రెండో దశలో 50 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 లీగ్ దశ షెడ్యూల్ వచ్చేసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్19 షెడ్యూల్‌ను తొలుత 20 మ్యాచ్‌లకే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ తేదీలపై స్పష్టత రావటంతో లీగ్ దశలో మరో 50 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను సైతం నిర్వాహకులు విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 12 వరకు తొలి దశ షెడ్యూల్‌లో 20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో మూడు రోజులు డబుల్ హెడర్స్ ఉన్నాయి.
రెండో దశలో ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 50 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఎనిమిది రోజులు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వేదికలను బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై క్వాలిఫయర్ 2, ఫైనల్ జరిగే అవకాశం ఉండగా.. రన్నరప్ పంజాబ్ కింగ్స్ సొంత మైదానంలో ఎలిమినేటర్, క్వాలిఫయర్ 1 పోరు ఉంటాయి. ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడించాల్సి ఉండగా, టైటిల్ పోరు మే 31న జరుగనుంది.
రెండో దశ షెడ్యూల్‌లో తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఇక రెండో దశ షెడ్యూల్‌తో వేదికల సంఖ్య 12కు పెరిగింది. ధర్మశాల, రారుపూర్‌లోనూ మ్యాచ్‌లు జరుగుతాయి. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుండగా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా మ్యాచ్ రద్దుగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ధర్మశాలలో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరుగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో సొంత మైదానంగా రారుపూర్‌ను ఎంచుకుంది. ఇక్కడ ఆ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. రాజస్తాన్ రాయల్స్ రెండో సొంత మైదానంగా గువహటిని ఎంచుకోగా.. పంజాబ్ కింగ్స్ ముల్లాన్‌పూర్, ధర్మశాలను సొంత మైదానాలుగా కొనసాగిస్తోంది.



