Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంఅది సీఎం చేసిన హత్యే సీఎం రేవంత్‌ రెడ్డి

అది సీఎం చేసిన హత్యే సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

– వడదెబ్బకు అన్నదాత మృతి చెందటంపై కేటీఆర్‌ విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వడదెబ్బకు ధాన్యపు కుప్పలపైనే అన్నదాత మృతి చెందాడనీ, ఇది సీఎం రేవంత్‌ చేసిన హత్యేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన రైతు గుగులోతు కిషన్‌ (51) పంట కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో ప్రాణాలు కోల్పోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ”ఓవైపు ముఖ్యమంత్రి అందాల పోటీల్లో మునిగితేలుతుంటే, మరోవైపు వడదెబ్బకు తాళలేక ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచిన దురదృష్టకర పరిస్థితి. ఇది ముమ్మాటికీ సీఎం చేసిన హత్యే” అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ”పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి, రుణమాఫీ పేరిట మోసం చేసి, చివరికి పండిన పంటను సైతం కొనకపోవటంతో రైతన్న అనాథల్లా మారారు. ఇది కేవలం నిర్వాకం కాదు.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.”అని అన్నారు. ”ఓవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలతో కండ్లముందే నాశనమవుతోంది. మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతులు బలవుతున్నారు. ఈ దయనీయ పరిస్థితులకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌ సర్కారుదే” అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”రైతులు కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి పడిగాపులు పడుతున్నారు. కానీ పట్టించుకునే నాథుడే లేడు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది” అని వ్యాఖ్యానిం చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన గుగులోతు కిషన్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా సీఎంకి సోయి ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -