‘‘తెలుగు సాహిత్యంలో బీసీ నవల’’ ఆవిష్కరణలో జూలూరు
నవతెలంగాణ – హైదరాబాద్: బీసీల హక్కుల సాధనకై జరుగుతున్న సామాజిక ఉద్యమంలో రచనలు చేసే చారిత్రక బాధ్యతను బీసీ కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ భుజాలపై వేసుకుని ముందుకు సాగాలని తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు. బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాల హక్కుల సాధనకై సమస్త బీసీ సమాజాన్ని కదిలించేందుకు బీసీ సాహితీవేత్తలు ‘‘ఆటపాటమాట’’లతో గళాలు విప్పాలని తెలిపారు.
శుక్రవారం రవీంద్రభారతి మినీ హాల్‌లో ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు కె.పి.అశోక్‌కుమార్ రచించిన ‘‘తెలుగు సాహిత్యంలో బీసీ నవల’’ అన్న విమర్శ గ్రంథాన్ని జూలూరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేళ్ల కాలంలో 50 మంది రచయితలు రాసిన 60 బీసీ నవలలను వెలికితీసి వర్తమాన చరిత్రకు అందించిన కె.పి.అశోక్ కుమార్ కృషి బహుజన సాహిత్య ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. జనాభాలో సగ భాగమైన బీసీ సాహిత్య అస్తిత్వాన్ని తనలో నింపుకున్నప్పుడే తెలుగు సాహిత్యం పరిపూర్ణమవుతుందన్నారు. ఏ అస్తిత్వ ఉద్యమానికైనా భావజాలమే ప్రాణమని, బీసీల సామాజిక ఉద్యమానికి విరివిగా సాహిత్య సృష్టి జరగవలసి ఉందన్నారు.
ఎగిసిపడుతున్న బీసీల హక్కుల సాధన ఉద్యమానికి బీసీ సాహిత్యం ఉదృతంగా రావాల్సి ఉందన్నారు. అన్ని రకాల అభ్యుదయ, అస్తిత్వ ఉద్యమాలలో అగ్రభాగాన నిలిచిన బీసీ రచయితలు తమ మూలాల నుంచి లోతైన అధ్యయనం చేస్తూ బీసీ ఉద్యమానికి ప్రేరణగా విస్తృతంగా రచనలు చేయాలన్నారు. రాజకీయరంగంలో మాదిరిగానే సాహిత్యరంగంలో ఉన్న ఆదిపత్య వర్గాలు కింది కులాల సాహిత్యాన్ని, కళారూపాలను వెలుగులోకి రాకుండా చేస్తున్న కుట్రలను అధిగమించాల్సిన అవసరముందన్నారు. విమర్శరంగంలో ఉన్న
వాళ్లు బీసీ నవలా సాహిత్యాన్ని చర్చకు రాకుండా చేశారని, ఆ గోడలను బద్దలు కొడుతూ కె.పి.అశోక్‌కుమార్ వందేళ్ల బీసీ నవలా సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకరావటం అభినందనీయమని పేర్కొన్నారు. 1927 నుంచి 2024 వరకు వచ్చిన నవలా సాహిత్యాన్ని ఒక దగ్గరకు తీసుకరావటం గొప్ప ప్రయత్నంగా నిలుస్తుందని చెప్పారు.
ఎగిసిపడుతున్న బీసీల హక్కుల సాధనతెలంగాణ అస్తిత్వానికి ప్రాణమైన బీసీ అస్తిత్వవాదం కింది కులాలకు రావాల్సిన న్యాయమైన వాటాను కోరుతున్నదన్నారు. మెజార్జీ ప్రజలైన బీసీల అస్తిత్వమే తెలుగు సాహిత్యంలో ప్రధాన స్రవంతి అని తెలిపారు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల ద్వారా బీసీ ధృక్పథాన్ని బలంగా వినిపించే బాధ్యత సాహిత్యకారులపై ఉందన్నారు. రాజకీయ పార్టీలు అవసరాలకోసం వాగ్ధానాలు చేసి ఎప్పుడు కాడెత్తుతారో తెలియదని, ఇలాంటి సమయంలో ప్రమాద హెచ్చరికలు చేస్తూ బీసీలను సమాయత్తం చేసే పని సాహిత్యరంగమే చేయాలన్నారు.
బీసీల సామాజిక సమరాన్ని బీసీల ఆత్మగౌరవ ఉద్యమంగా మరల్చి, మహాజనావళిని ఏకం చేసే పనికి బీసీ సాహితివేత్తలే పూనుకోవాలని వివరించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉద్యమించే నాయకత్వాన్ని అందించేందుకు బీసీ సృజనకారులు కృషి చేయాలని జూలూరు కోరారు. ఈ సభకు ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు ప్రొఫెసర్ డా॥ఎస్.రఘు అధ్యక్షత వహించగా ప్రఖ్యాత సాహితీవేత్తలు పరమాత్మ, కోయి కోటేశ్వరరావు, ఏ.కె.ప్రభాకర్, తెలంగాణ పబ్లికేషన్స్ అధినేత కోయ చంద్రమోహన్, గ్రంథ రచయిత కె.పి.అశోక్‌కుమార్ తదితరులు ప్రసంగించారు.