పలు సమస్యల పరిష్కారానికి కలెక్టర్ హామీ
కలెక్టరేట్ వద్ద అన్నదాతల హర్షధ్వానాలు
పాల్ఘడ్ : సాగుచేస్తున్న భూమిపై రైతులకే యాజమాన్య హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 50 వేల మందికి పైగా రైతులు మహారాష్ట్రలోని చరోతి నుంచి పాల్ఘడ్ వరకు పెద్దఎత్తున చేపట్టిన లాంగ్‌మార్చ్ ఫలించింది. స్థానికంగా పలు సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, పాల్ఘడ్ జిల్లాలో ప్రతిపాదిత వాద్వాన్, ముర్బె ఓడరేవుల నిర్మాణాలను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో చేపట్టిన ఈ లాంగ్‌మార్చ్ అనంతరం స్థానిక కలెక్టరేట్ వద్ద అన్నదాతలు బైటాయించి ఘెరావ్ నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.
బీజేపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రైతులు వెనుదిరగక పోరు కొనసాగించారు. సమస్యలు పరిష్కరించేవరకు కదిలే ప్రసక్తేలేదని బైటాయించారు. దీంతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. మూడో రోజు (బుధవారం) సాయంత్రం సీపీఐ(ఎం) నాయకులు డాక్టర్ అశోక్ ధావలె, ఎమ్మెల్యే వినోద్ నికొలె, కిరణ్ గహాలా తదితరులతో కూడిన ప్రతినిధి బృందంతో కలెక్టర్ డాక్టర్ ఇందు రాణి జఖర్, సంబంధిత విభాగాల అధికారులు దాదాపు ఏడు గంటల పాటు చర్చలు జరిపారు. స్థానికంగా పరష్కరించగలిగే సమస్యలన్నిటినీ వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ ఇందురాణి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో ఈ నెల 21వ తేది రాత్రి నుంచి ఆందోళన విరమించినట్టు సీపీఐ(ఎం) నేతలు డాక్టర్ అశోక్ ధావలె, ఎమ్మెల్యే వినోద్ నికొలె, కిరణ్ గహాలాలు ప్రకటించారు. కలెక్టర్ హామీ పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ ఎర్రజెండాలు చేబూని విజయోత్సవాలు జరపుకున్నారు.



