలో కూల్చివేతలపై బతుకమ్మ పాటతో బాధిత మహిళల నిరసన
పోలీసు బందోబస్తు మధ్య భారీగా ఇండ్లు నేలమట్టం
గుండెలవిసేలా రోదించిన బాధితులు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్న వేళ కుత్బుల్లా పూర్ నియోజకవర్గం గాజులరామారంలోని నిరుపేదల బతుకుల్లో అమావాస్య చీకటిని మిగిల్చింది. కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారం గ్రామ పరిధి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ఆదివారం కొరడా ఝలిపించారు. వేకువజాము నుండే పోలీసు బలగాల మధ్య వందకు పైగా ఇండ్లను, కొన్ని బేస్మెంట్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో ప్రభుత్వం హైడ్రా రూపంలో ఇండ్ల కూల్చివేతలను రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చిందని బాధిత కుటుంబాలు నిప్పులు చెరిగాయి. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం పరిధిలోని సర్వే నెంబరు 307లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన 317 ఎకరాల భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిని కొన్నేండ్లుగా కొంతమంది భూ భకాసురులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడి ఎటువంటి అనుమతులు లేకుండా 60 చదరపు గజాల ప్లాట్లుగా విభజించి లే అవుట్లు చేశారు. ఎందరో నిరుపేదలకు అమ్మి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. కాగా, పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకొని సంతోషంగా ఉంటున్న తరుణంలో హైడ్రా (హైడ్రోజన్) బాంబులా విరుచుకుపడిందని పలువురు బాధితులు గుండెలవిసేలా రోధిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై శాపనార్ధాలు పెట్టారు.
హైడ్రా పై రాళ్లతో దాడి..
గాజులరామారం సర్వే నెంబర్ 307లో కూల్చివేతలు చేయాల్సిన ఆర్డర్ హైడ్రా అధికారులకు ఉండగా సర్వే నెంబర్ 342లో ఉన్న ఇండ్లను అనఫిషియల్‌గా కూల్చుతున్నారని బాధితులు వాపోయారు. తమకు తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఉన్నా లెక్కచేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహించి హైడ్రా, రెవెన్యూ అధికారులపై, పోలీసులపై బాధితులు రాళ్ళు విసిరారు. ఇందులో నలుగురు అధికారులు గాయపడ్డారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక బీఆర్‌ఎస్ నేత ఎస్.కే అబీద్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మా గూడు కూలింది ఉయ్యాలో..
ఇదిలా ఉండగా ఎంతో సంబరంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాల్సిన సమయంలో హైడ్రా కూల్చివేతలను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ గాజులరామారం, బాలయ్య బస్తీలో మహిళలు ఇంటి సామగ్రిని బయటపెట్టి బతుకమ్మ వేస్తూ నిరసన తెలిపారు. ‘హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మా కొంపలు కూలినై ఉయ్యాలో.. ఎవరికి చెప్పుకుందాము ఉయ్యాలో.. ఎక్కడున్నా రు పాలకులు ఉయ్యాలో.. మీకు మా గతి పట్టాలి ఉయ్యాలో..’ అంటూ చప్పట్లతో ఆడాల్సిన ఆటలు తలలు కొట్టుకుంటూ కన్నీటితో బాధిత మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వంపై, హైడ్రాపై ఉన్న కోపంతో నిరసన చేశారు.
బాధితులకు న్యాయం చేస్తాం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం
ఇది బీఆర్‌ఎస్ పాలకుల, కబ్జాదారుల పాపం కారణంగానే పేద ప్రజలు రోడ్డున పడ్డారని, బాధితుల ఉసురు వారికి తుగులుతుందని కూన శ్రీశైలం విమర్శించారు. బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు తాను అండగా ఉంటానని మీడియాతో తెలిపారు.