నిన్నటి దాకా నా హాజరుకి
సాక్షాధారంగా నిలిచిన సంతకమే ఇది..
నేడు..బడితల్లిని వీడలేక
తడబడుతున్న కలంతో ఉద్విగ్నంగా
చేస్తున్న చివరి సిగ్నేచర్.
మూడున్నర దశాబ్దాల తొవ్వ
చూస్తుండగానే చివరి ప్రస్థానానికి చేరింది
ఎక్కడెక్కడి తరగతి గదులో..
ఎన్నెన్ని నల్లబళ్ళలో ఎందరు పేదపిల్లలో
కళ్ళల్లోకి వచ్చి కన్నీళ్లవుతున్నారు.
ఈ అనుబంధాన్ని తెంచుకొని వెళ్లాలంటే
గుండె బరువెక్కుతోంది.
ఆరోదిలున్న హాస్టల్ చిన్నోడు
అదే.. అమ్మలేదని కంటతడి పెట్టిన కార్తీక్
అర్థం కాని నిశ్శబ్దం లోకి..!
నెల ముందు నుంచే కన్నీళ్లతో స్పందన
మౌనంగా నా చేతిని పట్టుకొని
‘ఉండి పోండి మేడం’ అంటూ..
యయిత్ క్లాస్ లాస్య
పెదవులపై వణుకుతున్న ప్రశ్న —
‘మేడమ్… మళ్లీ వస్తారా?’
వినబడనట్టే నటించా..
కొంటెపిల్ల భావన చూపుల్లో కృతజ్ఞతా వెలుగు,
పదోదిలున్న దినకర్
దిగులు ముఖంతో చిన్నబోయిండు.
కాబోయే కవి విశాల్ వీడ్కోలంటూ
ఆర్ద్ర కవితని ఆలపించిండు..!
చిన్ని చిత్రకారుడు చందూ అయితే విగ్నేషుడిని దించి
బహుమతిగా తెచ్చిండు
ఇంతటి ప్రేమని ఒదిలి ఇంటిముఖం ఎట్లా పట్టాలో..
అంతు పట్టకున్నది.
‘ఆనివార్యమైన వాటి గురించి చింతించడం తగదంటూ’
గుడి గోపురం నుంచి లీలగా నాకు ఉపశమనంగా
నిజమే, ఇది విరమణ కాదు విశ్రాంతే!
- నాంపల్లి సుజాత అన్నవరం



