సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలి
లేదంటే ఉద్యమం ఉధృతం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అధికార అహంతో ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-మధిర
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రోద్భలంతో మధిర, బోనకల్, చింతకాని మండలాల్లో పోలీసులు సీపీఐ(ఎం) కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, భయభ్రాంతులకు గురి చేయాలని చూడటం సరైనది కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కొంతకాలంగా జరుగుతున్న సీపీఐ(ఎం) నాయకుల హత్యలు, పార్టీ నాయకులు, వారి ఇండ్లపై దాడులు, అక్రమ కేసులు, బెదిరింపులను నిరసిస్తూ పార్టీ డివిజన్ కమిటీ శనివారం మధిర పట్టణంలో నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. దాంతో నిరసన ప్రదర్శనకు నాయకులు రావొద్దని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అరెస్టులకు పాల్పడ్డారు. అయినప్పటికీ అరెస్టులను ఖండిస్తూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదని అన్నారు. నిందితులు ఎవరో పోలీసులకు తెలిసినా.. తెలియనట్టు నటిస్తున్నారని విమర్శించారు. సామినేని కుటుంబ సభ్యులను, సీపీఐ(ఎం) కార్యకర్తలను పోలీసులు వేధించటం ఏమిటని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన భార్య మల్లు నందిని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు చేయించడం సరికాదన్నారు.
తీవ్రంగా గాయపడిన సీపీఐ(ఎం) కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారిపైనే హత్యాయత్నం కేసులు మోపి సెంట్రల్ జైలుకు తరలించారన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దర్జాగా గ్రామాల్లో తిరుగుతున్నారని, వారికి డిప్యూటీ సీఎం అండదండలతోపాటు పోలీసులు సహాయసహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి కేసులకు భయపడి కమ్యూనిస్టులు చేతులు కట్టుకొని కూర్చోరని, వారికి సరైన సమాధానం పోరాటాల ద్వారా చెప్తామని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో పెరుగుతున్న హింసకు, అక్రమ కేసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన పేరుతో పోలీసు రాజ్యం నడపాలని ప్రయత్నం చేసిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు.
తప్పుల భయంతో ఆందోళనలో డిప్యూటీ సీఎం : నున్నా నాగేశ్వరరావు
భట్టి విక్రమార్క చేసిన తప్పుల పట్ల తీవ్రమైన భయంతో ఆందోళనతో ఉన్నారేమోనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సీపీఐ(ఎం) శాంతియుత ప్రదర్శనకు పిలుపునిస్తే ఖమ్మం నుంచి ఎర్రుపాలెం వరకు గ్రామ గ్రామాల్లో సీపీఐ(ఎం) కార్యకర్తలను, సాధారణ ప్రజలను ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసుల సహాయంతో అడ్డుకోవాలని ప్రయత్నించడం ప్రజా పరిపాలనలో భాగమేనా అని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే ప్రజలను అడ్డుకోవడం భారత రాజ్యాంగంలో భట్టి విక్రమార్క కోసం ప్రత్యేకమైన సెక్షన్లు ఉన్నాయా.. లేదా మధిర నియోజక వర్గంలో డిప్యూటీ సీఎం కోసం పోలీసులు ఏమైనా కొత్త చట్టం, రాజ్యాంగాన్ని సృష్టించారా.. అని ప్రశ్నించారు.
ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా వాటన్నింటిని చేధించుకుంటూ వేలాదిమంది ప్రజలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటేనే ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. అక్రమంగా బనాయించిన కేసుల నుంచి సీపీఐ(ఎం) కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి పద్మ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, మధిర మండల కార్యదర్శి మందా సైదులు, ముదిగొండ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, పట్టణ కార్యదర్శి పడకండి మురళి, డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య, బండారు రమేష్, పయ్యావుల ప్రభావతి, మందడపు ఉపేంద్ర రావు, పార్టీ సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అధికార అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు : పోతినేని
అధికార అహంతో ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, ప్రజాస్వామ్యాన్ని మాత్రమే ప్రజలు స్వీకరిస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. నాటి నైజాం నవాబుల పరిపాలనను వ్యతిరేకిస్తూ సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటానికి పుట్టినిల్లు మధిర అని తెలిపారు. పోలీసులను చేతుల్లో ఉంచుకుని చేయని తప్పులకు సీపీఐ(ఎం) నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజా సేవకులను మరిచి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, అవినీతి సొమ్ము కోసమో, అధికార పార్టీ నాయకుల మెప్పు కోసమో మీ మనస్సాక్షిని తాకట్టు పెట్టొద్దని సూచించారు. మల్లు భట్టి విక్రమార్క, పోలీసుల నిరంకుశ వైఖరి మారకుంటే రానున్న కాలంలో క్యాంప్ ఆఫీస్‌తోపాటు పోలీస్ స్టేషన్ ముట్టడికి కూడా ప్రజలు సిద్ధమవుతారని హెచ్చరించారు.



