అందుకే ‘ఉపాధి హామీ’ నుంచి పేరు తొలగించారు : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్‌గౌడ్
ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష
నవతెలంగాణ- బేగంపేట్
గాంధీ పేరు చెబితేనే మోడీ, అమిత్ షా గుండెల్లో రైళ్లు పరుగెతుతున్నాయని, అందుకే ఆయన పేరును మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి తొలగించారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. వారు నిజమైన గాడ్సే వారసులు కాబట్టే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేశారన్నారు. ‘మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ’ నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతోపాటు కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు. గాంధీ పేరు చెప్పగానే ప్రజలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ గుర్తుకు వస్తారని, రాజకీయంగా వారిని ఎదుర్కోలేక.. ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరును తొలగించారని అన్నారు. ఇది దేశప్రతిష్టకు భంగం కలిగించే అంశమన్నారు.
2014లో ఈ చట్టానికి నిధులు కోత పెట్టారని, ఇప్పుడు గాంధీ పేరును తొలగించడంతోపాటు ఈ చట్టం భారం రాష్ట్రాలపై మోపుతూ క్రమంగా దాన్ని తొలగించే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సంఖ్యాబలం ఉందని పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ పేరును మారుస్తామని చెప్పారు. సోనియా గాంధీ అనంతపురం పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల దీన పరిస్థితికి చలించిపోయి.. అలాంటి వారికి రెండు పూటలా కడుపు నింపాలనే ఆలోచనతో 100 రోజుల ఉపాధి కల్పించే విధంగా పార్లమెంట్ ద్వారా ఈ చట్టం రూపకల్పనకు కృషి చేశారని తెలిపారు. గాంధీ పేరు తొలగింపు బిల్లుపై సభలో రాహుల్, ఖర్గే ఎంత వాదించినా అధికార పక్షం వ్యతిరేకించి.. దాన్ని ఆమోదించుకున్నారంటే వారి మనసుల్లో గాంధీపై ఎంత విద్వేషం ఉందో తెలుస్తున్న దన్నారు. ఎన్ని తంత్రాలు చేసినా జాతిపిత మహాత్మా గాంధీ పేరును ప్రజల హృదయాల్లో నుంచి తొలగించలేరన్నారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐ, ఈడీ కేసులు బనాయిస్తే కోర్టు మొట్టికాయలు వేసిందని, అయినా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పేదల కడుపు నింపేందుకు తెచ్చిన ఉపాధి హామీ పట్టం ప్రపంచంలో ఎక్కుడా లేదని, దాన్ని నిర్వీర్యం చేసి ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం దురాలోచనలు చేయడం సరికాదన్నారు. దీనిపై శాంతియుత పోరాటాలు కొనసాగిస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పేదల ఉపాధిని దెబ్బతీయడానికి, గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, ఎమ్మెల్యేలు శ్రీగణేష్, నవీన్ యాదవ్, మాజీ ఎంపీ హన్మంతరావు, నాయకులు ఫిరోజ్‌ఖాన్, కోదండరెడ్డి, ఆదం సంతోష్ కుమార్, రోహిణిరెడ్డి, త్రికాల మనోజ్ కుమార్, మల్లికార్జున్, సంతోష్ యాదవ్, కె.కుమార్‌రెడ్డి, బొజ్జు వెద్మా, సంపత్, ఉమార్, దీపక్, జాన్ తదితరులు పాల్గొన్నారు.



