పూర్వం
ఏయే ఊహలు నాలోంచి ఎప్పుడెప్పుడు
ఎక్కడెక్కడ జారిపోయాయో
ఏ ఏకాంతపు విశ్రాంత ఘడియల్లోనో
ఏ సందడుల కల్మిడి వేళలలోనో
సన్నని జలలాగో మెరుపు వెలుగులాగో
నాలో జనించిన ఊహలు
ఏ ఏమరుపు వేళల్లో ఏ దారి చేసుకుని సడి చేయక
ఎలా జారిపోయాయి
లోన తిరుగుతూ తిరుగుతూ
కొన్ని వేళల్లో అలా బయటికి వెళ్ళి నా చుట్టే తిరిగేవి
మళ్ళీ నా లోపలి తీరాలకు తిరిగిరాక
ఏ దూర తీరాలకు ఎట్లా వెళ్ళివుంటాయి
లేదూ- అవి తిరుగుతూండగా నేనే దూరం వచ్చేసానా
నేను అగుపడక దిగులుతో వగచి అవి
కొమ్మల్ని కోల్పోయిన ఆకుల్లా
అక్కడే పడిపోయాయా లేవక !
లేక లేచి పక్షుల్లా ఎటో తరలి వెళ్లిపోయాయా
ఎటో వెళ్లిపోవడం కాక నా దారులను వెతుక్కుంటూ
ఇటు వేపే వస్తున్నాయా
ఏ నదీ తీరాలలోనో ఏ అడవి నీడలలోనో
ఏ పొలాల చాళ్లలోనో ఏ పూల కళ్లలోనో
నా కోసం వెతుకుతున్నాయా
కాక –
కొన్ని ఇప్పటికే ఏ రహస్యపు వేళలోనో నన్ను చేరాయా
చేరినా అవి నా పూర్వపువే అని నేనే గుర్తు పట్టలేదా
కొత్తకొత్తవి అని మురిసి పదాల మాలల్లో కూర్చానా
కూర్చింది ఏ అల్లికలో ఎప్పుడు ?
విప్పి చూడగాలనా ఇప్పుడు?
ఇదేమిటి, ఇప్పుడే చటుక్కున ఓ కొత్త వూహ నాలో
పుట్టినట్లుంది
సంతోషమే, లోపలి చెలిమె ఎండిపోలేదని!
కానీ ఇది కొత్తది కాక
పూర్వపుదే నాదే ఒకటి వెతుక్కుంటూ వచ్చి నా లోకి
చేరిందా
ఈ సందేహపు లోయలోకి నేను – ఇట్లాగే జారిపోతే
ఇప్పటి ఈ లోపలి ఊహ
ఉక్కిరిబిక్కిరై నాలోంచి ఎగిరి వెళ్లిపోతుందేమో
లేక ఇప్పటికే వెళ్లిపోయిందా పూర్వమై!
అయినా
ఊహలతో ఇన్నిన్ని ఆపసోపాలూ ఆలోచనలూ
ఇన్ని వెతుకులాటలూ ఇన్ని సందేహాలెందుకని
వదిలేద్దామా అంటే
ఊహలే లేకుండా నేను ఊపిరి పీల్చేదెలా ?
– దర్భశయనం శ్రీనివాసాచార్య, 94404 19039
ఊహలెటు వెళ్ళిపోయాయి
- Advertisement -
- Advertisement -


