Wednesday, October 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆదర్శ కమ్యూనిస్టు… యేసోబ్‌

ఆదర్శ కమ్యూనిస్టు… యేసోబ్‌

- Advertisement -

ఆదర్శ కమ్యూనిస్టు ఇట్టిమల్ల యేసోబ్‌. పువ్వుపుట్టగానే పరిమళించినట్లు చిన్నతనంలోనే వామపక్ష భావాలకు ఆకర్షితుడయ్యాడు. సమాజంలో ఉన్న పేదల కష్టాలు చూసి చలించి ఎర్రజెండా పట్టాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐని నిర్మించి ‘చదువుతూ పోరాడు’ నినాదంతో విద్యార్థుల సమస్యలపై పోరుబాటలో నడిచాడు. బికామ్‌ పూర్తి చేసి, వచ్చిన ఉద్యోగ అవకాశాలు కూడా వదులుకున్నాడు. కమ్యూనిస్టు ఉద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా చేరాడు. గ్రామంలో ఉన్న యువకులతో కలిసి ఆ రోజుల్లో ఉన్న నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, కరువు, కుల వివక్షత, కూలీ దోపిడీ, భూస్వాముల ఆగడాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ఎంతగానో కృషిచేశాడు. అంతయ్య డైరక్షన్‌లో యువజన సంఘం పెట్టి ‘ముందడుగు’ నాటకం వేశాడు. ఆ నాటకంలో యేసోబ్‌ కొండలు పాత్రతో నటించి చుట్టూరా గ్రామాల్లో ప్రజలను కూడగట్టడంతో పాటు యువతీ, యువకులను విద్యార్థి, యువజన సంఘాల్లో చేర్పించాడు.

తన స్వగ్రామం చివ్వెంలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యేసోబ్‌ వార్డ్‌ మెంబర్‌గా పోటి చేసి రెండు ఓట్లతో ఓడిపోగా, 1983లో పుచ్చలపల్లి సుందరయ్య స్వయంగా సూర్యాపేటకు వచ్చి సీపీఐ(ఎం) తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి ఎదిగాడు. ఆ సందర్భంగా 40 సైకిళ్లతో 60 మంది యువకులు డప్పులు సంకన వేసుకొని నియోజకవర్గంలో ఉన్న 73 గ్రామాలకు వెళ్లి పాటలు పాడుకుంటూ ప్రజల వద్దనే తింటూ ఊరూరా ప్రచారం చేశారు. ఇప్పుడున్న రోడ్డుమార్గం, రవాణా సౌకర్యం అనాడు లేవు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం సరిగ్గా చేయలేని పరిస్థితి ఒక కారణమైతే, రెండవ కారణం ఎన్టీఆర్‌ పెట్టిన తెలుగుదేశం గాలి మరో కారణంతో కేవలం మూడు వేల ఓట్లతో ఓడిపోయాడు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మండల వ్యవస్థలో తొలి చివ్వెంల మండల పరిషత్‌ అధ్యక్షుడుగా జనరల్‌ స్థానంలో ఒక అగ్ర కులస్తునిపై గెలిచి ప్రభంజనం సృష్టించాడు. తన హోదాతో గిరిజన తండాల్లో రహదారులను నిర్మించి, దళిత, గిరిజనులకు క్రాంతి పథకం ద్వారా వ్యవసాయబావులు తవ్వించి మండల పరిధిలోని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించారు.గిరిజన ప్రాంతాల్లో బడులు కట్టించి, విద్యుత్‌ సరఫరా చేయించాడు. చివ్వెంల మండల కేంద్రంలో సివిల్‌ సప్లయ్ గిడ్డంగులు మంజూరు చేయించి 40 మంది దళితులకు హమాలీ కార్డులిప్పించి ఉపాధి కల్పించడంలో యేసోబ్‌ పాత్ర మరువలేనిది. అనాటి నుంచి నేటివరకు ఆ హమాలీలు సీఐటీయూలో కొనసాగుతున్నారు.

చందుపట్ల గ్రామంలో ఓపిడీఆర్‌ పార్టీ నాయకులు అరాచకాలు, దాడులు చేస్తూ సీపీఐ(ఎం) క్యాడర్‌ను ఊర్లో లేకుండా చేయాలనే పథకం వేశారు. పార్టీ నాయకుడు కలగాని సోమయ్యపై భౌతికదాడులకు దిగారు. వ్యవసాయాలు చేసుకోలేని పరిస్థితి. ఒకదశలో సోమయ్యను చంపుతామని హెచ్చరించారు కూడా. ఈ సందర్భంగా యేసోబ్‌ రాష్ట్ర పార్టీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి సోమయ్యకు నకిరేకల్‌లో షెల్టర్‌ ఇప్పించాడు. ఆ సందర్భంగా తాలూక పార్టీ డైరెక్షన్‌లో ఓపిడీఆర్‌ కార్యకర్తలు ఏ గ్రామం వచ్చినా సీపీఐ(ఎం)కార్యకర్తలు తరిమికొట్టారు. తట్టుకోలేక వారి నాయకత్వం అప్పటి జిల్లా ఎస్పీ జయచంద్రకి ఫిర్యాదు చేయగా, నకిరేకల్‌ ఎమ్మెల్యేగా ఉన్న నర్రా రాఘవరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని ఎస్పీనే తీసుకుపోయారు. ఉన్న పరిస్థితిని వివరించి చందుపట్ల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో రెండు పార్టీల జనంతో సభ పెట్టించారు. వేదిక మీదకు సోమయ్యని పిలిచి ‘ఇప్పటి నుండి సోమయ్యకు ఎలాంటి హాని తలపెట్టబోమని’ ఓపిడీఆర్‌ కార్యకర్తలతో చెప్పించి శాంతి కమిటీ వేశారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలివ్వాలని తహసీల్దార్‌ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో యేసోబ్‌పై పోలీసులు కక్షకట్టి తీవ్రంగా కొట్టి అరెస్టు చేశారు. అయినా ఏ రోజూ ఆదరలేదు, బెదరలేదు, ఎర్రజెండాను వదల్లేదు. ఆ రోజుల్లో సైకిల్‌ మీద ఊరూరా తిరుగుతూ పార్టీ కార్యక్రమాన్ని ఇస్తూ ప్రతీ గ్రామంలో ఉద్యమాన్ని విస్తరించాడు. ఈక్రమంలోనే యేసోబ్‌ ప్రభావం మా గ్రామంతో పాటు నామీద కూడా పడింది. 1992లో జరిగిన నా వివాహం యేసోబ్‌ అధ్యక్షతన జరిగింది.ఉప్పల మల్సుర్‌, కోక ఎల్లయ్య, ఇట్టిమల్ల యేసోబ్‌ తర్వాత నేను1999లో సీపీఐ(ఎం) నుండి సూర్యాపేట ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 2006 నుండి 2011 వరకు సూర్యాపేట తాలూక కార్యదర్శి ఉన్నప్పుడు యేసోబ్‌ డివిజన్‌ కమిటీ సభ్యునిగా ఉండి ఆనాడు జరిగిన ప్రతీపోరాటంలో మాకు అండగా నిలిచాడు.అనారోగ్య సమస్యలతో పార్టీ బాధ్యతల నుండి రిలీవ్‌ అయినా, వీలైనంత వరకు పార్టీ కార్యక్రమంలోనే కొనసాగాడు. తన 76వ యేటా ఈనెల 6న చనిపోయాడు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరిశ్వాస వరకు నిలబడ్డ యేసోబ్‌ నిజంగా నేటి యువతరానికి ఆదర్శం.

నెమ్మాది వెంకటేశ్వర్లు
(నేడు చివ్వెంలలో యేసోబ్‌ సంతాపసభ)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -