చరిత్ర పాఠ్యపుస్తకాల్లోంచి విషయాల్ని తొలగించి, చరిత్రను మరుగుపరచగల మనుకోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోంచి మొఘలుల చరిత్రను పూర్తిగా తొలగించి, రాబోయే తరాలను అజ్ఞానంలో ఉంచాలనుకుంటున్న నేటి కేంద్ర ప్రభుత్వం, దాని ఆధ్వరంలో పనిచేస్తున్న ఎన్‌సీఈఆర్‌టీ (National Council of educational Research and Training) పథకం ఏ మాత్రం పనిచేయదు. ఎందుకంటే అప్పటి చరిత్రను వందల సంఖ్యలో చరిత్రకారులు గ్రంథస్తం చేశారు. అప్పటి కాలాన్నీ, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ సినిమాలు, టెలివిజన్ సీరియళ్లు ఎన్నెన్నో వచ్చాయి. వీటన్నిటికంటే ఢిల్లీ, ఆగ్రాలలో వారు కట్టించిన చారిత్రక కట్ట డాలు సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి. ప్రపంచ పర్యాటకుల్ని అవి ఈనాటికీ ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ తరానికి కొంత సమాచారమివ్వడానికి కావాలనే నేనిక్కడ మొఘల్ చక్రవర్తుల వివరాలు పొందుపరుస్తున్నాను. ఇంకా లోతుగా అధ్యయనం చేయాలనుకునే వారికి పుస్తకాలున్నాయి. గుగూల్ ఉంది. ఆన్‌లైన్ సైట్స్ ఎన్నో ఉన్నాయి.
అశోక చక్రవర్తి తర్వాత, సుమారు వెయ్యి సంవత్సరాలకు గుప్తరాజుల కాలంలో మళ్లీ ఒకసారి భారతదేశం ఉచ్ఛస్థితికి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ తొమ్మిది వందల ఏండ్ల తర్వాత, ఈ దేశం మొఘలుల కాలంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అశోకుడి తర్వాత భారత ఉపఖండాన్ని ఒకే ఒక్క భూభాగంగా, ఒకే ఒక్క పరిపాలనలోకి తెచ్చినవారు మొఘులులు. అంతకుముందు ఈపని వేరే రాజులకు సాధ్యం కాలేదు. చిన్నచిన్న రాజ్యాలుండేవి. కానీ, ఆ రాజులు వాళ్లలో వాళ్లే యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. మొఘలులు దోపిడీదారులని, ఈ దేశాన్ని దోచుకుని పోయారని ఎన్సీఈఆర్టీ అధికారులు ఒక కుంటిసాకు చెప్పారు. వారు దోపిడీదారులైతే, వారు దోచుకున్నది ఏమిటీ? దోచు కున్నది తరలించి ఎక్కడ దాచుకున్నారూ? మొదట వచ్చిన బాబర్ తప్ప, మిగతా మొఘలులంతా ఇక్కడే పుట్టి, ఇక్కడే ఈ మట్టిలో కలిసి పోయారు. తాము భారతీయులమన్న భావనతోనే ఉన్నారు. ఏమైనా సాధారణ శకం 1526 నుండి 1857 దాకా పాలించిన మొఘల్ పాల కుల జాబితా ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో మొదటి ఆరుగురు చాలా ప్రసిద్ధులు. తర్వాత 7 నుండి 17 దాకా రాజ్యానికి వచ్చిన వారు అంత ప్రసిద్ధులు కారు. కారణం వారు కొన్నేండ్లు! కొన్ని నెలలు/ కొన్ని రోజులు మాత్రమే పాలించిన వారు. వీరిని తరువాతి మొఘలులు (LATER MOGHALS) అంటారు.
చివరి చక్రవర్తులు నిలదొక్కుకుని, 20-30 ఏండ్లు పరిపాలించారు. చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కూడా ఇరవైఏండ్లు పాలించాడు. అయితే, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో దేశంలోకి ప్రవేశించిన బ్రిటీష్ వారు ఈయన నుండి పరిపాలనా పగ్గాలు లాక్కున్నారు. దానితో దేశం పూర్తిగా విక్టోరియా రాణి అధీనంలోకి వెళ్లిపోయింది. అప్పుడు బహదూర్ షా జఫర్ ఊరికే ఏమీ కూర్చొ లేదు. దేశ స్వాతంత్య్రం కోసం నిరంతరం బ్రిటీష్‌వారితో పోరాడుతూనే వచ్చాడు. ఆయన అడ్డు తొలగించుకోవడానికి చివరకు ఆయన్ను దేశం నుంచి బహిష్కరించి, రంగూన్ పంపించారు. (అదే ఇప్పుడు మయన్మార్‌లో అతిపెద్ద నగరం-యాన్‌గాన్). బహదూర్‌షా అక్కడే మరణించాడు. ఆయన సమాధి అక్కడే ఉంది. సుభాష్ చంద్రబోస్ గానీ, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీగానీ, ఆయన సమాధిని సందర్శించిన ఈ దేశ నాయకులందరూ అక్కడ ఆయనకు నివాళులర్పించి, తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా కొనియాడుతూ వచ్చారు.
బహదూర్ షా జఫర్ దేశ బహిష్కరణకు గురైన తర్వాత, మొఘల్ వంశస్తులంతా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. తరాలు మారుతూ సంపద తరిగిపోతూ వాళ్లు సామాన్య పౌరులుగా మిగిలారు. ఇక్కడే ఉత్తర భారతదేశంలోని నగరాల్లో చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికారు. అది కూడా చేతకాని దీనస్థితిలో ఉన్నవారైతే, చీకటి పడ్డతర్వాత ఎవరూ గుర్తు పట్ట కుండా తలమీద నుండి ముసుగు వేసుకుని వీధుల్లో బిచ్చమెత్తుకున్నారు. ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే- వారు ఇక్కడే భారతీయులుగా పుట్టి, భారతీయులుగా పెరిగి, ఇక్కడే భారతీయులుగానే చనిపోయారు కాబట్టి! తమ దేశం ఎక్కడో ఉందని పారిపోలేదు కాబట్టి! పరిస్థి తులు ఎలాంటివైనా ఇక్కడే ఎదుర్కొన్నారు కాబట్టి. అలాంటి వారిని దోపిడీదారులు, మోసగాళ్లు అని ప్రభుత్వపెద్దలు ముద్ర వేయడం బాగుందా? రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు వారికి వంత పాడడం బాగుందా? దేశ పౌరులుగా ఇది మనం ఆలోచించాల్సిన విషయం!
సమకాలీనంలోని ముస్లింలంతా మొఘల్ వంశస్తులు కారు. అనేకానేక కారణాల వల్ల హిందువులే చాలామంది ఇస్లాం స్వీకరించిన వారున్నారు. మరి వాళ్లంతా దోపిడీదారులు, మోసగాళ్లు కారుకదా? వాళ్లంతా భారతీయులే కదా? దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖపాత్ర పోషించిన ముస్లింలను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్న ఈ ఆరెస్సెస్- బీజేపీవారు ఆత్మ విమర్శ చేసుకోరు. బ్రిటీషు వారి కాళ్ల మీద పడి పలుమార్లు క్షమాపణలు కోరుకుంటూ బతికిన విషయం గుర్తుపెట్టుకోరు. వారు, వారి గతం గుర్తుపెట్టుకోకుంటే ఏమైంది? ఈ దేశ పౌరులుగా మనం గుర్తుపెట్టుకుంటాం కదా? ఎక్కడ బుద్ది చెప్పాలో అక్కడ చెపుతూనే ఉంటాం కదా?
”గౌరవనీయమైన అధ్యాయం మొఘలుల కాలంలోనే ప్రారంభమైంది! చరిత్రలో ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం!! ఈ విషయంలో బ్రిటీషువారి అవధారణ కేవలం రాజకీయపరమైంది. అది పూర్తిగా అసత్యం కూడా!” – నేతాజీ సుభాస్ చంద్రబోస్.
(నేతాజీ సంపూర్ణ వాజ్మయ సంపుటి : ఆధ్యాయం:12. పేజి 274. ప్రచురణల విభాగం: భారత ప్రభుత్వం)
ఇది ఎవరో అలవోకగా చెప్పిన మాటకాదు. నేరుగా భారత ప్రభుత్వ ప్రచురణల విభాగం వారు ప్రచురించిన గ్రంథంలో నమోదైన వ్యాఖ్య ! మొఘలులు ఈ దేశాన్ని దోచుకుని వెళ్లిన దోపిడీ దారులైతే, మోసగాళ్లయితే నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఈ మాట ఎందుకంటారూ? నేతాజీకన్నా గొప్పవారా నేటి ఈ అంధభక్తులూ? ఇకపోతే నేతాజీ రంగూన్ వెళ్లి, అక్కడ బహదూర్ షా జఫర్ సమాధిని సందర్శించడం ఒక గొప్ప చారిత్రక సంఘటన! 1943 సెప్టెంబర్ 26న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్ కమాండర్ సుభాష్ చంద్రబోస్, బహదూర్‌షా జఫర్ సమాధిని రంగూన్‌లో దర్శించి, నివాళులు అర్పించాడు. తన సైనికులతో అక్కడ పరేడ్ జరిపించి, సైనిక వందనం చేయించాడు. సమాధి దగ్గర యాభైవేల రూపాయలు నజరానాగా సమర్పించాడు. బ్రిటీష్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడని బహదూర్ షాజఫర్‌ను కొనియాడుతూ అక్కడ రిజిస్టర్‌లో తన అభిప్రాయం రాశాడు. ఆ స్థలం హిందూ, ముస్లిం, సిక్కుల ఐక్యతను చాటుతుందని ప్రకటించాడు. అక్కడి నుంచే అప్పుడే తన ‘ఢిల్లీ ఛలో’ – నినాదాన్నిచ్చాడు. 1943లో యాభై వేల విలువ ఎంతో మనం అంచనా వేసుకోగలం. మొఘలులు దేశ ద్రోహులైతే, సుభాష్ చంద్రబోస్ అంత పెద్ద మొత్తం ఆ చివరి చక్రవర్తి సమాధి దగ్గర సమర్పించి వస్తాడా? తమను తాము దేశభక్తులుగా ప్రమోట్ చేసుకునే ఈ అబద్దాల చక్రవర్తులు దేశ ప్రజలు నిజాలు తెలుసుకోలేరని అనుకుంటారేమో! ప్రజల దృష్టిలో నానాటికీ ఎంత చులకన అయిపోతున్నారో అంచనా వేసుకోలేకపోతున్నారు.
భవిష్యత్తును మార్చుకోవడం మన చేతిలో ఉంటుంది. కానీ గతాన్ని మార్చడం ఎవరి వల్లా కాదు. మంచో చెడో జరిగిపోయింది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. గతంలో నుంచి మంచిని స్వీకరించాలి. చెడును వదిలేయాలి. గత చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా భావి తరాలకు చెప్పకపోతే, వారికి సరైన, సమగ్రమైన అవగాహన ఎలా కలుగుతుందీ? ఒకటి మాత్రం నిజం. దేన్నో దాచిపెట్టాలని కుట్ర పూరి తంగా వ్యవహరిస్తే మాత్రం – అదే విస్తృతంగా ప్రచారంలోకి వెళుతుంది. విత్తును భూమిలో దాచిపెట్టాలని ప్రయత్నిస్తావా? అది మొక్కయి, తరువాత మహావృక్షమవుతుంది కదా? ఏది ఏమైనా నేటి బీజేపీ ప్రభుత్వం ప్రపంచ దేశాలలో పూర్తిగా విలువ పోగొట్టుకుంది. మొఘలులు గాని, బ్రిటీష్ వారుగానీ దేశాన్ని ఇంతగా దిగజార్చలేదు. అంతవరకు కచ్చితంగా చెప్పుకోవచ్చు – తప్పుల మీద తప్పులు చేస్తూ తప్పుడు మార్గంలో అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వానికి చరిత్రను, సైన్సును మార్చే అర్హత లేదు. ‘ఓట్‌చోరీ’ బయట పడ్డాక, అసలు అధికారంలో కొనసాగే అర్హతే లేదు.
(సెప్టెంబర్ 26 సుభాష్ చంద్రబోస్ బహదూర్ జఫర్ సమాధిని సందర్శించిన రోజు)
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త.
- బాబర్ (21 ఏప్రిల్ 1526 – 26 డిసెంబర్ 1530) సుమారు నాలుగేండ్లు పాలించాడు.
- హుమాయూన్ (26 డిసెంబర్ 1530-17 మే 1540) మొదటిసారి. (22 జూన్ 1555-27 జనవరి 1556) రెండోసారి (మధ్యలో కొంత కాలం శేరే సూరి రాజయ్యాడు)
- అక్బర్-ఐ- ఆజమ్ (11 ఫిబ్రవరి 1556-27 అక్టోబర్ 1605) యాభై యేండ్లకు పైగా పాలించాడు.
- జహంగీర్ (3 నవంబర్ 1605-28 అక్టోబర్ 1627) ఇరవై రెండేండ్లు.
- షాజహాన్ (19 జనవరి 1628-31 జులై 1658) ముప్పయేండ్లు.
- జౌరంగజేబు (31 జులై 1658-3 మార్చి 1707) 49 ఏండ్లు.
- ఆజమ్ షా (14 మార్చి 1707 – 20 జూన్ 1707) సుమారు 3 నెలలు.
- బహదూర్‌షా-1 (19 జూన్ 1707-27 ఫిబ్రవరి 1712) ఐదేండ్లు. ఈయనను మొదటి షా ఆలం అని కూడా అంటారు.
- జహందర్ షా (29 మార్చి 1712-11 ఫిబ్రవరి 1713) సంవత్సరం
- ఫారుఖ్ సియార్ (1) జనవరి 1713 – 28 ఫిబ్రవరి 1719) ఆరేండ్లు.
- రఫీ ఉద్ దారాజత్ (28 ఫిబ్రవరి – 6 జూన్ 1719) సుమారు 3 నెలలు.
- షాజహాన్-2 (6 జూన్ 1719- 17 సెప్టెంబర్ 1719) సుమారు 3 నెలలు.
- జహంగీర్-2(15 అక్టోబర్ 1720-13 నవంబర్ 1720) ఇరవై ఎనిమిది రోజులు.
- మహ్మద్ షా (27 సెప్టెంబర్ 1719-26 ఎప్రిల్ 1748) ఇరవై తొమ్మిదేండ్లు.
- అహ్మద్ షా బహదూర్ (29 ఎప్రిల్ 1748-2 జూన్ 1754) ఆరేండ్లు.
- అలంఘీర్-2 (3 జూన్ 1754-29 నవంబర్ 1759) ఏడేండ్లు.
- షాజహాన్-3 (10 డిసెంబర్ 1759 – 10 అక్టోబర్ 1760) సుమారు 10 నెలలు.
- షా ఆలమ్-2 (10 అక్టోబర్ 1760 – 31 జులై 1788) ఇరవై ఎనిమిదేండ్లు.
- అక్బర్- 2 (19 నవంబర్ 1806 -28 సెప్టెంబర్ 1837) 31ఏండ్లు.
- బహదూర్ షా జఫర్ (28 సెప్టెంబర్ 1837-21 సెప్టెంబర్ 1857) ఇరవయేండ్లు
డాక్టర్ దేవరాజు మహారాజు