ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌లో అధికార మార్పిడి కోరుకుంటున్నాడు. ఆ విషయం కొత్తది కాదు. గత నలభైయేళ్లుగా చెపుతూనే ఉన్నాడు. గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లా, ఇప్పుడు ఇరాన్ తనను సవాలు చేసే శక్తులన్నింటినీ తుడిచిపెట్టి, ప్రాంతీయంగా తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని ఆయన కోరిక! తన లక్ష్య సాధనకు సహకరించే మిత్రుడి కోసం నెతన్యాహు ఎదురు చూశాడు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయినప్పటి నుండి నెతన్యాహు వాషింగ్టన్‌కు మాటిమాటికీ చక్కర్లు కొట్టాడు. అన్ని సార్లు తిరగడమన్నది-ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రేరేపించడానికేనని, ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది. నెతన్యాహు వలలో పడ్డ ట్రంప్‌కు మాటపై నిలబడే లక్షణం లేదు.
ఆయన పిచ్చిప్రేలాపనలకు అంతేఉండదు. టెహ్రాన్ నుండి రాబోయే అణుముప్పును శాశ్వతంగా నిర్మూలించి, ప్రపంచాన్ని కాపాడుతానంటాడు ఒకసారి. ఇరాన్‌లో అధికార మార్పిడి జరగాలంటాడు మరోసారి. అసలైతే, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్న దాఖలాలు లేవని అంతర్జాతీయ ఆణుసంస్థ డైరెక్టర్ జనరల్ రఫాయెల్ మరియానో వెల్లడించారు. అంటే, ట్రంప్ మాటల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక ఇరాన్ అధికార మార్పిడి గురించి ఆ దేశ ప్రజలు చూసుకుంటారు. అది వారి అంతర్గత విషయం. అమెరికాలో తక్షణం అధికార మార్పిడి జరగాలని ఏ దేశాధినేత అయినా కోరుకుంటే, అందుకు ట్రంప్ సమ్మతిస్తాడా? ఇదీ అంతే!! బయటి వాడు బయటివాడి లాగానే ఉండాలి!
ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికాలు కలిసి చేస్తున్న యుద్ధానికి ఆ రెండు దేశాల ప్రజల్లోనే అత్యధికుల ఆమోదం లేదు. అమెరికా చట్టసభ సభ్యులే ఈ యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ యుద్ధమేమైనా ఐక్యరాజ్య సమితిని ఒప్పించి చేస్తున్నారా? లేదుకదా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా కొన్ని చట్టాలు, నిబంధనలు అమలులోకొచ్చాయి. ఇప్పుడు వీరుచేస్తున్న ఈ పిచ్చిపని వాటినన్నింటినీ ధ్వంసం చేసింది. అందుకే ప్రపంచంలోని ఏ ఒక్క దేశమూ వీరికి మద్దతు ప్రకటించడం లేదు. ట్రంప్ ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు బెదిరించినా అవన్నీ పిచ్చి ప్రేలాపనలుగా ప్రపంచ నేతలు తేలికగా తీసుకుంటున్నారు.
నెతన్యాహు, ట్రంప్ ప్రపంచం దృష్టిలో బ్యాడ్‌బోయిస్‌గా, పిచ్చివాళ్లుగా, జోకర్లుగా మిగిలిపోయారు. ఇరాన్ ఛాందసవాద పాలనను నిరసిస్తూ అక్కడి జైలులో మగ్గిన అభ్యుదయ కాముకులు సైతం, ఇజ్రాయిల్, అమెరికా చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ దేశంలో జరుగుతున్న విధ్యంసాన్ని చూసి వారు తట్టుకోలేక పోతున్నారు. అంతర్గతంగా వారి సమస్యలేవైనా బయటివాడు వచ్చి యుద్ధం చేయడమంటే- తమ జీవితాల్ని ధ్వంసం చేయడమంటే ఎవరూ సహించరు కదా? అయితే, ఆ ప్రాంతంలో ముస్లిం- క్రైస్తవ మతాల మధ్య వైరుధ్యాలు ఈనాటివి కావు. అట్లని యుద్ధాల వల్ల ఆ వైరుధ్యాలు సమసి పోయేవీ కావు. ఎంతటి ఉన్నతమైన, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నా -అహంకారం తలకెక్కించుకుంటే ఇక అంతే- అతిచిన్న విషయం కూడా అర్థం చేసుకోలేరు.
”అమెరికా ఛాయలో అమెరికా పేరు చెప్పుకుని బతుకీడుస్తున్న ఒక పరాన్నజీవి – ఇజ్రాయిల్! అంతర్జాతీయంగా శాంతికి భంగం కలిగిస్తున్నది ఆ దేశమే” అని అన్నాడు జోకెంట్. ఈయన అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్‌కు డైరెక్టర్. ”అలీ అర్దశీర్ లారిజానీ శాంతి ఒప్పందాన్ని తీసుకుని ముందుకొద్దా మంటే- అది ఇష్టం లేని ఇజ్రాయిల్, ఆయన్ని చంపేసింది. లారిజానీ ఇరాన్ దేశపు మామూలు అధికారి కాదు. అక్కడి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు సెక్రటరీ, గతంలో అక్కడి పార్లమెంట్ స్పీకర్, అంతేకాకుండా, ఆయన నూక్లియర్ నెగోషియేటర్. అంతటి కీలకమైన వ్యక్తి చొరవతీసుకుంటూ ఉంటే, అతణ్ణి చంపడం ఎంత మోసం?
అందువల్ల ప్రపంచ శాంతి – హంతకులెవరో తెలుస్తూనే ఉంది కదా? ఇది మొత్తం ప్రపంచాన్ని, ప్రపంచ శాంతిని నాశనం చేయకముందే మనం ఈ పరాన్న జీవిని సమూలంగా నాశనం చేయక తప్పదు”అని అన్నాడు జో కెంట్. ఇలా అదుపు తప్పి ఉన్న పరిస్థితులను చూసి, కలత చెందిన జో కెంట్ తన పదవికి రాజీనామా రాసి, దాన్ని ట్రంప్ మొహాన కొట్టి వెళ్లిపోయాడు. తన అంతరంగికుడు అలా వెళ్లిపోవడంతో ట్రంప్ బాధ పడ్డాడో లేదో తెలియదు కానీ, బయటికి మాత్రం ‘జో కెంట్ చాలా మంచి పనిచేశాడు’ అని చెప్పాడు. ఇటీవల వెలువడిన ఒక విశ్లేషణ ప్రకారం-”తన ఎప్‌స్టీన్ ఫైల్స్ స్కాండల్ నుండి ప్రపంచ ప్రజల దృష్టి మరల్చడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఇరాన్ యుద్ధాన్ని ముందుకు తెచ్చాడని అమెరికా ప్రజలలో ఎక్కువమంది భావిస్తున్నారట!
యుద్ధ నిర్ణయాన్ని ఖండిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ను ‘మూర్ఖుడు’-అని అన్నాడు ఒక అమెరికా సెనేటర్-క్రిస్ వాన్ హాలెన్. అమెరికాను యుద్ధంలోకి లాగడానికి ఇజ్రాయిల్ నేత నెతన్యాహు నలభై ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడనీ, మూర్ఖుడైన ట్రంప్ ఇప్పుడతని వలలో పడ్డాడనీ – అన్నాడు. ”యుద్ధం చేయాలన్న కోరిక ఉంటే ముందు మీ కుమారుల్ని సరిహద్దులకు పంపండి. ఏ.సి గదుల్లో కూర్చుని బీరాలు పలకడం, బేరసారాలాడడం సులభం. మీ బిడ్డలు ఫ్రంట్ లైన్లో ఉన్న రోజు, ప్రపంచం ఈ యుద్ధాన్ని మరిచిపోతుంది.” అని హెచ్చరించారు స్పానిష్ పార్లమెంట్ సభ్యురాలు ఏరీన్ మోంటెరో. స్పెయిన్ దేశపు ప్రధాని పెడ్రో సాంఛెజ్ ఏమన్నారంటే – నా వైఖరి స్పష్టంగా ఉంది. నేను ఈ ఇరాన్ యుద్ధానికి మద్దతివ్వలేను. నేను గాజా, ఇరాన్‌ల పక్షాన నిలబడ్డాను – అని! ఆ అభిప్రా యాన్ని ప్రపంచ దేశాలు అభినందించాయి. అంతేకాదు స్ఫూర్తిని పొందాయి. అందుకే అమెరికా-ఇజ్రాయిల్ పక్షాన నిలబడి, వారి అక్రమ యుద్ధానికి ఎవరూ మద్దతు తెలపడం లేదు.
హర్మూజ్ జలసంధి విషయంలో జోక్యం చేసుకుని, దాన్ని తెరిపించాలని అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను అమెరికా నావికా దళ అధికారులు లెక్కచేయలేదు. ఇది మిలటరీ తిరుగుబాటుగా మారుతుందా? లేదా అన్నది వారి అంతర్గత విషయం. అధ్యక్షుడు అంటే కమాండర్-ఇన్-చీఫ్! అలాంటి వాడి ఉత్తర్వుల్ని పట్టించుకోలేదంటే, అధ్యక్షుడికి విలువ ఉన్నట్లా లేనట్లా? అధ్యక్షుడి ఆదేశాల్ని మిలట్రీ అధికారులు కాదనడం ఎప్పుడూ జరగదు. కానీ ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధసమయంలో జరిగింది. దేశాల మధ్య ఉండే ఒప్పందాలు, న్యాయ పరమైన పరిమితుల దృష్ట్యా తాము అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలకు స్పందించడం లేదని అమెరికా నావికాదళ ఉన్నతాధికారులు చెపుతున్నారు.
ఇదేకాకుండా, మిలట్రీ వారికి భద్రతా లేకపోవడం వల్ల కూడా తాము ఆలోచనలో పడ్డామని వారంటున్నారు. పైగా తమ ఆదేశాలు అతిక్రమించి, తమ శత్రు దేశపునౌకలు ముందుకొస్తే వాటిని పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అలాంటి సమయంలో ఏ దేశపు నౌకయినా హర్మూజ్ వైపు ఎందుకు వెళుతుంది? అయినా ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగినవాడికి సాధక బాధకాలు తెలుస్తాయి. ట్రంప్ ది ఏముంది? అధికారం ఉంది కదా అని ఉత్తర్వులిస్తే సరిపోతుందా? పోయేది ఆయన ప్రాణం కాదుగదా? ”ప్రపంచ నేతలంతా కలిసి రావాలి! అందరం కలిసి, ఇరాన్‌పై ఒత్తిడి పెంచి, హర్మూజ్ జలసంధిని తెరిపిద్దాం!” అని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల అధిపతులకు ఒక పిలుపు నిచ్చాడు.
కానీ, పాపం! ఎవరూ స్పందించలేదు. దానితో ట్రంప్ వెంటనే మాటమార్చాడు – ”అమెరికాకు హర్మూజ్‌తో అసలు అవసరమే లేదు” అని తన అహంకారాన్ని మరోరకంగా వ్యక్తపరిచాడు. ప్రపంచ దేశాల మీద ఇతగాడి పెత్తనం ఏమిటో కనీసం అతనికైనా అర్ధమవుతుందో లేదో – ఇటీవలికాలంలో ప్రపంచంలోనే గొప్ప ఏడిపించే హాస్యగాడిలా నిలిచాడు ట్రంప్. ఈ విషయంమ్మీదే ఫ్రెంచ్ నాటో జనరల్ యకోవ్ లీఫ్ ఒక హెచ్చరిక చేశాడు. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఎవరైనా ట్రంప్ వెనక చేరితే వార్డు ఐస్‌బర్గ్‌ను ఢీకొట్టిన తర్వాత టైటానిక్‌కు టికెట్ కొనుక్కున్నట్లే” అని!
”మొత్తానికి మొత్తంగా ముస్లింలను, అరబ్బులను చంపాలన్నదే క్రైస్తవ దేశమైన ఇజ్రాయిల్ ధ్యేయం! ఇరాన్ తర్వాత వారు టర్కీ మీద తప్పక దృష్టి సారిస్తారు” ఈ ప్రకటన చేసింది ఎవరో మామూలు వ్యక్తి కాదు. సీ.ఐ.ఎ మాజీ ఇంటిలిజెన్స్ ఎనలిస్ట్ – లార్రీ జాన్సన్! అదికూడా సి.ఎన్.ఎన్. అంతర్జాతీయ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈయన మాటల్లో నెతన్యాహూ, ట్రంప్‌ల కుటిలనీతి స్పష్టమైంది? అలాగే అమెరికా షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన పొలిటికల్ సైంటిస్ట్: ప్రొఫెసర్ జూన్ మెర్షిమీర్ అభిప్రాయం కూడా చాలా విలువైంది. ”ప్రపంచానికి నేను చెప్పదలుచుకున్నదేమంటే – ఈ యుద్ధం మేం గెలవడం లేదు – అవగాహనా లోపంతో, సరైన ఆలోచన, సరైన పథకం లేకుండా యుద్ధానికి దిగడమే ఒక తప్పుడు నిర్ణయం! అందువల్ల, ప్రపంచంలో అమెరికా విశ్వాసాన్ని కోల్పోయింది. యుద్ధంతో కలిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు. కానీ కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ పొందేది ఎలా? అది ఎప్పటికీ ఒక మచ్చలాగా ఉండిపోతుంది.” – అని ఆయన బాధపడ్డారు.
దీనివల్ల తెలుసుకోవాల్సిన సారాంశమేమంటే- వ్యక్తులైనా, వర్గాలైనా, ప్రభుత్వాలైనా తమ అధికార దర్పంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించలేవు. అణగదొక్కడం ద్వారా శాంతి స్థాపన జరగదు. ఇతరుల హక్కుల్ని కాలరాస్తూ, మాన వీయ విలువల్ని కాపాడలేవు. మానవత్వం, మానవీయ విలువలు అనేవి ఒక వర్గానికి, ఒక దేశానికి, ఒక ప్రభుత్వానికీ మాత్రమే సంబంధించిన ఆస్తులు కావు. అవి విశ్వజనీనమైనవి. అందరికీ అందుబాటులో ఉండాల్సినవి. శాంతినికోరుకునే వారెప్పుడూ అధికారాన్ని దుర్వినియోగం చేయగూడదు. నైతికత లేని సమాజాలు, ప్రభుత్వాలు, దేశాలు ప్రపంచాన్ని నాశనం చేస్తాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం భారతీయులం చేయగలిగేది ఏమైనా ఉందా? అంటే తక్షణం అమెరికా – ఇజ్రాయిల్ వస్తువుల్ని బహిష్కరించాలి. ఇజ్రాయిల్ -అమెరికా ఉత్పత్తులు కొన్నా, హాలివుడ్ సినిమాలు చూసినా, మన డబ్బు వారికి ధారపోస్తున్నట్టే లెక్క. జరుగుతున్న అధర్మ యుద్ధంలో ఒక రకంగా మనమూ పాలుపంచుకున్నట్టే లెక్క! దేశవాసులు ఎడాపెడా షాపింగ్ చేయకుండా, ఏ ప్రొడక్ట్ ఏ దేశానిదో తెలుసుకుని కొనాలి. తమది అగ్రరాజ్యమన్న అహంకారంతో ఒక దేశం ఉగ్రరాజ్యంగా మారినప్పుడు మన మోడీ ప్రభుత్వం లాగా దానికి గులాంగిరి చేయకూడదు. ఈ దేశ ఔన్నత్యాన్ని నిలుపుకోగలిగే బాధ్యతగల పౌరుల్లాగా ధైర్యంగా, స్వతంత్రంగా నిలబడగలగాలి!
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు



